ఇండ‌స్ట్రీలో పీత బుర్ర‌ల‌తో ప‌న‌వ్వ‌దు!

దర్శకుడిగా మారాలని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ముందుగా త‌మ దృక్పథాన్ని మార్చుకోవాలి. నెలాఖరుకు వచ్చే జీతం కోసం, కాలక్షేపం కోసం పని చేస్తే ఇక్కడ దర్శకుడి కుర్చీ దక్కదు.

Update: 2026-09-15 18:30 GMT

చలనచిత్ర పరిశ్రమ అనేది అద్భుతమైన సృజనాత్మక ప్రపంచం. ఇక్కడ అవకాశాలు దక్కించుకోవడం ఎంత కష్టమో? దక్కిన అవకాశంతో నిలదొక్కుకోవడం అంతకంటే సవాలుతో కూడుకున్న పని. ఆధునిక సినీ ప్రపంచంలో రాణించాలంటే ఇరుకైన ఆలోచనలు, సంకుచిత మనస్తత్వాలు అస్సలు పనికిరావు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే.. `ఇండస్ట్రీలో పీత బుర్రలతో పనవ్వదు` ఆలోచనలు ఎంతో విశాలంగా ఉన్నప్పుడే సృష్టికర్తగా ఇక్కడ గుర్తింపు లభిస్తుంది.

దర్శకుడిగా మారాలని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ముందుగా త‌మ దృక్పథాన్ని మార్చుకోవాలి. నెలాఖరుకు వచ్చే జీతం కోసం, కాలక్షేపం కోసం పని చేస్తే ఇక్కడ దర్శకుడి కుర్చీ దక్కదు. డబ్బు లేదా జీతం అనేది కేవలం ఒక అవసరం మాత్రమే. కానీ సృజనాత్మకతకు అది ప్రామాణికం కాజాలదు. జీతం కోసం కాకుండా సినీ నిర్మాణంలోని ప్రతి ప్రక్రియను నేర్చుకోవడానికి, నాలెడ్జ్ సంపాదించడానికి మాత్రమే పని చేయాలనే బలమైన సంకల్పం ఉన్నప్పుడే విజయం తలుపు తడుతుంది.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా లేదా అసోసియేట్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రతి క్షణం ఒక పాఠశాల లాంటిది. కెమెరా కోణం నుంచి మొదలుకొని, లైటింగ్, ఎడిటింగ్, రీ-రికార్డింగ్ వరకు ప్రతి విభాగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. పని నేర్చుకోవాలనే తపన ఉన్న వ్యక్తికి ఇండస్ట్రీలో అవకాశాల కరువు ఉండదు. చిన్న చిన్న పనులను కూడా ఎంతో ఇష్టంతో చేస్తూ లోతైన జ్ఞానాన్ని ఆర్జించడమే భావి దర్శకుడికి అసలైన పెట్టుబడి.

మెగాఫోన్ పట్టాలంటే అతని మనసంతా ఎల్లప్పుడూ ద‌ర్శ‌కుడు అనే ఒకే ఒక్క ఆలోచనతో నిండిపోవాలి. నిరంతరం దర్శకుడిని కావాలి అనే ధ్యాస తప్ప మరే ఇతర ఆలోచనా మనసులోకి రాకూడదు. పడుకున్నా? లేచినా? తిన్నా.. ప్రతి క్షణం కథలు, పాత్రలు, సన్నివేశాల గురించే ఆలోచిస్తూ ఉండాలి. ఈ స్థాయి ఏకాగ్రత, పిచ్చి తపన ఉన్నప్పుడే సామాన్యమైన కథకుడు సంచలన దర్శకుడిగా మారగలడు.

ప్ర‌స్తుత‌ రోజుల్లో ప్రేక్షకుల అభిరుచి బాగా మారింది. ప్రపంచ స్థాయి సినిమాలు చూస్తున్న నేటి తరం ప్రేక్షకులను మెప్పించాలంటే దర్శకుడి ఆలోచనా పరిధి అంతకంటే విస్తృతంగా ఉండాలి. కొత్త టెక్నాలజీ, మారుతున్న ట్రెండ్స్, సరికొత్త కథానరేషన్‌పై ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ బ్రాడ్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. సంకుచిత భావాలతో పాతసార కథలకే పరిమితమైతే పరిశ్రమలో కనుమరుగవ్వడం ఖాయం.

సృజనాత్మకతకు హద్దులు లేవు. అలాగే సాధించాలనే పట్టుదల ఉన్నవారికి ఆటంకాలు నిలువలేవు. జీతం వెనుక పరిగెత్తకుండా, జ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకుని ఒకే లక్ష్యంతో ముందుకు సాగే సృజనాత్మకత ఉన్న వ్యక్తులకే పరిశ్రమ ఎల్లప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తుంది. పీత బుర్రలను పక్కనపెట్టి విశాలమైన దృక్పథంతో అడుగులేస్తే వెండితెరపై విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు.

రైట‌ర్ మ‌చ్చ ర‌వి- త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మ‌ధ్య జ‌రిగిన ఓ చిన్న సంభాష‌ణ ఆధారంగా ఇదంతా పుట్టింది. త్రివిక్ర‌మ్ పోసాని కృష్ణ ముర‌ళి వ‌ద్ద అసిస్టెంట్ గా ప‌నిచేస్తోన్న స‌మ‌యంలో నెల‌కు 40 వేలు జీతం ఇచ్చేవారుట‌. కానీ త్రివిక్ర‌మ్ మ‌రో వ్య‌క్తి ద‌గ్గ‌ర చేరి కొత్త విష‌యాలు...నాలెడ్జ్ పెంచుకోవాల‌నుకున్నారు. ఈ క్ర‌మంలో 40వేల జీతం వ‌దిలేసి 3 వేల జీతానికి మ‌రోక‌రి ద‌గ్గ‌ర చేరార‌ని..ఆ స‌మ‌యంలోనే మ‌చ్చ ర‌వి త‌న‌దెంత పీత బుర్రో అని రియ‌లైజ్ అయ్యే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News