పోక్సో కేసులో బెయిల్: ధర్మం.. విజయంపై స్పందించిన న‌టుడు!

బెయిల్ లభించిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా తొలిస‌రి ఓ భావోద్వేగమైన పోస్ట్‌ను పంచుకున్నారు.

Update: 2026-09-13 19:30 GMT

మైనర్ సహ నటి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసులో అరెస్ట్ అయి వివాదంలో చిక్కుకున్న టెలివిజన్ నటుడు రోహిత్ చందేల్ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ లభించిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా తొలిస‌రి ఓ భావోద్వేగమైన పోస్ట్‌ను పంచుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో న్యాయం ..ధర్మం పట్లే తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సముద్ర తీరంలో సాంప్రదాయ వస్త్రధారణతో నమస్కరిస్తూ ఉన్న ఫోటోను రోహిత్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు `యతో ధర్మస్తతో జయః` (ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది) అనే మహాభారత శ్లోకాన్ని క్యాప్షన్‌గా జోడించారు. భారతీయ న్యాయ వ్యవస్థ .. సుప్రీంకోర్టు చిహ్నం కింద కూడా కనిపించే ఈ శ్లోకం ద్వారా తనపై వచ్చిన ఆరోపణల విషయంలో న్యాయం గెలుస్తుందనే నమ్మకాన్ని పరోక్షంగా వ్యక్తపరిచారు.

ఈ పోస్ట్‌తో పాటు తాను ప్రధాన పాత్ర పోషిస్తున్న స్టార్ ప్లస్ సీరియల్ `సైరాబ్` ముగింపు గురించి కూడా రోహిత్ స్పందించారు. ఈ ఏడాది జూన్ 2న ప్రారంభమైన సీరియల్ సెప్టెంబర్ 14న ముగియనుంది. ఈ సందర్భంగా తన సీరియల్ బృందానికి మరియు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో తనతో నిలిచిన ప్రొడక్షన్ టీమ్, కో-ఆర్టిస్టులను తన సొంత కుటుంబంగా భావిస్తున్నట్లు ఓ సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేశారు.

`ఇషాన్ పాత్రలో నటించడం నాకు ఎంతో ప్రత్యేకమైన ప్రయాణం. ప్రతి దశలోనూ నాకు అండగా నిలిచిన అభిమానులకు, సహ నటులకు హృదయపూర్వక ధన్యవాదాలు. `సైరాబ్` ముగిసినా? మన అనుబంధం ఇలాగే కొనసాగుతుంది. త్వరలోనే నా తదుపరి అధ్యాయంతో మిమ్మల్ని మళ్లీ కలుస్తాను` అని పేర్కొన్నారు. కష్టకాలంలో మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

కేసు వివరాల్లోకి వెళితే.. ఘాట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌లో జూలై 10న రోహిత్ చందేల్‌పై బిఎన్‌ఎస్ (BNS) పోక్సో (POCSO) చట్టాల కింద కేసు నమోదైంది. 16 ఏళ్ల మైనర్ నటి తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీకి పంపారు. నెంబ‌ర్ బ్లాక్ చేసినా? కొత్త నెంబ‌ర్ల‌తో ఫోన్లు చేయడం, కలవడానికి ఒత్తిడి తెచ్చాడనే ఆరోపణలు రోహిత్ పై వచ్చాయి.

కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రోహిత్ కుటుంబ సభ్యులు ఉపశమనం పొందారు. న్యాయస్థానం బెయిల్ ఇచ్చినందుకు రోహిత్ కుటుంబం కోర్టుకు కృతజ్ఞతలు తెలిపింది. `పాండ్యా స్టోర్`, `కాశీబాయి బాజీరావు బల్లాళ్` వంటి సీరియళ్ల తో రోహిత్ చందేల్ కు మంచి గుర్తింపు ద‌క్కింది.

Tags:    

Similar News