కేరళకుట్టికి మంటెత్తితే ఇంతే మరి!
అనస్వర రాజన్..ఓ కేరళకుట్టి. మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ `రేఖా చిత్రం`తో పాపులర్ అయిన ఈ మలయాళ సోయగం `ఛాంపియన్`తో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే;
అనస్వర రాజన్..ఓ కేరళకుట్టి. మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ `రేఖా చిత్రం`తో పాపులర్ అయిన ఈ మలయాళ సోయగం `ఛాంపియన్`తో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ప్రస్తుతం `టూరిస్ట్ ఫ్యామిలీ` డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా పరిచయం అవుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ `విత్ లవ్`తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరో ఇద్దరు ప్రొడ్యూసర్స్‌తో కలిసి రజనీకాంత్ కుమార్తె సౌందర్మ రజనీకాంత్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన టీమ్ ఈ మూవీని ఫిబ్రవరి 6న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.
మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో అనస్వరకు ఏర్పడిన క్రేజ్‌కు తగ్గట్టుగా ఈ మూవీ ప్రమోషన్స్‌ని టీమ్ భారీగానే ప్లాన్ చేసింది. డ్రోన్ షోతో ఫస్ట్ టైమ్ తమిళ ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోషన్స్‌కు తెరలేపింది. ఇప్పటికే తమిళనాట ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో టీమ్ మొదలు పెట్టింది. అయితే ఓ తమిళ మీడియా చేసిన అతి కేరళ కుట్టి అనస్వరకు చిరాకు తెప్పించిందట. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల అనస్వర ఓ తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిందట. అయితే అందులో తను మాట్లాడిన మాటలకు మరో వాక్యాన్ని జోడించి దాన్నే హైలైట్ చేస్తూ టైటిల్ పెట్టి పబ్లిష్ చేశారట.
అదే అనస్వరకు చిరాకు తెప్పించిందని తెలుస్తోంది. తన మాటలను తప్పుదోవ పట్టించే విధంగా తాను మాట్లాడిన మాటలని సదరు పత్రిక వారు వక్రీకరించారని అనస్వర మండిపడింది. సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. `దీనిని రూపొందించన వారికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. తేలికపాటి సంభాషణలు, నవ్వులతో నిండిన పూర్తి 20 నిమిషాల తమిళ ఇంటర్వ్యూను ఓపికగా కూర్చుని చూసి అందరూ నవ్వుతున్నప్పుడు సరదాగా చెప్పిన ఒకే ఒక వ్యాఖ్యాన్ని పట్టుకుని దాన్ని ఏదో తీవ్రమైన ప్రకటనగా పోట్రే చేయడానికి చాలా ఓపిక కావాలి.
అది జర్నలిజం కాదు. అది కేవలం కొన్ని వాఖ్యాలను ఏరుకోవడం చెప్పిన సందర్భాన్ని వక్రీకరించడం..లేని చోట ప్రతికూలతను వివాదాన్ని సృష్టించడం. ఒక జోక్‌ను అతిగా ప్రచారం చేయడం మిమ్మల్ని తెలివైన వారిగా చూపించదు. అది కేవలం మీరు ప్రచారం కోసం ఎంతగా ఉబలాటపడుతున్నారో చూపిస్తుంది` అంటూ ఫైర్ అయింది. ఇటీవల కొన్ని విమర్శలకు స్పందించకూడదని ఓ గీత గీసుకున్నాను. కానీ నా వ్యక్తిగత హననం జరుగుతున్నప్పుడు వెంటనే దానిపై స్పందించాలనుకున్నాను. అందుకే స్పందించాను` అని తెలిపింది అనస్వర.
ఇదిలా ఉంటే `విత్ లవ్` తరువాత అనస్వర రాజన్ మరో క్రేజీ సీక్వెల్‌తో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేయబోతోంది. తను నటిస్తున్న రొమాంటిక్ లవ్ డ్రామా `7/జి రెయిన్‌బో కాలనీ 2`. సెల్వరాఘవన్ డైరెక్టర్. 2004లో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన `7/జి రెయిన్‌బో కాలనీ`కి సీక్వెల్ ఇది. తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా సీక్వెల్ తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన కీలక అప్ డేట్‌ని మేకర్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలిసింది.