'ధురంధర్-3' సాధ్యమేనా? కథను ముగించేస్తున్నారు కదా!
సినిమా రంగంలో ప్రస్తుతం సీక్వెల్‌లు, ఫ్రాంచైజీల ట్రెండ్ నడుస్తోంది. ఒక కథ విజయవంతమైతే దానిని భాగాలుగా పొడిగించడం సాధారణమైపోయింది.;
సినిమా రంగంలో ప్రస్తుతం సీక్వెల్‌లు, ఫ్రాంచైజీల ట్రెండ్ నడుస్తోంది. ఒక కథ విజయవంతమైతే దానిని భాగాలుగా పొడిగించడం సాధారణమైపోయింది. అయితే 'ధురంధర్' వంటి సీరియస్ స్పై థ్రిల్లర్ విషయంలో మూడో భాగం `దురంధర్-3` సాధ్యమేనా? అనే ప్రశ్న ఇప్పుడు సినీ విశ్లేషకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధారణంగా ఒక కథను ముగించాల్సిన చోట కాకుండా అనవసరంగా పొడిగిస్తే అది ప్రేక్షకులకు అతికించినట్లు అనిపించే ప్రమాదం ఉంటుంది. ఇదే విషయం ఇప్పుడు రణవీర్ సింగ్ అభిమానుల్లో చర్చకు దారితీస్తోంది.
గతంలో మనం `బాహుబలి` వంటి భారీ ఫ్రాంఛైజీ చిత్రాలను చూశాము. దర్శకుడు రాజమౌళి మొదటి నుంచే ఇది రెండు భాగాల కథ అని స్పష్టంగా చెప్పారు. చెప్పినట్లుగానే బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలను సరైన పాయింట్ వద్ద ముగించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. అదేవిధంగా సుకుమార్ కూడా `పుష్ప` ఫ్రాంచైజీని రెండు భాగాలుగానే ప్లాన్ చేశారు. కానీ పుష్ప-2 తర్వాత మూడో భాగానికి ఆస్కారం ఉందనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాను దర్శకుడు ఆదిత్యాధర్ `దురంధర్` కోసం అనుసరిస్తున్నారా అన్న సందేహాలు మొదలయ్యాయి.
రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన `దురంధర్` గ్రాండ్ సక్సెస్ సాధించడంతో దాని రెండో భాగం 'ధురంధర్2' (దురంధర్-ది రివెంజ్) ఈ నెల 19న అత్యంత ప్రతిష్టాత్మకంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే చిత్రనిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ అభ్యర్థన మేరకు ఆదిత్యా ధర్ మూడో భాగం వైపు అడుగులు వేస్తున్నారని, ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట రెండు భాగాలతోనే ఈ ప్రయాణం ముగుస్తుందని ప్రకటించిన దర్శకుడు ఇప్పుడు రూటు మార్చడం ఆశ్చర్యకరంగా మారింది.
అయితే ఇక్కడ ఒక పెద్ద సాంకేతిక ఇబ్బంది ఉంది. `ధురంధర్` చిత్రం కొందరు నిజ జీవిత స్పైల కథ ఆధారంగా రూపొందించినది. ఇది ఏ ఒక్కరి కథనో కాదు. అయితే ఒకవేళ రెండో భాగంలోనే కథానాయకుడి పాత్ర ముగిసిపోతే.. ఇక మూడో భాగానికి ఆస్కారం ఉండదు. కానీ ఇది కల్పిత కథ కాబట్టి, మూడో భాగం క్రియేషన్ కి ఆస్కారం లేకపోలేదు.
ఒకవేళ నిజ జీవిత కథే అయితే..!
నిజ జీవిత కథలను తెరకెక్కించేటప్పుడు వాస్తవాలను పక్కన పెట్టి కల్పిత అంశాలను జోడించడం అంత సులభం కాదు. `దురంధర్ 3` రావాలంటే అది `ప్రీక్వెల్` (కథకు ముందు జరిగిన సంఘటనలు) అయ్యుండాలి. లేదా కథానాయకుడు మరణించలేదనే కొత్త ట్విస్ట్‌ను సృష్టించాలి. ఈ రెండింటిలో ఏది చేసినా అది ప్రేక్షకులను మెప్పించేలా ఉండాలి. లేదంటే అది కేవలం వ్యాపార కోణంలో తీసిన సినిమాగానే మిగిలిపోతుంది.
