వేగం, భయం, క్రమశిక్షణ..రేసింగ్ వెనుక తల రియల్ లైఫ్ 'గ్లాడియేటర్స్'!
ట్రైలర్ ప్రారంభంలో అజిత్ మోటార్ రేసింగ్ ప్రాముఖ్యతను వివరిస్తూ రేసింగ్ అనేది కేవలం గ్లామర్ లేదా వేగానికి మాత్రమే పరిమితమైనది కాదన్నారు.
తల అజిత్ కథానాయకుడిగా మోటార్ రేసింగ్ కెరీర్ ఆధారంగా తెరకెక్కిన `గ్లాడియేటర్స్` డాక్యుమెంటరీ ట్రైలర్ సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. ఏ.ఎల్. విజయ్ రూపొందించిన 3 నిమిషాల 46 సెకన్ల ట్రైలర్‌లో అజిత్ రేసింగ్ ప్రయాణంతో పాటు.. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా అజిత్ భార్య శాలిని, పిల్లలు అనుష్క, ఆద్విక్ వీడియోలో కనిపించి తమ భావాలను పంచుకోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ ప్రారంభంలో అజిత్ మోటార్ రేసింగ్ ప్రాముఖ్యతను వివరిస్తూ రేసింగ్ అనేది కేవలం గ్లామర్ లేదా వేగానికి మాత్రమే పరిమితమైనది కాదన్నారు. ఇందులో అత్యంత క్రమశిక్షణ, ఖచ్చితత్వం, క్లిష్టమైన క్షణాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతో కీలకమని చెప్పారు. దుబాయ్ 24H, లీ మ్యాన్స్ వంటి అంతర్జాతీయ రేసింగ్ ట్రాక్‌లలో పాల్గొన్న అనుభవాలను పంచు కున్నారు. ఎండ్యూరెన్స్ రేసింగ్ అనేది ఆటగాడి సామర్థ్యానికి నిజమైన పరీక్ష గా పేర్కొన్నారు.
అజిత్ భార్య నటి శాలిని ఈ డాక్యుమెంటరీలో మాట్లాడుతూ.. అజిత్‌ను అందరూ ఒక నటుడిగానే చూస్తారు. కానీ తన కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమించే వ్యక్తిగా ఆయనను తాము మాత్రమే దగ్గరగా చూసామన్నారు. రేస్ ట్రాక్‌లో అజిత్ ప్రదర్శన ఇచ్చే సమయంలో తాను తీవ్రమైన భయానికి, కంగారుకు గురవుతానని శాలిని అంగీకరించారు. అయినా? ఆయన ఎదుర్కొన్న ప్రమాదాలను, గెలుపోటములతో సంబంధం లేకుండా అజిత్ చూపించే పట్టుదలను చూసి.. ఆయన కలల సాధనకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానన్నారు.
ఈ డాక్యుమెంటరీలో అజిత్ పిల్లలు కూడా తండ్రి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కుమార్తె అనుష్క మాట్లాడుతూ.. ఒక నటుడిగా కంటే కూడా తండ్రి చూపించే విలువలు, పెంచిన విధానం తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు. కుమారుడు ఆద్విక్ మొదటిసారి తన తండ్రి రేసింగ్ కార్‌లో కూర్చున్న క్షణాన్ని గుర్తు చేసుకుంటూ.. అంత ఇరుకైన స్థలంలో తన తండ్రి రేస్ కార్‌ను ఎలా నడుపుతారో? చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానన్నారు.
అజిత్ కుమార్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు కలల రేసింగ్ కెరీర్‌ను ఎంతో సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. అజిత్ నుంచి రిలీజ్ అయిన `విదాముయర్చి`, `గుడ్ బ్యాడ్ అగ్లీ` వంటి చిత్రాల తర్వాత రేసింగ్ ఆఫ్-సీజన్‌లో మాత్రమే సినిమాల చిత్రీకరణలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అజిత్ తదుపరి చిత్రం `డేర్ డెవిల్` షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభం కానుంది.