అమితాబ్ మనవడికి తొలి అడుగే అగ్నిపరీక్ష?
దాయాది దేశం పాకిస్థాన్ దురాగతాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో కథలు బాలీవుడ్ తెరపైకొచ్చాయి.;
దాయాది దేశం పాకిస్థాన్ దురాగతాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో కథలు బాలీవుడ్ తెరపైకొచ్చాయి. అందులో కొన్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే కొన్ని మాత్రం ఎలాంటి ఇంపాక్ట్‌ని కలిగించలేకపోయాయి. ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఎల్ ఓసీ కార్గిల్ నుంచి యూరీ వరకు వచ్చిన వార్ బేస్డ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి.
త్వరలో ఇండో పాక్ వార్ నేపథ్యంలో `బోర్డర్ 2` కూడా రాబోతోంది. ఇటీవల పాక్ లోని గ్యాంగ్‌స్టర్లతో పాటు ఐఎస్ ఐ ఆట కట్టించేందుకు రా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన `ధురంధర్` ఇప్పటికే విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రానున్న రోజుల్లో మ్యాజిక్ ఫిగర్‌ని చేరుకుని సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో 1971 ఇండో -పాక్ వార్ నేపథ్యంలో సాగే కథతో మరోసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే `ఇక్కీస్`. ఈ బయోగ్రాఫికల్ వార్ మూవీతో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యనంద హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇండియన్ ఆర్మీలోనే అతి చిన్న వయస్కుడైన పరమ్‌వీర్ చక్ర గ్రీహీత సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్ర పాల్ రియల్ స్టోరీ ఆధారంగా రూపొందుతోంది.
ఇటీవల మృతి చెందిన వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర, పాథాల్‌లోక్, మహారాజ్ ఫేమ్ జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. 21 ఏళ్ల సెకండ్ లెఫ్టినెంట్ `బాటిల్ ఆఫ్ బసంతర్`లో పాక్ సైన్యాన్ని ఎలా ఫైట్ చేశాడు అనే అంశాల్ని జోడించి తెరకెక్కిన ఈ సినిమాని 2026 జనవరి 1న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ మనవడు హీరోగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో సహజంగానే దీనిపై అందరి దృష్టి పడింది. శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేస్తుండటంతో కంటెంట్‌తో పాటు టేకింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుందనే టాక్ మొదలైంది. అయితే బిగ్‌బి మనవడికి ఈ ప్రాజెక్ట్ అగ్నీపరీక్షే అనే కామెంట్‌లు కూడా వినిపిస్తున్నాయి. ముంజ్యా, చావా నుంచి థామా వరకు వరుస విజయాల్ని..బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకుంటున్న నిర్మాత దినేష్ విజన్ ఈ మూవీని నిర్మిస్తుండటంతో `ఇక్కీస్`పై అంచనాలు ఏర్పడ్డాయి. కంటెంట్ ఆడియన్స్‌ని మెప్పించగలిగితేనే వార్ బేస్డ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతాయి. మరి ఆ విషయంలో `ఇక్కీస్` పై చేయి సాధిస్తే బిగ్‌బి మనవడు పరీక్ష పాసైనట్టే. నటవారసులంతా కమర్షియల్ సినిమాలతో ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టపడుతున్న టైమ్‌లో అగస్త్య నంద `ఇక్కీస్`తో ఎలాంటి ఇంపాక్ట్‌ని కలిగిస్తాడో తెలియాలంటే జనవరి 1 వరకు వేచి చూడాల్సిందే.