హ‌రీష్ శంక‌ర్ డ్రీమ్ ఫుల్ ఫిల్ అయ్యేనా?

ఇప్ప‌టికే విడుద‌లైన లిరిక‌ల్ సాంగ్స్ ఆక‌ట్టుకోవ‌డంతో మార్చి 19న థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లి పోవ‌డం ఖాయం అని అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.;

Update: 2026-03-15 12:30 GMT

టాలీవుడ్‌లో వున్న టాప్ డైరెక్ట‌ర్ల‌లో చాలా మందికి ఓ డ్రీమ్ అనేది ఖ‌చ్చితంగా ఉంటుంది. అదేంటంటే ఎంత పెద్ద‌స్టార్‌తో క‌లిసి సినిమా చేసినా..దాంతో ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నా కానీ డ్రీమ్ హీరోతో చేసే కిక్కే వేరు. అలాంటి అవ‌కాశం కోసం ఏళ్ల‌త‌ర‌బ‌డి ఎదురు చూస్తుంటారు. ఆ స‌మ‌యం వ‌స్తే త‌ను న‌చ్చి, త‌నెంతో ఇష్ట‌ప‌డిన స్టార్‌ని మ‌రింత కొత్త‌గా చూపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు. స‌రిగ్గా ఇలాంటి డ్రీమ్‌ని ఫుల్ ఫిల్ చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో ఎదురు చూస్తున్నారు స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్‌ శంక‌ర్‌.

ఆయ‌న తెర‌కెక్కించిన `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` మార్చి 19న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `ఓజీ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత చేస్తున్న సినిమా కావ‌డం, `గ‌బ్బ‌ర్‌సింగ్‌` త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌- హ‌రీష్‌ శంక‌ర్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై స‌హ‌జంగానే అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన లిరిక‌ల్ సాంగ్స్ ఆక‌ట్టుకోవ‌డంతో మార్చి 19న థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లి పోవ‌డం ఖాయం అని అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

శ‌నివారం విడుద‌లై ట్రైల‌ర్ హ‌రీష్ శంక‌ర్ మార్కులో ఉండ‌టం, ప‌వ‌న్ చేత త‌న‌దైన మార్కు పంచ్‌ల‌ని వేయించ‌డంతో సినిమాపై అనుకున్న‌దానికి మించి హైప్ పెరిగింది. ట్రైల‌ర్‌పై చిరంజీవి నుంచి నిఖిల్ వ‌ర‌కు ప్ర‌శంస‌లు కురిపించ‌డ‌మే కాకుండా వింటేజ్ ప‌వ‌న్ ఈజ్ బ్యాక్ అని చెప్ప‌డం, ట్రైల‌ర్ ఎండింగ్‌లో ఈసారి `పెర్ఫ‌ర్మెన్స్ బ‌ద్ద‌లైపోద్ది` అంటూ ప‌వ‌న్ లాస్ట్ పంచ్ వేయ‌డంతో నిజంగానే థియేట‌ర్లు మెగా ఫ్యాన్స్ హంగామాతో బ‌ద్ద‌లైపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇదిలా ఉంటే త్వ‌ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో భారీ యాక్ష‌న్ డ్రామాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్న హ‌రీష్ శంక‌ర్‌కు షారుక్ ఖాన్‌తో సినిమా చేయాల‌న్న‌ డ్రీమ్ ఉంద‌ట‌. అది చాలా కాలంగా అలాగే ర‌న్న‌వుతూ వ‌స్తోందని, త్వ‌ర‌లోనే దాన్ని సాకారం చేసుకోవాల‌నే ప్లాన్‌లో హారీష్ ఉన్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌. ఆ మ‌ధ్య రెండు, మూడు సార్లు షారుక్ ఖాన్‌ని హ‌రీష్ శంక‌ర్ ప్ర‌త్యేకంగా క‌లిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడున్న బిజీలో షారుక్ ..హ‌రీష్ కు టైమ్ ఇస్తాడా? ..ఇస్తే త‌న రేంజ్ సినిమా హ‌రీష్ ఇస్తాడా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

హ‌రీష్ శంక‌ర్ డ్రీమ్ నెర‌వేరుతుందా? ఇప్పుడున్న బిజినెస్ లెక్క‌లు, బాక్సాఫీస్ ఫిగ‌ర్స్‌ని దృష్టిలో పెట్టుకుని షారుక్ ఆఫ‌ర్ ఇస్తాడా? అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం షారుక్ ఖాన్ `కింగ్‌` మూవీలో న‌టిస్తున్నాడు. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో దీపిక ప‌దుకునే, అభిషేక్ బ‌చ్చ‌న్‌, అనీల్ క‌పూర్‌, జాకీష్రాఫ్‌, అర్ష‌ద్ వ‌ర్సీ, రాణి ముఖ‌ర్జీ, రాఘ‌వ్ జూయ‌ల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. డిసెంబ‌ర్ 24న భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

Tags:    

Similar News