అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!
| కృతి సనన్, లండన్ వ్యాపారవేత్త కబీర్ బహియా డేటింగ్ వార్తలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కబీర్ పుట్టినరోజున ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీతో అతడి ఫొటోను కృతి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో వీరిద్దరి ప్రేమాయణంపై ఊహాగానాలు మరింత పెరిగాయి.
ప్రేమ విషయాన్ని పెళ్లి పీటలెక్కే వరకు బయటపెట్టనని బల్లగుద్ది మరీ చెప్పిన కృతి సనన్ ఇప్పుడు మాటలతో కాక తన చేతలతోనే అసలు సంగతిని బయటపెడుతోంది. లండన్ వ్యాపారవేత్త కబీర్ బహియాతో అమ్మడే డేటింగ్‌లో ఉందంటూ రెండేళ్లుగా వినిపిస్తున్న వార్తలకు తాజాగా మరో బలమైన ఆధారం దొరికింది. కబీర్ పుట్టినరోజు సందర్భంగా కృతి పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ బాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.
సూర్యాస్తమయం వేళ బీచ్ ఒడ్డున కబీర్ సరదాగా ఫోజిచ్చిన ఓ క్యాండిడ్ ఫొటోను కృతి తన స్టోరీలో పంచుకుంది. `హ్యాపీ బర్త్‌డే క్యూటీ` అంటూ రెడ్ హార్ట్.. దిష్టి తగలకుండా ఉండే ఎమోజీలను జతచేసి మనసులో ఆప్యాయతను చాటుకుంది. పైకి స్నేహితులుగా వ్యవహరిస్తున్నా? ఆ పిలుపులోనూ ఆ ఎమోజీలలోనూ దాగి ఉన్న అర్థాన్ని అభిమానులు పట్టేస్తున్నారు. కృతి సోదరి నుపూర్ సనన్ సైతం పెళ్లి నాటి ఫొటోను షేర్ చేసి కబీర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం విశేషం.
నిజానికి ఇద్దరి మధ్య స్నేహం ఈనాటిది కాదు. 2024లో లండన్ వీధుల్లో చేతిలో చేయి వేసుకుని కనిపించినప్పటి నుంచి గ్రీస్ విహారయాత్రలు.. దుబాయ్ న్యూ ఇయర్ వేడుకల వరకు ప్రతి చోటా ఈ జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూనే ఉంది. మొన్నటి దీపావళి వేడుకల్లోనూ కృతి కుటుంబ సభ్యులతో కలిసి కబీర్ సందడి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ మధ్య జూలైలో కృతి పుట్టినరోజున కబీర్ కూడా యాచ్‌పై దిగిన ఫొటోను పంచుకుని ప్రేమను కురిపించాడు.
కబీర్ బహియా సామాన్యుడేమీ కాదు. యూకేలోని ప్రముఖ సౌతాల్ ట్రావెల్ సంస్థ వ్యవస్థాపకుడు కుల్జిందర్ బహియా కుమారుడిగా.. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా గుర్తింపు ఉంది. 36 ఏళ్ల కృతి.. 27 ఏళ్ల కబీర్ మధ్య తొమ్మిదేళ్ల వయసు వ్యత్యాసం ఉండటం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వయసు అంతరం ఉన్నా ? ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం అద్భుతంగా కుదిరిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కృతి సనన్ వ్యక్తిగత జీవితం గురించి పెళ్లయిన రోజే మాట్లాడతానని స్పష్టం చేసింది. కానీ ఇటీవల ఆమె షేర్ చేస్తున్న ఫొటోలు చూస్తుంటే అధికారిక ప్రకటన లేకపోయినా? త్వరలోనే ఈ జంట నుంచి శుభవార్త వినడం ఖాయమనిపిస్తోంది. కృతి సనన్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది `కాక్ టెయిల్ 2` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతానికైతే? అమ్మడి లైనప్ లో కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ కనిపించలేదు.