బెబో త్రోబ్యాక్ లుక్‌పై ఫ్యాన్స్ డిబేట్
ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ దేవతా సుందరి రూపాన్ని ఆరాధించని అభిమానులు లేరు. బెబో కరీనా ప్రతి పుట్టినరోజును డెడికేటెడ్ గా జరుపుకునే ఫ్యాన్స్ ఉన్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ దేవతా సుందరి రూపాన్ని ఆరాధించని అభిమానులు లేరు. బెబో కరీనా ప్రతి పుట్టినరోజును డెడికేటెడ్ గా జరుపుకునే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఏడాది మరో కొత్త జన్మదినం సందర్భంగా కరీనాను అభినందిస్తూ `హార్పర్ బజార్` ఒక ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేయగా ఫ్యాన్స్ ఈ పోస్ట్ ని ఇందులోని ఫోటోషూట్ ని వైరల్ గా షేర్ చేస్తున్నారు.
`జబ్ వి మెట్` చిత్రంలోని గీత్, `కభీ ఖుషీ కభీ ఘమ్` చిత్రంలోని పూ వంటి యువతరం హృదయాలను దోచిన పాత్రల నుండి.. ఇటీవలి క్రూ, దాయరా సినిమాల వరకు బెబో తన అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా మోడరన్ బాలీవుడ్ ఐకాన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. కరీనా పుట్టినరోజు సందర్భంగా ఒక పాత కవర్ పేజీకి సంబంధించిన ఫోటోలను గుర్తుచేసుకుంటూ కరీనా గ్లామర్-చరిష్మాను కొనియాడుతూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి విభిన్న స్పందనలు వచ్చాయి. చాలామంది నెటిజన్లు కరీనా కపూర్ గ్లామర్‌ను ప్రశంసిస్తూ హార్ట్- ఫైర్ ఎమోజీలతో తమ ప్రేమను చాటుకున్నారు. బోబో ఉఫ్, దివా అంటూ ఆమె స్టైల్‌ను కొనియాడారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ లుక్‌పై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మొదటి ఫోటో సరిగ్గా లేదని.. ఆ లుక్ కొంచెం భయంగా లేదా గందరగోళంగా ఉందని కామెంట్లు పెట్టారు. మొత్తానికి కరీనా పుట్టినరోజు సందర్భంగా హార్పర్స్ బజార్ ఇండియా పోస్ట్ చేసిన ఈ జ్ఞాపకం నెట్టింట బాగా చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కరీనా ఫోటోను షేర్ చేస్తూ, ``పుట్టినరోజు శుభాకాంక్షలు కరీనా... మీలాంటి వారు ఇంకొకరు ఎప్పటికీ ఉండరు`` అంటూ ప్రశంసలు కురిపించారు.
ఈ పోస్ట్‌లో కరీనా ధరించిన కలర్‌ఫుల్ రెయిన్‌బో టోన్డ్ లెహరియా చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది తను నటించిన `దాయరా` సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించినదిగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ లుక్ 2001లో వచ్చిన `జుబైదా` చిత్రంలో కరీనా సోదరి కరిష్మా కపూర్ ధరించిన ఐకానిక్ లెహరియా చీరను (ధీమే ధీమే గావో పాటలో) గుర్తుకు తెచ్చేలా ఉండటం విశేషం.
ఒకానొక కాలంలో కరీనా- ప్రియాంకలను బాలీవుడ్ ప్రత్యర్థులుగా భావించేవారు. `కాఫీ విత్ కరణ్` షోలో కరీనా, ప్రియాంక యాసపై సెటైర్ వేయగా... ప్రియాంక కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. అయితే కాలక్రమేణా వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని... అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. 2004లో అబ్బాస్-మస్తాన్ దర్శకత్వంలో వచ్చిన సంచలన థ్రిల్లర్ `ఐత్‌రాజ్` చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన ఈ ఇద్దరు భామలు కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు.