సినిమా హాళ్లకు ప్రేక్షకులు తగ్గారా! అసలు నిజం ఏంటో తెలుసా?
మల్టీప్లెక్స్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయని.. OTTల ధాటికి థియేటర్ల వ్యాపారం ముగిసిపోయిందనే ప్రచారం కొన్నాళ్లుగా ఊపందుకుంది.
మల్టీప్లెక్స్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయని.. OTTల ధాటికి థియేటర్ల వ్యాపారం ముగిసిపోయిందనే ప్రచారం కొన్నాళ్లుగా ఊపందుకుంది. కానీ భారతదేశంలో ఇటీవల విడుదలైన `స్పైడర్ మేన్` చిత్రం సాధించిన అపూర్వ విజయం ఈ అపోహలన్నింటినీ పటాపంచలు చేసింది. నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో దాదాపు అన్ని షోలు హౌస్‌ఫుల్ కావడం, ప్రీమియం స్క్రీన్లు ముందుగానే బుక్ అయిపోవడం చూస్తుంటే ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేయలేదని.. కేవలం తమ అభిరుచికి తగ్గ `కంటెంట్` కోసం మాత్రమే ఎదురుచూస్తున్నారని స్పష్టమవుతోంది.
ఐమ్యాక్స్ -4డీఎక్స్ - రీక్లైనర్ వంటి ప్రీమియం స్క్రీన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా అమ్ముడవడం.. మొదటి వారంతో పాటు రెండో వారంలోనూ ఫ్యామిలీలు... యువత థియేటర్లకు పోటెత్తడం గమనించదగ్గ పరిణామం. సగటు ప్రేక్షకుడు సాధారణ కంటెంట్ ఉన్న చిత్రాల కోసం థియేటర్లకు వచ్చేందుకు సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అయితే బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన విజువల్ వండర్స్, ఎమోషన్స్ ఉన్న చిత్రాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎంతటి ఆదరణ చూపిస్తారో `స్పైడర్ మేన్` నిరూపించింది.
షాపింగ్ మాళ్లకు ఊపిరిపోసేది సినిమానే!
ఒక బ్లాక్‌బస్టర్ సినిమా ప్రభావం కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లకే పరిమితం కాదు. థియేటర్‌లో పడే ప్రతి టికెట్.. మాల్ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది. సినిమా చూడటానికి వచ్చే ఫ్యామిలీలు, స్నేహితులు.. జంటల వల్ల మాల్స్‌లో ఫుట్‌ఫాల్స్ (జనసందడి) విపరీతంగా పెరుగుతాయి. ఇది నేరుగా ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు - కాఫీ షాప్‌ల వ్యాపారాన్ని పెంచుతుంది.
రెండున్నర గంటల సినిమా అనుభవం కోసం మాల్స్‌కు వచ్చే ప్రేక్షకులు.. అక్కడ సగటున నాలుగు నుండి ఐదు గంటల సమయాన్ని గడుపుతారు. సినిమా చూడటానికి ముందు లేదా తర్వాత రెస్టారెంట్లలో భోజనం చేయడం, బట్టలు, పాదరక్షలు, బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్‌లో సమయం గడపడం వంటివి చేస్తారు. అందుకే ప్రతి షాపింగ్ మాల్‌కి మంచి మల్టీప్లెక్స్ అనేది ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
కంటెంట్ ఉంటే థియేటర్ ఎప్పటికీ వైభోగమే
OTT వేదికలు అందుబాటులోకి వచ్చినా వందలాది మందితో కలిసి థియేటర్‌లో సినిమాను అనుభవించడంలో ఉండే మజా వేరు. హోమ్ స్క్రీన్లపై పొందని అనుభూతిని పెద్ద తెర అందిస్తుంది. అందువల్ల థియేటర్ బిజినెస్ అంతరించిపోవడం లేదు. కేవలం ప్రేక్షకుల ప్రాధాన్యతలు మాత్రమే మారాయి. తమ సమయానికి - ఖర్చు చేసే డబ్బుకు తగ్గ విలువైన కంటెంట్ ఇస్తే.. ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వస్తారనేది ఈ విజయం నేర్పిన ముఖ్యమైన పాఠం.