ప్రస్తుతానికి అంతా ఈ నెల 19న విడుదల కాబోయే `ధురంధర్-ది రివెంజ్` ఫలితంపైనే ఆధారపడి ఉంది. ఈ రెండో భాగానికి ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి పార్ట్ 3 కోసం అడుగులు వేయాలా వద్దా అని చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కథలో లాజిక్స్ మిస్ కాకుండా మూడో భాగం సాధ్యమవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
దురంధర్ కథకు స్ఫూర్తినిచ్చిన నిజ జీవిత స్పై ఎవరు? ఆయన ఇంకా బతికే ఉన్నారా?
`దురంధర్` సినిమా కథకు ప్రధాన స్ఫూర్తి భారత గూఢచారి చరిత్రలో అత్యంత సాహసికుడిగా పేరుగాంచిన రవీంద్ర కౌశిక్. భారత నిఘా సంస్థ `రా` (RAW) కోసం పని చేసిన ఆయనను `ది బ్లాక్ టైగర్` అని కూడా పిలుస్తారు.
రవీంద్ర కౌశిక్ ఒక థియేటర్ ఆర్టిస్ట్. ఆయన ప్రతిభను గుర్తించిన `రా` అధికారులు ఆయనకు శిక్షణ ఇచ్చి పాకిస్థాన్‌లోకి పంపారు. అక్కడ ఆయన తన పేరును నబీ అహ్మద్ షాకిర్ గా మార్చుకుని.. అక్కడి లా కాలేజీలో చేరి డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత పాకిస్థాన్ ఆర్మీలో చేరి `మేజర్` స్థాయికి ఎదిగి భారత దేశానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించేవారు. ఆయన అందించిన సమాచారం వల్ల భారత్ అనేక యుద్ధ తంత్రాలలో పైచేయి సాధించింది.
దురదృష్టవశాత్తూ రవీంద్ర కౌశిక్ ఇప్పుడు బతికి లేరు. ఆయన జీవితం అత్యంత విషాదకరంగా ముగిసింది. 1983లో భారత్ పంపిన మరో గూఢచారి పాక్ అధికారులకు చిక్కడం వల్ల రవీంద్ర కౌశిక్ అసలు రూపం బయటపడింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి దశాబ్ద కాలం పాటు జైలులో ఉంచి చిత్రహింసలకు గురిచేసింది. మొదట మరణశిక్ష విధించినా కానీ.. తర్వాత దానిని జీవిత ఖైదుగా మార్చారు. జైలులోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఊపిరితిత్తుల వ్యాధి, గుండెపోటు కారణంగా 2001లో ముల్తాన్ జైలులో ఆయన మరణించారు.
నిజ జీవిత కథ స్ఫూర్తి అయితే ... రవీంద్ర కౌశిక్ (స్పై పాత్ర) మరణించారు కాబట్టి, `దురంధర్ 3`కి ఆస్కారం తక్కువగా కనిపిస్తుంది. అయితే, దర్శకులు ప్రీక్వెల్ (ఆయన స్పైగా మారకముందు జరిగిన కథ) రూపంలో లేదా ఆయన జైలు జీవితం నేపథ్యంలో మరేదైనా కల్పిత ట్విస్ట్‌తో కథను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. రవీంద్ర కౌశిక్ జీవితంపై ఇప్పటికే బాలీవుడ్‌లో `ఏక్ థా టైగర్` వంటి సినిమాలు ప్రేరణ పొంది వచ్చాయి కానీ `దురంధర్` నేరుగా ఆయన సాహసాల చుట్టూ తిరిగే కథగా ప్రచారం పొందుతోంది. అయితే ఏక్ థా టైగర్ కానీ, దురంధర్ కథ కానీ పాక్షికంగా ఫిక్షనల్ (కొంత నిజం.. కొంత కల్పితం) కాబట్టి ఈ కథకు ముగింపు గురించి భయపడాల్సిందేమీ లేదు.