పవన్-కేటీఆర్ నాలుగు వారాల కిందటే..

Update: 2017-03-27 04:57 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సందర్భంగా కేసీఆర్.. కేసీఆర్ కుటుంబం మీద తీవ్ర విమర్శలే చేశాడు. కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం పవన్ మీద గట్టిగానే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఐతే ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. ఒకరి గురించి ఒకరు ప్రస్తావించడం తగ్గిపోయింది. ఇప్పుడు కొత్తగా పవన్-కేసీఆర్ కుటుంబం మధ్య స్నేహం చిగురిస్తున్నట్లుగా ఉంది. కేసీఆర్ తనయుడు.. తెలంగాణ మంత్రి కేటీఆర్.. గత కొంత కాలంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం నడుం బిగించి మంచి కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ కూడా ఇదే సంకల్పంతో సాగుతున్నాడు. ‘కాటమరాయుడు’ సినిమా అంతటా చేనేత దుస్తులే ధరించి వాటికి ప్రచారం కల్పించాడు.

ఈ నేపథ్యంలో కేటీఆర్.. స్వయంగా ‘కాటమరాయుడు’ సినిమా చూసి పవన్ ను అభినందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ తో కలిసి ఉన్న ఫొటోను కూడా కేటీఆర్ షేర్ చేయడం ఆసక్తి రేకెత్తించింది. వీళ్లిద్దరూ ఎప్పుడు కలిశారబ్బా అన్న ప్రశ్న తలెత్తింది. దీనికి పవన్ సమాధానం చెప్పాడు. కేటీఆర్ ఇలా ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత పవన్ కూడా స్పందించడం విశేషం. ‘కాటమరాయుడు’ సినిమా చూసి మమ్మల్ని అభినందించిన కేటీఆర్ కు నా మన:పూర్వక కృతజ్నతలు అంటూ మొదలుపెట్టిన నాలుగు వారాల కిందట తామిద్దరం కలిశామన్నాడు. ఎప్పట్నుంచో తామిద్దరం కలవాలని అనుకుంటున్నా.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండటంతో కుదర్లేదని.. ఎట్టకేలకు ఇద్దరం ఒక డిన్నర్లో కలిశామని పవన్ తెలిపాడు. తమ రాజకీయ భావజాలం గురించి.. ఇద్దరి ఉమ్మడి ఆసక్తుల గురించి.. చేనేత ఉత్పత్తులు.. కార్మికులపై తమకున్న గౌరవం గురించి కూడా చర్చించుకున్నామని పవన్ తెలిపాడు. పవన్-కేటీఆర్ కలయిక రాజకీయంగా కూడా ఆసక్తికర చర్చకు దారితేసేదే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News