గుండె పిండేసే ఎమోషన్.. 'ది ప్యారడైజ్' మరో సర్ ప్రైజ్
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' అంటే ఇప్పటిదాకా అందరికీ గుర్తొచ్చింది ఊరమాస్ యాక్షన్, రక్తపాతమే.
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' అంటే ఇప్పటిదాకా అందరికీ గుర్తొచ్చింది ఊరమాస్ యాక్షన్, రక్తపాతమే. ఇప్పటికే రిలీజైన 'ఆయా షేర్', 'ఏషా నాగుల' లాంటి పాటలు సినిమాలోని హై ఓల్టేజ్ వైబ్స్ ను ఎలివేట్ చేశాయి. అయితే సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా విడుదల ముంగిట దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక ఊహించని ఎమోషనల్ బాంబ్ పేల్చారు. ఒక చిన్న సర్ ప్రైజ్ వీడియో ఇప్పుడు నెట్టింట అందరి గుండెలను బరువెక్కేలా చేస్తోంది.
ఈ స్పెషల్ వీడియోలో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వయంగా కనిపిస్తూ, మీకోసం ఒక చిన్న సర్ ప్రైజ్ అంటూ 'దిస్ ఈజ్ ది ఎమోషన్ ఆఫ్ ప్యారడైజ్' అని చెప్పి స్టూడియో మైక్ ముందుకు వచ్చాడు. చేతిలో ఫోన్ పట్టుకుని, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇన్ స్ట్రుమెంట్స్ లేకుండా అనిరుధ్ పాడిన తీరు ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. అసలు సిసలైన రా ఎమోషన్ అంటే ఏంటో కేవలం ఆయన గొంతుతోనే పలికించి వినేవాళ్లను కట్టిపడేశాడు.
'పచ్చిది నీ పేగు సమ్మక్క కుట్టుకుంటందే ఆకలి సమ్మక్క.. పిచ్చిది నీ గుండె సమ్మక్క కొట్టుకుంటందే కొడుకుకై సమ్మక్క' అంటూ సాగే ఈ పాట లిరిక్స్ వింటుంటే కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం. కండ్లల్ల కన్నీళ్లు సమ్మక్క నీ రొమ్ములకెట్లొచ్చే సమ్మక్క అంటూ ఒక తల్లి ఆకలి, కొడుకు కోసం పడే వేదనను అద్భుతంగా రాశారు. ఈ ఒక్క పాటతో సినిమాలో అంతర్లీనంగా ఎంతటి బలమైన మదర్ సెంటిమెంట్, గుండెల్ని పిండేసే డ్రామా దాగుందో స్పష్టంగా బయటపడింది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బలం ఎప్పుడూ రా నేటివిటీతో కూడిన ఎమోషనే. దసరా సినిమాలో స్నేహం, పగను ఎంత ఇంటెన్స్ గా చూపించాడో, ఇందులో అంతకుమించి మట్టి వాసనతో కూడిన తల్లీకొడుకుల బంధాన్ని చూపించబోతున్నాడని అర్థమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ప్రతి ప్రేక్షకుడిని కదిలించే ఒక బలమైన భావోద్వేగం ఈ కథకు వెన్నెముకగా నిలవబోతోంది.
నార్మల్ గా అనిరుధ్ అనగానే హై ఎనర్జీ బీట్స్, థియేటర్లను ఊపేసే ట్రాన్స్ గుర్తొస్తుంది. కానీ ఇలాంటి ఆత్మ ఉన్న పాటలు పడినప్పుడు ఆయన ఇచ్చే ఔట్ పుట్ ఇంకో లెవెల్ లో ఉంటుంది. ఈ బిట్ లో అనిరుధ్ పాడిన విధానం చూస్తే ఆయన కథలోని మూలాల్ని ఎంతగా ఓన్ చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ లేకుండానే ఇంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ మెలోడీ, రేపు వెండితెరపై ఎంతవరకు హైలెట్ అవుతుందో చూడాలి.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ టికెట్ హైక్స్ జీవోలు వచ్చేసి బుకింగ్స్ కు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 23 ప్రీమియర్స్ పై భారీ అంచనాలు ఉన్న తరుణంలో, సినిమా కేవలం గన్ ఫైట్స్ తో సాగే మాస్ జాతర మాత్రమే కాదు, గుండె లోతులను తాకే అసలైన ఎమోషనల్ రైడ్ అని ఈ పాటతో ప్రూవ్ చేశారు. ఇక కంటెంట్ ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి.