సత్య 'జెట్ లీ'లో మిస్ ఇండియా.. గన్ పట్టిన బ్యూటీ!
టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. అందులో సత్య, రితేష్ రానా కాంబో ఒకటి. మత్తు వదలరా సిరీస్ తో వీరు చేసిన కామెడీ అంతా ఇంతా కాదు.;
టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. అందులో సత్య, రితేష్ రానా కాంబో ఒకటి. మత్తు వదలరా సిరీస్ తో వీరు చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు 'జెట్ లీ' అంటూ మరో కొత్త ప్రయోగంతో వస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రియా సింఘా ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈమె సాదాసీదా అమ్మాయి కాదు, మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న అందగత్తె. ఈరోజు రియా పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వెండితెరకు పరిచయమవుతున్న మొదటి సినిమాలోనే యాక్షన్ రోల్ చేస్తోందని ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది.
విడుదలైన పోస్టర్ చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారు. ఒక చేతిలో గన్ పట్టుకుని సీరియస్ గా చూస్తున్న రియా లుక్ లో ఇంటెన్సిటీ కనిపిస్తోంది. వెనుక భారీ పేలుడు జరుగుతున్నట్లుగా మంటలు ఉన్నాయి. అయితే గాలిలో ఎగురుతున్న వస్తువుల్లో ఒక ఎయిర్ హోస్టెస్ మ్యాగజైన్, ఆల్కహాల్ బాటిల్స్ కనిపించడం ఆసక్తిని రేపుతోంది. రితేష్ రానా సినిమాల్లో ఉండే ఆ మార్క్ 'వయొలెన్స్ విత్ కామెడీ' ఈ పోస్టర్ లోనూ కనిపిస్తోంది.
బ్యూటీ విత్ బ్రెయిన్స్ అన్నట్లుగా, ఇక్కడ బ్యూటీ విత్ యాక్షన్ ను మిక్స్ చేసినట్లున్నారు. సత్య లాంటి కమెడియన్ పక్కన మిస్ ఇండియా రేంజ్ బ్యూటీని పెట్టడమే ఒక వెరైటీ ఆలోచన. ఇది రెగ్యులర్ లవ్ ట్రాక్ లా కాకుండా, కథలో భాగంగా నడిచే ఒక సీరియస్ కమ్ ఫన్నీ ట్రాక్ లా ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆడియెన్స్ కు కావాల్సినంత వినోదం ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఇప్పటికే విడుదలైన సత్య 'జెట్ లీ' లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ లుక్ కూడా ఆ సినిమా థీమ్ కు తగ్గట్టే ఉండటంతో అంచనాలు ఏర్పడ్డాయి.
మిస్ ఇండియా వంటి కిరీటం గెలుచుకున్న భామలు సాధారణంగా గ్లామర్ పాత్రలతో ఎంట్రీ ఇస్తారు. కానీ రియా సింఘా ఇలా గన్ పట్టుకుని మాస్ ఎంట్రీ ఇవ్వడం ఒక డిఫరెంట్ స్ట్రాటజీ అనే చెప్పాలి. సత్య కామెడీ టైమింగ్, రియా స్క్రీన్ ప్రెజెన్స్ ను దర్శకుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారో అనేదే ఇక్కడ అసలైన పాయింట్. ఈ ప్రయోగం వర్కౌట్ అయితే టాలీవుడ్ లో మరో క్రేజీ హీరోయిన్ దొరికినట్లే.