పరేష్ రావల్ కుమారుడు నటుడిగా తెరంగేట్రం
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ - స్వరూప్ సంపత్ దంపతుల కుమారుడైన అనిరుద్ధ్ రావల్ వెండితెరకు ఆరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు.
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ - స్వరూప్ సంపత్ దంపతుల కుమారుడైన అనిరుద్ధ్ రావల్ వెండితెరకు ఆరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. విశేష్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న `ఆవారపన్ 2` చిత్రంలో ఇమ్రాన్ హాష్మీతో కలిసి ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో `సికిందర్` అనే ప్రాధాన్యత ఉన్న పాత్రలో అనిరుద్ధ్ కనిపించనున్నారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ `స్కూప్`లో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ యువనటుడు ఇప్పుడు ఈ సీక్వెల్ ద్వారా బిగ్ స్క్రీన్‌పై అడుగుపెడుతుండటంపై చిత్ర వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అనిరుద్ధ్ రావల్ కేవలం నటుడిగానే కాకుండా సినీ నిర్మాణంలోని వివిధ శాఖలపై పూర్తి అవగాహన పెంచుకుని పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా వద్ద నటనలో శిక్షణ పొందిన ఆయన రంగస్థలం- థియేటర్ రంగంలో మంచి అనుభవాన్ని గడించారు. అంతేకాకుండా... నటుడిగా మారడానికి ముందే సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలైన సుల్తాన్, టైగర్ జిందా హైలకు సహాయ దర్శకుడిగా పనిచేసి తెరవెనుక సాంకేతిక విషయాలపై పట్టు సాధించారు.
భట్ - రావల్ కుటుంబాల మధ్య ఉన్న సుదీర్ఘ సృజనాత్మక అనుబంధాన్ని ఈ 'ఆవారపన్ 2' చిత్రం మరోసారి గుర్తుచేస్తోంది. మొదటి భాగం సాధించిన విజయం.. ఇమ్రాన్ హాష్మీ క్రేజ్ తో పాటు అనిరుద్ధ్ రావల్ విలక్షణమైన పాత్ర ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. చిత్రీకరణ పూర్తిచేసుకుంటున్న ఈ భారీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పరేష్ వారసుడి ప్రవేశం గురించి తెలుసుకున్న నెటిజనులు అతడు తండ్రి పేరు నిలబెడతాడా? అంటూ సామాజిక మాధ్యమాలలో డిబేట్లు స్టార్ట్ చేసారు.
వాయిదా పడలేదు.. చెప్పిన సమయానికే రిలీజ్:
'ఆవారపన్ ' విడుదల తేదీపై వస్తున్న రకరకాల రూమర్లకు చెక్ పెడుతూ హష్మీ తాజాగా విడుదల తేదీపై క్లారిటీనిచ్చారు. ఈ చిత్రం వాయిదా పడుతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో, ఇమ్రాన్ హాష్మీ అభిమానులతో జరిపిన ప్రత్యక్ష సంభాషణలో స్పష్టత ఇచ్చారు. ఇటువంటి ఆధారాలు లేని వార్తలు వైరల్ కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ... సినిమా అనుకున్న సమయానికే అంటే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సన్నీ డియోల్ నటించిన `బట్వారా 1947`తో తలపడనుంది.
మొదటి భాగంలో శ్రియ శరన్ హీరోయిన్‌గా నటించగా.అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా.. కాలక్రమేణా కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు పొందింది. ఇప్పుడు వస్తున్న ఈ సీక్వెల్‌ను నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా దిశా పటానీ కథానాయికగా నటిస్తున్నారు. పరేష్ రావల్ కుమారుడు అనిరుద్ధ్ రావల్ కూడా ఇందులో కీలక పాత్రలో పరిచయం అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.