రెండు జ‌డ‌లు ఎందుకో చెన్నై మీడియాకి వివ‌ర‌ణ ఇచ్చిన నాని

ముఖ్యంగా ఈ చిత్రంలో నాని డిఫరెంట్ లుక్ -రెండు జ‌డ‌లు స‌హా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తంబీ మీడియాకు వెల్లడించారు.

Update: 2026-09-17 17:24 GMT

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `ది ప్యారడైజ్` త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్- క్యూ అండ్ ఏ సెషన్‌లో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలను షేర్ చేసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాని డిఫరెంట్ లుక్ -రెండు జ‌డ‌లు స‌హా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తంబీ మీడియాకు వెల్లడించారు.

ఈ చిత్రంలో తన కొత్త లుక్ గురించి మాట్లాడిన నాని.. రెండు జడల గెటప్ తనకు మొదట కాస్త సందేహం కలిగించిందని చెప్పారు. హీరోకి ఈ లుక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే సందేహం వచ్చినా కానీ.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నమ్మకంతో మేమంతా ముందుకు వెళ్లామని తెలిపారు. ఈ లుక్ కోసం దాదాపు 160 రోజులు జడలు వేసుకుని షూటింగ్ చేయడం తన జీవితంలోనే అత్యంత కష్టమైన అనుభవమని.. జుట్టును మేనేజ్ చేయ‌డం ఎంత కష్టమో అప్పుడే తెలిసిందని నాని పేర్కొన్నారు.

రోజూ ఈ విధంగా జడలతో ఉండటం వల్ల మన తల్లులు, చెల్లెళ్లు దైనందిన జీవితంలో పడే ఇబ్బందులు తనకు అర్థమయ్యాయని.. వారిపై తనలో గౌరవం మరింత పెరిగిందని నాని అన్నారు. అయితే షూటింగ్ సమయంలోనే ఈ లుక్ ప్రేక్షకుల్లో ఒక ట్రెండ్ అయిపోయిందని.. విడుదలైన పోస్టర్లు, విజువల్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. విభిన్నమైన ప్రయోగాలను అనుమ‌తించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉండటం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు.

సినిమా కంటెంట్- సర్టిఫికేషన్ గురించి మాట్లాడుతూ, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫెక్ట్ ఇచ్చింద‌ని నాని స్పష్టం చేశారు. `ఏ` సర్టిఫెక్ట్ వస్తే పిల్లలు, హింసాత్మక సన్నివేశాలను ఇష్టపడని కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇబ్బంది పడతారని అంగీకరించారు. అయితే ప్రతి జానర్ అందరికోసం ఉండదని.. ఈ సినిమాలోని వైలెన్స్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్దవాళ్లు మాత్రమే దీన్ని పూర్తి స్థాయిలో ఆస్వాధించగలరని స్పష్టం చేశారు. తన కుమారుడు కూడా ఈ సినిమా చూడొచ్చా అని అడిగితే.. తగిన వయసు వచ్చిన తర్వాతే చూడాలని చెప్పానని ఉద‌హ‌రించారు.

ఇక సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను కూడా నాని, శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు. ఈ చిత్రానికి ఎలాంటి థియేట్రికల్ ట్రైలర్ ఉండదని.. చివరి నిమిషంలో టీమ్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల నేరుగా థియేటర్లలోనే సర్‌ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ఈ చిత్రాన్ని `పాన్-ఇండియా` అని పిలవడాన్ని నాని మరోసారి వ్యతిరేకిస్తూ.. తెలుగు కథగా తెరకెక్కినప్పటికీ ఇది అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. 1980ల నేపథ్యంతో సాగే ఈ విప్లవాత్మక భావోద్వేగ చిత్రంలో అణగారిన వర్గాల తరఫున నిలబడే పాత్ర అందరినీ కదిలిస్తుందని నాని ధీమా వ్యక్తం చేశారు.




Tags:    

Similar News