యాక్సిడెంట్‌కి 5 ఏళ్లు... వెల్‌డన్‌ సాయి ధరమ్‌ తేజ్‌

సాయి ధరమ్‌ తేజ్ మరోసారి తన యాక్సిడెంట్‌ గురించి సోషల్‌ మీడియా ద్వారా స్పందించాడు.

Update: 2026-09-24 09:53 GMT

సాధారణంగా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేం. ఆ సంఘటనలు కొన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ సంతోషించేవిగా ఉంటే, మరికొన్ని బాబోయ్‌ ఆ సంఘటన మళ్లీ గుర్తు చేసుకోవద్దు అని, ఒకవేళ గుర్తుకు వస్తే భయంతో వణికి పోతాం అనే వాళ్లు ఉంటారు. యాక్సిడెంట్‌ వంటి సంఘటనలు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాలి అనుకోరు. ఒకసారి యాక్సిడెంట్‌కి గురి అయిన వారు దాని నుంచి బయట పడేందుకు చాలా సమయం తీసుకుంటారు. అందుకే అలాంటి సంఘటన గుర్తు చేసుకోవడానికి కూడా భయపడుతారు. అయితే మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మాత్రం తన యాక్సిడెంట్‌ విషయాన్ని చాలా సార్లు, చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ సంఘటన తన జీవితంలో చాలా మార్పులు తీసుకు వచ్చిందని, తన కోసం చాలా మంది ఉన్నారని తెలియజేసిందని ఆ మధ్య ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.




 


సాయి ధరమ్‌ తేజ్ యాక్సిడెంట్‌...

సాయి ధరమ్‌ తేజ్ మరోసారి తన యాక్సిడెంట్‌ గురించి సోషల్‌ మీడియా ద్వారా స్పందించాడు. ఈసారి తనకు యాక్సిడెంట్‌ జరిగి ఐదేళ్లు అయిన సందర్భంగా మరింతగా ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ చేసిన ఎమోషనల్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన పునర్జన్మ దినం అంటూ ఈ రోజును ప్రత్యేకంగా ఆయన గుర్తు చేసుకున్నాడు. నా కుటుంబం, అభిమానులు, సినీ ప్రేమికుల ప్రార్థనల వల్ల సరిగ్గా ఐదేళ్ల క్రితం ఈ రోజున నాకు పునర్జన్మ లభించింది. 90 శాతం గాయాల నుంచి కోలుకున్నాను. మరి కొన్నాళ్లకు కచ్చితంగా పూర్తిగా రికవరీ కాగలను. నా మాటతీరు, మరికొన్ని సమస్యలపై ప్రస్తుతం వర్కౌట్‌ చేస్తున్నట్లుగా సాయి ధరమ్‌ తేజ్ పేర్కొన్నాడు. ప్రతి రోజు ముందడుగు వేస్తూ వస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మునుపటి ఉత్సాహంతో మీ ముందుకు వస్తాను.




 


మెగా హీరోకి మెగా ఫ్యాన్స్‌ సపోర్ట్‌...

ఈ ప్రత్యేక సమయంలో నేను మీ అందరికీ చెప్పదల్చుకున్నది ఒక్కటే.. మీ ప్రేమ నన్ను ఎప్పటికీ విడిచి పెట్టదు. నా కష్టంలోనూ, నాకు తగిలిన ఎదురు దెబ్బలోనూ ప్రతి క్షణంలోనూ ముందుకు సాగే శక్తిని మీరు నాకు ఇచ్చారు. అందుకే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. ఐదేళ్ల తర్వాత నేను ఇంకా ఇక్కడ నిలబడి ఉండటం కు కచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం. నేను ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాను. నా కోసం చేసిన ప్రతి ప్రార్థనకు కృతజ్ఞుడిని, మీ యొక్క ప్రేమకు ధన్యవాదాలు. మీరు లేకుండా నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ప్రతి ఒక్కరి ఆశీస్సులతో మరింత ముందుకు ఉత్సాహంగా వెళ్తాను అంటూ పోస్ట్‌ చేశాడు. ప్రతి ఏడాది సాయి ధరమ్‌ తేజ్ ఈ విషయాన్ని గుర్తు చేసుకోవడంను చాలా మంది లైట్‌ తీసుకుంటున్నారు. కానీ ఆయన ఇలా గుర్తు చేసుకోవడం మంచికే అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బైక్ నడిపే సమయంలో హెల్మెట్‌ ప్రాధాన్యత...

సాయి ధరమ్‌ తేజ్ ఆ రోజు యాక్సిడెంట్‌ సమయంలో హెల్మెట్‌ పెట్టుకుని ఉన్నాడు. ఆ హెల్మెట్‌ లేకుంటే కచ్చితంగా ఈ రోజు సాయి ధరమ్‌ తేజ్ అనే హీరో ఉండేవాడు కాదు. ఆ విషయాన్ని ఈ మెగా హీరో చాలా సార్లు ఒప్పుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే మాట చెప్పాడు. అంటే బైక్‌ నడిపే సమయంలో హెల్మెట్‌ అనేది ఎంత ప్రాధాన్యతను కలిగి ఉందో సాయి ధరమ్‌ తేజ్ పదే పదే చెబుతున్నాడు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ హెల్మెట్‌ ప్రాధాన్యతను చెప్పడం అనేది కేవలం సాయి ధరమ్‌ తేజ్‌కే చెల్లింది. మరే హీరో అయినా ఈ సంఘటన గురించి ఇంతగా గుర్తు పెట్టుకుని ఉండక పోవచ్చు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సాయి ధరమ్‌ తేజ్‌ హెల్మెట్‌ యొక్క ప్రాధాన్యత చెప్పడం కోసం తన యాక్సిడెంట్‌ విషయాన్ని గురించి చెబుతున్నాడు. అందుకే సాయి ధరమ్‌ తేజ్ శభాష్‌ అని, వెల్‌డన్‌ సాయి ధరమ్‌ తేజ్‌ అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News