వారణాసిలో 20 నిమిషాల రామాయణం
పురాణ గాథల్ని తెరకెక్కించడంలో తెలుగు దర్శకులను మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.;
పురాణ గాథల్ని తెరకెక్కించడంలో తెలుగు దర్శకులను మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఇండియాలో వచ్చిన బెస్ట్ మైథాలజీస్ అన్నీ తెలుగు నుంచి వచ్చినవే. ఐతే కాల క్రమంలో సినిమా కథల తీరు మారిపోవడంతో ఇక్కడ పురాణ గాథలు కూడా తగ్గిపోతూ వచ్చాయి. ఐతే పూర్తి స్థాయి మైథాలజీలు తీయడం దాదాపు ఆగిపోయినా.. అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల్లో స్పెషల్ ఎపిసోడ్స్ పెట్టి అప్పటి పాత్రలను ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు దర్శకులు.
‘కల్కి’ సినిమాలో మహాభారతం నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను నాగవంశీ ఎంత అద్భుతంగా తెరకెక్కించాడో తెలిసిందే. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి కూడా అదే బాటలో సాగబోతున్నాడు. తాను తెరకెక్కిస్తున్న ‘వారణాసి’లో త్రేతాయుగం నాటి సన్నివేశాలు ఉంటాయని.. మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపిస్తాడని ఇప్పటికే వెల్లడించాడు రాజమౌళి.
ఈ సినిమాలో రామాయణం నేపథ్యంలో సన్నివేశాలు 20 నిమిషాలు ఉంటాయని రాజమౌళి తనయుడు.. ‘వారణాసి’ నిర్మాతల్లో ఒకరైన కార్తికేయ వెల్లడించాడు. ‘వారణాసి’ని ప్రమోట్ చేసే క్రమంలో మెక్సికోలో జరిగిన ఒక ఈవెంట్‌కు వెళ్లిన కార్తికేయ.. అక్కడ ఈ విషయం తెలిపాడు. సినిమాలో మైథలాజికల్ టచ్ ఉన్న సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని.. రామాయణ నేపథ్యంలో 20 నిమిషాల పాటు ఆ ఎపిసోడ్ ఉంటుందని అతను స్పష్టం చేశాడు. ఈ సినిమా రకరకాల కాలమానాల్లో నడుస్తుందన్న విషయం గత ఏడాది రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియోలోనే వెల్లడైంది.
ప్రస్తుతం చిత్ర బృందం అంటార్కిటికా నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుపుతోంది. రామాయణం నేపథ్యంలో ఎపిసోడ్‌ను చాలాముందుగానే పూర్తి చేశారు. రాముడి పాత్రలో మహేష్‌ను చూడడం కనువిందే అన్నది చిత్ర వర్గాల మాట. సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న గ్లోబల్ లెవెల్లో భారీగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.