ఆ రెండింటి తర్వాత సాయి పల్లవి చిక్కుతుందా?
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, తన మనసుకి నచ్చిన కథల్ని మాత్రమే ఎంచుకునే సాయి పల్లవికి అంత క్రేజ్, ఫాలోయింగ్ రావడానికి కారణం ఆమె అందం కాదు.;
సాయి పల్లవి.. సౌత్ లో ఈమె గురించి తెలియని వారు లేరంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. తన డ్యాన్సులు, నటనతో అందరినీ ఫిదా చేసే సాయి పల్లవికి దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ లో అయితే ఆమెను లేడీ పవర్ స్టార్ అని ఫ్యాన్స్ ప్రేమగా పిలుచుకుంటారు. సాయి పల్లవి ఏదైనా ఒక పాత్ర చేసిందంటే ఆ పాత్ర కచ్ఛితంగా గుర్తుండిపోయే తరహాదే అవుతుంది.
నటిగా ఎప్పుడూ సక్సెస్సే
ఆమె ఏ పాత్రలో నటించినా దానికి వంద శాతం న్యాయం చేసే సాయి పల్లవి ఇప్పటికే ఎన్నో పాత్రలతో ఆడియన్స్ ను మెప్పించారు. అందుకే సాయి పల్లవి చేసిన సినిమాలు ఫ్లాపయ్యాయేమో కానీ, నటిగా ఆమె ఎప్పుడూ ఫెయిలైంది లేదు. కథలు, పాత్రల ఎంపికలో సాయి పల్లవి చాలా స్ట్రిక్ట్ గా ఉండటం వల్లే ఆమె సక్సెస్‌ఫుల్ నటిగా పేరు తెచ్చుకున్నారు.
మనసుకి నచ్చిన కథలు మాత్రమే!
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, తన మనసుకి నచ్చిన కథల్ని మాత్రమే ఎంచుకునే సాయి పల్లవికి అంత క్రేజ్, ఫాలోయింగ్ రావడానికి కారణం ఆమె అందం కాదు. ఇంకా చెప్పాలంటే అందం విషయంలో సాయి పల్లవిని మించే వారు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్లను కాదని, సాయి పల్లవి వద్దకు అవకాశాలు వస్తున్నాయంటే దానికి కారణం ఆమె సహజ నటన. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందులో జీవించడం.
అలాంటి సాయి పల్లవి పేరు రానున్న రోజుల్లో మరింత మార్మోగనుంది. దానికి కారణం ఆమె రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో భాగం కావడమే. వాటిలో ఒకటి నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రామాయణ కాగా, మరొకటి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ కల్కి2.
రామాయణలో సీతాదేవిగా..
వీటిలో రామాయణ సినిమాలో సాయి పల్లవి సీతాదేవిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామాయణ షూటింగ్ మొదలవగా, ఈ సినిమాలో తన పాత్ర కోసం సాయి పల్లవి తన ప్రాణం పెట్టి నటిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రామాయణ ప్రాజెక్టు మొదలవకముందు సీతాదేవి లాంటి అందగత్తె పాత్రకు సాయి పల్లవిని తీసుకోవడమేంటని అందరూ వ్యతిరేకించారు. కానీ మేకర్స్ మాత్రం సాయి పల్లవిపై, ఆమె నటనపై నమ్మకముంచి ఆమెనే ఫైనల్ చేసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. మామూలు పాత్రలనే తన యాక్టింగ్ తో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే సాయి పల్లవి, సీతా దేవి లాంటి పాత్ర దక్కినప్పుడు ఏ స్థాయి పెర్ఫార్మెన్స్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దీపికా పాత్రలో సాయి పల్లవి
ఇక కల్కి2 విషయానికొస్తే ఈ ప్రాజెక్టు నుంచి దీపికా పదుకొణె తప్పుకున్న తర్వాత సినిమాలో అంతటి కీలకమైన పాత్రకు ఎవరైతే న్యాయం చేయగలరా అని ఆలోచిస్తున్నప్పుడు మేకర్స్ కు సాయి పల్లవి కంటే మరో బెటర్ ఆప్షన్ కనిపించలేదని, సుమతి పాత్రలో ఆమె కంటే బాగా ఎవరూ నటించలేరని భావించారు. కల్కి2లో సుమతి పాత్ర ఎంత కీలకమైందో తెలిసిందే. అలాంటి పాత్ర దక్కినప్పుడు సాయి పల్లవి ఇక రెచ్చిపోవడం ఖాయం. ఈ రెండు సినిమాలూ భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల నుంచి ప్రేరణ పొందిన ఫాంటసీ సినిమాలుగా వస్తుండగా, ఆ రెండు సినిమాల్లో నటించే అరుదైన అదృష్టాన్ని అందుకుని సాయి పల్లవి రికార్డు సృష్టించారు. ఈ రెండు సినిమాల్లో తన యాక్టింగ్ తో సాయి పల్లవి అందరినీ ఆశ్చర్యపరిచి తనను విమర్శించిన వారిందరికీ గట్టి సమాధానం చెప్పడంతో పాటూ, ఈ రెండు సినిమాల తర్వాత ఆమె క్రేజ్ ఇండియన్ సినిమాలో నెక్ట్స్ లెవెల్ కు చేరుతుందని ఆమె ఫ్యాన్స్ ఎంతో ధీమాగా ఉన్నారు. అంతటి విపరీతమైన క్రేజ్ వచ్చిన తర్వాత సాయి పల్లవితో ఎవరైనా సినిమా చేయాలన్నా ఆమె డేట్స్ దొరకడం కష్టమే అవుతుంది.