5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాతను బెదిరించిన గ్యాంగ్ స్టర్!
| గ్యాంగ్ స్టర్ల బెదిరింపులతో బాలీవుడ్ తీవ్ర భయాందోళనలో ఉంది. వరుసగా స్టార్లు బుల్లెట్ ప్రూఫ్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
గ్యాంగ్ స్టర్ల బెదిరింపులతో బాలీవుడ్ తీవ్ర భయాందోళనలో ఉంది. వరుసగా స్టార్లు బుల్లెట్ ప్రూఫ్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. వాహనాలతో పాటు, ఇళ్లకు కూడా మార్పులు చేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నిరంతరం సెలబ్రిటీలను బెదిరిస్తుంటే ఆందోళన మరింత పెరుగుతోంది. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల తర్వాత.. ఇటీవల హీరో టైగర్ ష్రాఫ్ పై బహిరంగ ప్రదేశంలో ఎటాక్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్టార్ల ఇళ్లకు సెక్యూరిటీ అలెర్ట్ పెరిగింది. అయినా ఇప్పటికీ బెదిరింపులు ఆగలేదు.
బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో 5 కోట్ల కప్పం బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. బిష్ణోయ్ సిండికేట్‌తో సంబంధం ఉన్న హ్యారీ బాక్సర్‌గా తనను పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి, నటుడిని నేరుగా డబ్బులు డిమాండ్ చేశారు. ఈ బెదిరింపుతో షాక్‌కు గురైన తుషార్ వెంటనే ముంబై పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ కేస్ విచారణను యాంటీ ఎక్స్టార్షన్ సెల్ .. క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.
తాజా విచారణలో భాగంగా క్రైమ్ బ్రాంచ్ టెక్నికల్ టీమ్ ఫిర్యాదుతో పాటు అందిన ఆడియో రికార్డింగ్‌ను ల్యాబ్‌లో విశ్లేషించింది. పోలీసు రికార్డుల్లో ఉన్న అసలైన హ్యారీ బాక్సర్ వాయిస్ శాంపిల్స్‌తో ఈ కాల్లోని గొంతును పోల్చి చూడగా.. రెండింటికీ అసలు పోలిక లేదని తేలింది. దీంతో నటుడిని భయపెట్టి డబ్బులు గుంజడానికి బిష్ణోయ్ గ్యాంగ్ భయంకరమైన పేరును బెదిరింపులకు వాడుకుంటూ ఎవరో అపరిచిత వ్యక్తి ఈ బూటకపు కాల్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఇప్పటివరకు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు కాకపోయినా.. బెదిరింపు కాల్ ఎక్కడి నుండి వచ్చిందనే డిజిటల్ నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. జుహులోని నటుడు టైగర్ ష్రాఫ్ నివాసం వెలుపల కాల్పులు జరిగిన కొద్ది వారాలకే ఈ ఘటన వెలుగులోకి రావడంతో బాలీవుడ్ చిత్రసీమలో భద్రత పరమైన ఆందోళనలు మరింత పెరిగాయి. ఈ బెదిరింపు వెనుక గ్యాంగ్‌తో ఏమైనా పరోక్ష సంబంధాలు ఉన్నాయా లేదా అనేది స్పష్టం చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
2001లో `ముఝే కుచ్ కెహనా హై` చిత్రంతో అరంగేట్రం చేసిన తుషార్ కపూర్ రోహిత్ శెట్టి రూపొందించిన బ్లాక్‌బస్టర్ `గోల్మాల్` ఫ్రాంచైజీలో `లక్కీ` పాత్రతో మంచి గుర్తింపు పొందారు. `షూటౌట్ ఎట్ లోఖండ్వాలా`, `ది డర్టీ పిక్చర్` వంటి హిట్ చిత్రాల్లో నటించడమే కాకుండా.. తుషార్ ఎంటర్టైన్మెంట్ హౌస్ బ్యానర్‌పై నిర్మాతగా కూడా ఆయన కొనసాగుతున్నారు.