ట్రెండ్ షిఫ్ట్: క్రూరత్వం నుంచి డివోషన్ వైపు!
గ్లామర్ రంగంలో ట్రెండ్ ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి నేటి సినిమా పరిశ్రమ సరళి చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.
గ్లామర్ రంగంలో ట్రెండ్ ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి నేటి సినిమా పరిశ్రమ సరళి చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. ఒకవైపు కిల్, యానిమల్ వంటి చిత్రాలు తెరపై హింసను, మునుపెన్నడూ లేని క్రూయాల్టీని ప్రదర్శించి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించగా.. అడల్ట్ కంటెంట్ చిత్రాల జోరు కూడా బాలీవుడ్‌లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు ఏదైనా బోల్డ్ పాయింట్ కోసం చాలా అరుదుగా వాడే `ఏ` సర్టిఫికేట్ ట్రెండ్..ఇప్పుడు దర్శకనిర్మాతలకు ఒక గుడ్డి అనుకరణగా మారుతోంది. గతంలో `యానిమల్` సాధించిన భారీ విజయంతో మొదలైన ఈ ధోరణి ఇటీవల మీర్జాపూర్, ధురంధర్ ది రివెంజ్, కాక్‌టెయిల్ 2, అస్సీ వంటి పెద్ద సినిమాలకు పాకి నిర్మాతలు ఈ బాటలోనే నడిచేలా చేసిందని విశ్లేషణలు వచ్చాయి.
ఈ ట్రెండ్‌లో భాగంగానే సెప్టెంబర్ 18న విడుదలైన `దైరా`, `వైబ్` సినిమాలు కూడా సెన్సార్ బోర్డు నుంచి `ఏ` సర్టిఫికేట్ సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ `దైరా` చిత్రం సెప్టెంబర్ 11నే సెన్సార్ పూర్తి చేసుకుని 2 గంటల 23 నిమిషాల నిడివితో ఏ సర్టిఫికేట్ దక్కించుకుంది. ఇందులో కరీనా కపూర్ ఖాన్ డీసీపీ అజూనీ కోహ్లీగా, పృథ్వీరాజ్ సుకుమారన్ డీసీపీ రామన్ కుమార్‌గా నటిస్తున్నారు. ఒక అమ్మాయి కిడ్నాప్, అఘాయత్యం, హత్య నేపథ్యంలో సాగే ఈ కథలో జువెనైల్ చట్టాలు, ఎన్‌కౌంటర్ల చుట్టూ ఉన్న సున్నితమైన వివాదాలను చర్చించనున్నారు. ఇది నటి కరీనా కెరీర్‌లో ఏడో `ఏ` రేటెడ్ సినిమా కావడం మరో విశేషం.
అలాగే కునాల్ ఖేము దర్శకత్వంలో తెరకెక్కిన `వైబ్` చిత్రం కూడా 2 గంటల 25 నిమిషాల రన్‌టైమ్‌తో సెన్సార్‌ను పూర్తి చేసుకుని `ఏ` సర్టిఫికేట్ పొందడం గమనార్హం. ఇందులో ప్రీతి జింటా కీలక పాత్రలో నటిస్తుండగా.. మొదట ఇదొక ఫన్ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం జరగడంతో చివరికి దీనికి అడల్ట్ సర్టిఫికేట్ రావడం ప్రేక్షకులకు షాకిచ్చింది. ఇలా రొమాంటిక్, క్రైమ్, వయొలెంట్ జోనర్లలో అడల్ట్ సినిమాలే సర్వవ్యాప్తంగా మారుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఇండస్ట్రీలో మరో భారీ ఊహించని మార్పు చోటు చేసుకుంటోంది. కేవలం బోల్డ్ - వైలెంట్ సినిమాలకే కాకుండా డివోషనల్ చిత్రాలకు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే వాస్తవం క్రమంగా నిరూపణ అవుతోంది.
ప్రస్తుతం గ్లామర్ - కమర్షియల్ రంగంలో డివోషనల్ సినిమాల హవా క్రమంగా పెరుగుతోంది. `హనుమాన్`, `మహావతార్ నరసింహా`, `హనుమాన్ అంశ్` వంటి చిత్రాల ఘన విజయం అందించిన స్ఫూర్తితో ఇప్పుడు వారణాసి, రామాయణం వంటి భారీ ప్రాజెక్ట్‌లతో పాటు పలువురు ఆధ్యాత్మిక గురువుల బయోపిక్‌లు, పౌరాణిక నేపథ్య చిత్రాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నాయి. ఇవన్నీ కేవలం భక్తి భావానికి మాత్రమే పరిమితం కాకుండా.. ఆధునిక సాంకేతిక హంగులు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ .. కమర్షియల్ హంగులను అద్దుకుని వస్తుండటంతో ప్రేక్షకులలో వీటిపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
ఈ పరిణామాలు గ్లామర్ రంగంలో ప్రేక్షకుల అభిరుచులు ఏ స్థాయిలో మారుతున్నాయో స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు హింసాత్మక కథలు, అడల్ట్ కంటెంట్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షాక్ ఇస్తున్న మేకర్స్.. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక సెంటిమెంట్లను క్యాష్ చేసుకునేందుకు భారీ డివోషనల్ సినిమాల వైపు పరుగులు పెడుతున్నారు. మొత్తానికి కంటెంట్ ఏదైనా సరే ప్రేక్షకుల నాడిని పట్టుకుని.. కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తే అది ఏ జోనర్ అయినా సరే అఖండ విజయాలను సాధించగలదని నేటి ట్రెండ్ నిరూపిస్తోంది.