శేష్ ఔట్.. ఇక యశ్ సంగతే తేలాలి
‘టాక్సిక్’ టీం ఇప్పటిదాకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది కానీ.. వారిలోనూ ‘దురంధర్-2’ తాలూకు భయం ఉంటుందన్నది స్పష్టం.;
సంక్రాంతి సినిమాల తర్వాత రెండు నెలలు బాక్సాఫీస్ డల్లుగా ఉండబోతోంది. ఇది ఎప్పుడూ జరిగేదే. మార్చి మూడో వారం నుంచి మళ్లీ క్రేజీ సినిమాలు రిలీజవుతుంటాయి. ఈసారి అప్పుడే రంజాన్ పండుగ ఉండడంతో పాన్ ఇండియా స్థాయిలో అది బాగా డిమాండ్ ఉండే వీకెండ్ కాబోతోంది. ఆ వీకెండ్‌కు చాలా ముందుగానే ‘దురంధర్-2’ సినిమాను షెడ్యూల్ చేశారు.
డిసెంబరు 5న ‘దురంధర్’ రిలీజైనపుడే ఈ డేట్‌ను ప్రకటించారు. ఐతే సీక్వెల్ మీద హైప్ ఊహించని స్థాయికి చేరిపోవడంతో ఆ అంచనాలను అందుకోవడం కోసం ఆదిత్య ధర్ అండ్ టీం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టొచ్చని.. అందుకోసం సినిమాను వాయిదా వేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ అలా ఏమీ జరగలేదు. తక్కువ టైం ఉన్నా సినిమాను అదే డేట్‌కే తీసుకువస్తున్నారు. ఐతే అధికారిక ప్రకటన కోసమే అంతా ఎదురు చూస్తూ వచ్చారు. ఈ రోజు ‘దురంధర్-2’ టీజర్ లాంచ్ చేస్తూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది చిత్ర బృందం.
ఈ టీజర్ రావడం ఆలస్యం.. మార్చి 19కే షెడ్యూల్ అయిన అడివి శేష్ మూవీ ‘డెకాయిట్’ వాయిదా పడిపోయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిక మార్చి 19కే రావాల్సిన యశ్ మూవీ ‘టాక్సిక్’ సంగతి ఏమవుతుందో చూడాలి. టాక్సిక్ వాయిదా గురించి ఇంతకుముందు వార్తలు వచ్చాయి కానీ.. అలాంటిదేమీ లేదంటూ గత నెలలో రిలీజ్ చేసిన టీజర్లోనూ టీం స్పష్టం చేసింది. ‘డెకాయిట్’ టీం సైతం టీజర్ లాంచ్ అప్పుడు మార్చి 19కే తమ సినిమా వస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
కానీ ‘దురందర్’ రేంజ్ ఇంకా ఇంకా పెరిగిపోవడం, ఓటీటీలో కూడా ఈ చిత్రానికి అద్భుత స్పందన రావడం, పాన్ ఇండియా స్థాయిలో బంపర్ క్రేజ్‌తో ‘దురంధర్-2’ రిలీజ్ కానుండడంతో ‘డెకాయిట్’ టీంకు వాస్తవం బోధపడి వాయిదా నిర్ణయం తీసుకుంది. ‘టాక్సిక్’ టీం ఇప్పటిదాకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది కానీ.. వారిలోనూ ‘దురంధర్-2’ తాలూకు భయం ఉంటుందన్నది స్పష్టం. ముఖ్యంగా ‘దురంధర్-2’ ఉండగా నార్త్ ఇండియాలో ‘టాక్సిక్’ రిలీజ్‌కు తీవ్ర ఇబ్బంది తప్పదు కాబట్టి ‘టాక్సిక్’ను వాయిదా వేయడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి చిత్ర బృందం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.