నిఖిల్- తేజ అన్నదమ్ముల్లా ఒకే మార్గంలో!
టాలీవుడ్‌లో సరికొత్త కంటెంట్‌తో పాన్ -ఇండియా స్థాయిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, తేజా సజ్జా.
టాలీవుడ్‌లో సరికొత్త కంటెంట్‌తో పాన్ -ఇండియా స్థాయిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, తేజా సజ్జా. వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంలో ఇద్దరి శైలి ఒకేలా కనిపిస్తుంది. వినూత్న ప్రయోగాలకు ప్రాధాన్యమిస్తూ, ఒకే రకమైన విజన్‌తో ప్రయాణిస్తున్న ఇద్దరు నటులు పరిశ్రమలో అన్నదమ్ముల్లా ఒకే బాటలో పయనిస్తున్నారనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
`కార్తికేయ 2` చిత్రంతో జాతీయ స్థాయిలో అద్భుత విజయాన్ని అందుకున్న నిఖిల్ తదుపరి ప్రాజెక్ట్‌లను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూనే సాంస్కృతిక, చారిత్రక అంశాలకు ప్రాధాన్యమిచ్చే భారీ చిత్రాలలో నటిస్తున్నారు. ఆయన లైనప్‌లో ప్రస్తుతం `స్వయంభూ` పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. వీటితో పాటు చారిత్రక ప్రాధాన్యత ఉన్న `ది ఇండియా హౌస్` అనే మరో పాన్ -ఇండియా చిత్రం లైన్లో ఉంది. తిరుగులేని బ్లాక్‌బస్టర్ అందించిన ఫ్రాంచైజీలో రాబోతున్న `కార్తికేయ 3` పనులు జరుగుతున్నాయి.
మరోవైపు చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి వచ్చి `హను-మాన్` చిత్రంతో పాన్ ఇండియాలో క్రేజ్ సంపాదించుకున్నారు తేజా సజ్జా. ఫాంటసీ, మైథాలజీ, గ్రాఫికల్ విజువల్స్‌తో కూడిన కథలను నమ్ముకుంటూ తనకంటూ ప్రత్యేక మార్గాన్ని సుగమం చేసుకున్నారు. ప్రస్తుతం తేజ నటిస్తోన్న `మిరాయి2` చిత్రం సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతుండగా .. `జాంబీ రెడ్డి` సీక్వెల్ గా `జాంబీ రెడ్డి 2` పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇలా ఇద్దరి లైనప్‌లను గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన సమానత్వాలు కనిపిస్తాయి. ఇద్దరూ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లకు దూరంగా ఉంటున్నారు. విజువల్స్‌కు ప్రాధాన్యత ఉన్న కాన్సెప్ట్‌లకే జై కొడుతున్నారు. ఒకరికి కార్తికేయ సిరీస్ ఎలాగైతే గ్లోబల్ గుర్తింపు తెచ్చిపెట్టిందో? మరొకరికి `హను-మాన్` క్రేజ్ తెచ్చింది. మైథాలజీ, హిస్టరీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ మిళితం చేసిన కథలను ఎంచుకోవడంలో నిఖిల్, తేజలు ఒకే మైండ్‌సెట్‌తో ముందుకెళ్తున్నారు.
ఈ రకమైన కంటెంట్ ఓరియెంటెడ్ ఎంపికలు టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేవలం ప్రాంతీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా ఉత్తరాది ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునేలా ఇద్దరు సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సేఫ్ బెట్‌గా మారడమే కాకుండా యంగ్ జనరేషన్ హీరోలకు కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.