ఏ ప‌బ్లిసిటీకి రాని న‌య‌న‌తార 'టాక్సిక్' కోసం వ‌చ్చారేమిటీ!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన‌ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ `టాక్సిక్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అభిమానుల కోలాహలం మధ్య బెంగ‌ళూరులో అత్యంత వైభవంగా జరిగింది.

Update: 2026-08-08 18:10 GMT

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన‌ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ `టాక్సిక్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అభిమానుల కోలాహలం మధ్య బెంగ‌ళూరులో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లకు దూరంగా ఉండే నయనతార, ఈ ఈవెంట్‌కు హాజరై ప్రసంగించడంతో వేదిక వద్ద ఉన్న అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ సందర్భంగా సీనియ‌ర్ న‌టి మాట్లాడిన స్ఫూర్తివంతమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.. తాను వేదికలపై మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడనని... అయితే ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమైనది కావడంతోనే ఇక్కడికి వచ్చానని తెలిపారు. కథానాయకుడు యష్ కేవలం ఒక్క ఫోన్ కాల్ చేసి ఆహ్వానించగానే మరో ఆలోచన లేకుండా తాను ఈ ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నానని చెప్పారు. చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ అద్భుతమైన విజన్... కథనాన్ని నడిపించిన తీరు చూసి తాను ముగ్ధురాలినయ్యానని... ఇప్పటివరకు చూసిన ట్రైలర్ ఒక శాంపిల్ మాత్రమేనని... థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల మతులు పోగొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో నటించిన తోటి కథానాయికల గురించి నయనతార ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటనను ఆకాశానికెత్తుతూ..``కియారా కెరీర్‌లోనే `టాక్సిక్` బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది. ఈ సినిమా తర్వాత కియారా ఇమేజ్ `టాక్సిక్‌కు ముందు.. టాక్సిక్ తర్వాత` అనేంతగా మారిపోతుందనడంలో సందేహం లేదు`` అని ప్రశంసించారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన తారా సుతారియా, హుమా ఖురేషీ, రుక్మిణిల నటనను, వారి తోటి అనుబంధాన్ని కూడా నయనతార ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.

కథానాయకుడు యష్ వర్క్ ఎథిక్స్, అంకితభావాన్ని నయనతార విశేషంగా కొనియాడారు. యష్ నిజమైన పనిరాక్షసుడని.. ఒక నటుడిగా ఈ సినిమా కోసం ఆయన చేసిన త్యాగాలు సామాన్యమైనవి కావని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం యష్ దాదాపు నాలుగున్న‌రేళ్లపాటు తన వ్యక్తిగత జీవితాన్ని.. కుటుంబంతో , పిల్లలతో గడిపే సమయాన్ని త్యాగం చేశారని తెలిపారు. కేవలం ఒక నటుడిగానే కాకుండా కో-ప్రొడ్యూసర్‌గా సెట్స్‌లోని ప్రతీ ఒక్కరినీ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్న తీరు యష్‌పై తనకున్న గౌరవాన్ని మరింత పెంచిందని వ్యాఖ్యానించారు.

చివరగా.. యష్ భార్య రాధిక పండిట్ గురించి నయనతార మాట్లాడిన మాటలు అందరి హృదయాలను హత్తుకున్నాయి. ఒక సినిమా బ్లాక్‌బస్టర్ అయినప్పుడు ప్రపంచం అంతా నటీనటుల శ్రమను పొగుడుతుందని.. కానీ వారి వెనుక ఉండి త్యాగాలు చేసే కుటుంబాలను ఎవరూ గుర్తుంచుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. యష్ సాధించిన ఈ అంతర్జాతీయ స్థాయి విజయం వెనుక రాధిక త్యాగం - మద్దతు ఎంతో ఉన్నాయని... ఆమె యష్‌కి అతిపెద్ద బలమని అన్నారు. నయనతార ఇచ్చిన ఈ హార్ట్ ట‌చింగ్ స్పీచ్‌తో `టాక్సిక్` చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పరాకాష్టకు చేరాయి.

Tags:    

Similar News