ట్వీట్ల‌తో మెగా ఫ్యామిలీపై ఎట‌కారాల వ‌ర్మ‌!

Update: 2019-05-23 14:53 GMT
వ‌ర్మ ట్వీట్ చేస్తేనే అదో వార్త క‌చ్ఛితంగా అవుతుంది. ఇక‌.. గురి పెట్టి విడిచిన బాణంలా ట్వీట్ల‌ను వ‌దిలితే వాటి సంచ‌ల‌నం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎప్పుడు మౌనంగా ఉండాలో.. ఎప్పుడు వ‌రుస ట్వీట్ల‌తో విరుచుకుప‌డాలో బాగా తెలిసిన వ‌ర్మ‌కు.. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ఆయ‌న చెల‌రేగిపోతున్నారు. త‌న‌కేమాత్రం న‌చ్చ‌ని చంద్ర‌బాబు.. ప‌వ‌న్ లు ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో ఆయ‌న పెడుతున్న ట్వీట్లు ఇప్పుడు మ‌హా ఎట‌కారంగా మారాయి.  

175 సీట్ల‌లో తాము విజ‌యం సాధిస్తామ‌న్న భ‌రోసాగా చెప్పిన చంద్ర‌బాబుకు పాతిక సీట్లు రావ‌టం ఇప్పుడు క‌ష్టంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క‌భూమిక పోషించే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాల హైప్ క్రియేట్ చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవ‌ట‌మే కాదు.. ఒకే ఒక్క సీటుతో స‌రిపెట్టుకోవాల్సిన పరిస్థితి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌ర్మ చేసిన ట్వీట్లు ఇప్పుడు వ్యంగ్యానికి మించి మంట పుట్టేలా ఉన్నాయి. జ‌న‌సేన ఓట‌మిని ఉద్దేశించి వ్యాఖ్యానించే అంశంలో చిరంజీవిని ప్ర‌స్తావిస్తూ.. చిరంజీవిగారు.. ‘‘జనసేన పార్టీతో పోలిస్తే ప్రజారాజ్యం పార్టీ బాహుబలి, కంగ్రాట్స్ చిరంజీవిగారు'' అంటూ వర్మ ట్వీట్ చేశారు.

2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లు సాధించిన విష‌యాన్ని గుర్తుకు తెచ్చేలా చేసిన వ‌ర్మ‌.. ఈసారి జ‌న‌సేన పావువంతు సీట్లు కూడా వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌టం లేద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. జ‌న‌సేన అన్ని జిల్లాల్లో సున్నాలే న‌మోదు చేస్తోందంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోను షేర్ చేశారు.

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న టీడీపీని వ‌ర్మ వదిలిపెట్ట‌లేదు. ఫ‌న్నీ మీమ్స్.. వీడియోల‌ను షేర్ చేస్తూ.. ఓడిన వేద‌న‌లో ఉన్న తెలుగు త‌మ్ముళ్ల‌కు మ‌రింత మ‌న‌సు గాయ‌ప‌రిచేలా ట్వీట్లు చేస్తున్నారు. ఆ మ‌ధ్య ప్ర‌చారంలో భాగంగా లోకేశ్ నోరుజారి సైకిల్ గుర్తుకు ఓటు వేయొద్ద‌న్న వీడియోను షేర్ చేశారు. వాళ్ల నాన్న మాట‌ల‌తో పోలిస్తే.. లోకేశ్ చాలా హానెస్ట్ అని ట్వీట్ పంచ్ వేశారు.

ఏపీ ఎన్నిక‌లు మొత్తం ప‌సుపు కుంకం చుట్టూ తిరిగిన వైనం తెలిసిందే. తాజాగా వెలువ‌డుతున్న ఫ‌లితాలు చూస్తే.. ఆ ప‌థ‌కం మీద బాబు పెట్టుకున్న ఆశ‌ల‌న్ని ఆడియాశ‌లు అయిన‌ట్లేన‌ని చెప్పాలి.ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన వ‌ర్మ.. ఏపీ మ‌హిళ‌లు ప‌సుపుకుంక‌మ తీసుకొని ఉప్పుకారం పూశారంటూ సెటైర్లు వేశారు.

కేసీఆర్ రిట‌ర్న్ గిప్ట్ ఎపిసోడ్ ను ప్ర‌స్తావిస్తూ.. కేసీఆర్ ఇచ్చిన రిట‌ర్న్ గిఫ్ట్ ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేలా చేయ‌ట‌మేన‌ని పేర్కొన్నారు. ఇలా వేలెత్తి చూపించే అవ‌కాశం ఉన్న ప్ర‌తి అంశాన్ని ప్ర‌స్తావిస్తూ వ‌ర్మ‌.. వ్యంగ్య ట్వీట్లు చేశార‌ని చెప్పాలి.
Tags:    

Similar News