డాల్బీ లార్జ్ స్క్రీన్లతో సాధారణ స్క్రీన్లు ఉనికిని కోల్పోతాయా?
సాంకేతికత పరంగా చూస్తే.. డాల్బీ సినిమా కేవలం సౌండ్ మాత్రమే కాదు.. ఇది డాల్బీ విజన్.. డాల్బీ అట్మాస్ కలయిక.;
సినిమా ప్రదర్శన రంగం ప్రారంభంలో కేవలం ఒక చిన్న ప్రొజెక్షన్, తెల్లటి తెరకే పరిమితమై ఉండేది. ఆ రోజుల్లో రీళ్ల ద్వారా సినిమాను ప్రదర్శించేవారు.. స్క్రీన్ క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అయితే కాలక్రమేణా సాంకేతికత అద్భుతమైన మలుపులు తిరిగింది. మొదట 35 ఎంఎం ఫార్మాట్‌తో మొదలైన ప్రయాణం.. విజువల్ వీక్షణ అనుభూతిని మరింత గ్రాండ్‌గా మార్చేందుకు 70 ఎంఎం స్థాయికి చేరుకుంది. ఈ మార్పు వెండితెరపై బొమ్మను మరింత స్పష్టంగా.. భారీగా చూపించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత అనలాగ్ నుండి డిజిటల్ సౌండ్ సిస్టమ్ ప్రవేశించడంతో థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి శబ్దం చుట్టూ అన్ని దిశల నుంచి వినిపించే సరికొత్త అనుభూతి పరిచయమైంది.
మల్టీప్లెక్సుల రాకతో సినిమా చూసే విధానమే పూర్తిగా మారిపోయింది. సింగిల్ స్క్రీన్ల కాలం పోయి ఒకే చోట అనేక స్క్రీన్లు.. విలాసవంతమైన సీటింగ్..అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మల్టీప్లెక్సుల్లో డాల్బీ సినిమా స్క్రీన్‌ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని `అల్లు సినిమాస్ (ఏఏఏ సినిమాస్)`ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద డాల్బీ సినిమా థియేటర్‌ను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. ఇలాంటి స్క్రీన్‌లపై అద్భుతమైన రంగులు, గాఢమైన నలుపు .. అత్యున్నత సౌండ్ క్వాలిటీతో సినిమా చూశాక ప్రేక్షకులు మళ్లీ సాధారణ స్క్రీన్‌లపై సినిమా చూడటానికి ఇష్టపడలేనంతగా అడిక్ట్ అయిపోతున్నారు.
సాంకేతికత పరంగా చూస్తే.. డాల్బీ సినిమా కేవలం సౌండ్ మాత్రమే కాదు.. ఇది డాల్బీ విజన్.. డాల్బీ అట్మాస్ కలయిక. ఈ టెక్నాలజీకి అనుగుణంగా సినిమా ప్రదర్శించాలంటే.. నిర్మాతలు తమ చిత్రాల ప్రింట్లను ప్రత్యేకంగా గ్రేడింగ్ తో ఆప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రింట్లు ఈ హై-ఎండ్ ప్రొజెక్టర్లపై ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. అందుకే పెద్ద బడ్జెట్ చిత్రాలన్నీ ఇప్పుడు డాల్బీ విజన్ ఫార్మాట్‌లో మాస్టరింగ్ చేయించుకుంటున్నాయి.. తద్వారా ప్రతి ఫ్రేమ్ కంటికి ఇంపుగా అత్యంత సహజంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఐమ్యాక్స్, ఐసిఇ, ఎపిక్, పిసిఎక్స్, స్క్రీన్ ఎక్స్ వంటి విభిన్న ఫార్మాట్లు అందుబాటులోకి వచ్చాయి. ఐమాక్స్ వంటి ఫార్మాట్లు భారీ స్క్రీన్ .. వెర్టికల్ వ్యూయింగ్‌ను అందిస్తే.. ఐసిఇ, ఇతర ఫార్మాట్లు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ పోటీ నేపథ్యంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోని సాధారణ థియేటర్లు ..పాత తరం మల్టీప్లెక్సులు మనుగడ సాగించడం కష్టమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రేక్షకుడు కేవలం సినిమా కథ కోసమే కాకుండా.. ఆ టెక్నికల్ వండర్‌ను అనుభవించడానికి థియేటర్‌కు వస్తున్నాడు.
మరోవైపు సినిమాల మేకింగ్‌లో మోషన్ క్యాప్చర్ వంటి సాంకేతికత పెరిగిపోయింది. `అవతార్` వంటి సినిమాలు ఐమాక్స్ 3డి ఫార్మాట్‌ను డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి అత్యున్నత నాణ్యత కలిగిన చిత్రాలను ప్రదర్శించాలంటే థియేటర్లు కూడా అంతే స్థాయిలో అప్‌గ్రేడ్ కావాలి. క్వాలిటీ పిక్చర్, హై ఫ్రేమ్ రేట్, త్రీ-డీ ఎఫెక్ట్స్ సరిగ్గా పండాలంటే భారీ డాల్బీ తెరలు.. అధునాతన లేజర్ ప్రొజెక్షన్ వ్యవస్థలు తప్పనిసరి అయ్యాయి.
ఎగ్జిబిషన్ రంగం ఇప్పుడు ఒక విప్లవాత్మక దశలో ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రేక్షకుడి అంచనాలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. భవిష్యత్ లో సాధారణ థియేటర్లు కూడా మినీ మల్టీప్లెక్సులుగా మారి.. కనీసం డాల్బీ అట్మాస్ - ఫోర్-కే (4కే) ప్రొజెక్షన్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ఓటీటీల కాలంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అసాధ్యం. సాంకేతికతతో పోటీ పడి అప్‌డేట్ అయిన థియేటర్లు మాత్రమే భవిష్యత్తులో లాభాల బాటలో పయనిస్తాయి.
దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సహా పలు భారీ చిత్రాలు 75 అడుగుల లార్జ్ డాల్బీ స్క్రీన్ (ఏఏఏ సినిమాస్) లో ప్రదర్శనకు వస్తున్నాయి. ఆయా సినిమాలను అధునాతన డాల్బీ థియేటర్‌లో వీక్షించాక ప్రజలు దీని గురించి ఏం చెబుతారో వేచి చూడాలి.