స్క్రీన్ మీద ఒకరు.. సెట్స్‌లో ఇంకొకరు.. డైరెక్షన్ క్రెడిట్స్ వెనుక అసలు కథ ఇదేనా?
కొన్నిసార్లు స్టార్ హీరోలు తమకు నచ్చిన విధంగా సినిమా రావాలని దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటారు.;
సినిమా అంటేనే ఒక మాయా ప్రపంచం అన్నది నిజం. ఇక్కడ మనం చూసేది ఒకటి, జరిగేది మరొకటి. ఒక సినిమా విజయం సాధిస్తే క్రెడిట్ అంతా దర్శకుడికి దక్కుతుంది, కానీ ఆ విజయం వెనుక అసలు మాస్టర్ మైండ్ మరొకరు ఉండవచ్చు. టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. పేరు ఒకరిది, పని మరొకరిది అన్నట్లుగా సాగే ఈ 'షో' గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ సంస్కృతి కేవలం కొత్త దర్శకులకే కాదు, స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో కూడా కనిపిస్తుండటం గమనార్హం. అలాంటి సినిమాలు చూస్తే ..
తెర వెనుక చక్రం తిప్పిన హీరోలు:
టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ఇలా తెరవెనుక ఒకరు, ముందు మరొకరు ఉండటం చాల సార్లు చర్చనీయాంశం అయింది..ఇది నిన్న మొన్న మొదలైనది కాదు,అప్పట్లో బాలకృష్ణ నటించిన ‘నరసింహ నాయుడు’ వంటి చిత్రాలకు బి.గోపాల్ దర్శకత్వం వహించిన, కొన్ని కీలక సన్నివేశాల్లో పరుచూరి బ్రదర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేదని ఇండస్ట్రీ టాక్. అలాగే, ప్రభాస్ హీరోగా వచ్చిన ‘రెబల్’ సినిమా సమయంలో లారెన్స్ దర్శకత్వం వహిస్తుంటే, ప్రభాస్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో తనదైన ఇన్పుట్స్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. మరో ఆసక్తికర ఉదాహరణ ‘మగధీర’కు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి కొన్ని సెట్స్ లో స్వయంగా ఉండి సలహాలు ఇచ్చేవారని, అలాగే రామ్ చరణ్ కి అవసరమైన గైడెన్స్ ఇచ్చారని అప్పట్లో చర్చ జరిగింది.
కొన్నిసార్లు స్టార్ హీరోలు తమకు నచ్చిన విధంగా సినిమా రావాలని దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా సమయంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన 'గుడుంబా శంకర్' టైం లో అఫీషియల్‌గా వేరే దర్శకులు ఉన్నా, లోపల మాత్రం పవన్ కళ్యాణే తన దర్శకత్వ పర్యవేక్షణ చేశారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరికొన్నిసార్లు అనుభవం ఉన్న దర్శకులు, కొత్త దర్శకులకు అండగా ఉంటూ సినిమాను నడిపిస్తారు.
హిట్ అయితే ‘మాది’.. ఫ్లాప్ అయితే ‘నీది’:
ఈ విధంగా వెనుక డైరెక్షన్ సంస్కృతిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే, బాధ్యతను పంచుకోవడంలో వివక్ష చూపడం. సినిమా సూపర్ హిట్ అయితే, ఆ స్టార్ హీరో లేదా వెనుక ఉన్న స్టార్ డైరెక్టరే అసలు కారణమని ఫ్యాన్స్ రచ్చ చేస్తారు. కానీ అదే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే మాత్రం, ఆ పాపం అంతా పోస్టర్ మీద ఉన్న దర్శకుడి ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇలాంటి పరిస్థితులు యంగ్ డైరెక్టర్ల క్రియేటివిటీ దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా అనేది ఒక టీమ్ వర్క్. సలహాలు, సూచనలు తీసుకోవడంలో తప్పులేదు కానీ, ఒకరి శ్రమను మరొకరు దోచుకోవడం సరైన పద్ధతి కాదు. ‘బీమ్లా నాయక్’ లో సాగర్ చంద్ర కంటే త్రివిక్రమ్ పేరే ఎక్కువగా వినిపించడం వల్ల అసలు దర్శకుడి గుర్తింపు మరుగున పడిపోయింది. భవిష్యత్తులోనైనా దర్శకులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ, వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించాలని ఆశిద్దాం. అప్పుడే ఇండస్ట్రీలోకి కొత్త ఆలోచనలు, సరికొత్త ప్రతిభావంతులు వచ్చే అవకాశం ఉంటుంది.