'దురంధ‌ర్' ఆస్కార్‌కి వెళ్ల‌క‌పోతే జ‌క్క‌న్న‌ 'వార‌ణాసి' వెళుతుందా?

సంచ‌ల‌నాల దురంధ‌ర్ ఆస్కార్ బ‌రిలో ఎందుకు పోటీకి నిల‌వ‌లేదు? దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ ఇది.

Update: 2026-09-20 11:34 GMT

'దురంధ‌ర్' ఆస్కార్ మెటీరియ‌ల్ కాక‌పోతే రాజ‌మౌళి `వార‌ణాసి` ఆస్కార్ మెటీరియ‌ల్ అవుతుందా? అస‌లు భార‌తీయ సినిమాల‌లో ఆస్కార్ మెటీరియ‌ల్ కంటెంట్ అంటే ఎలా ఉండాలి? అస‌లు ఆస్కార్ ద‌క్కేందుకు ఎలాంటి సినిమాల‌కు ఛాన్స్ ఉంటుంద‌ని వ‌ర‌ల్డ్ సినిమా హిస్ట‌రీ చెబుతోంది? డీప్ గా విశ్లేషిస్తే..

సంచ‌ల‌నాల దురంధ‌ర్ ఆస్కార్ బ‌రిలో ఎందుకు పోటీకి నిల‌వ‌లేదు? దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ ఇది. నిజానికి ప్రపంచ సినిమా రంగం ఎప్పుడూ కూడా కమర్షియల్ హంగులు - కళాత్మక విలువలు అనే రెండు భిన్న ధృవాల మధ్య నడుస్తుంటుంది. ఇటీవల కాలంలో భారీ బాక్సాఫీస్ వసూళ్లతో సంచలనం సృష్టించిన `దురంధర్` లాంటి చిత్రాలు ఆస్కార్ లేదా అవార్డుల‌ రేసులో వెనుకబడిపోవడంపై జరుగుతున్న చర్చలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టే చిత్రాలు సైతం ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాల ఎంపికలో నిలవకపోవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ సభ్యుడు వివేక్ వాస్వానీ దీనిపై స్పందిస్తూ.. `దురంధర్` సినిమాపై ప్రశంసలు కురిపించినా కానీ.. అందులో ఆస్కార్ జ్యూరీ కోరుకునే విలక్షణమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం లోపించిందని తేల్చిచెప్పారు. ఈ స్పష్టత కమర్షియల్ ఎంటర్‌టైనర్లు, గ్లోబల్ స్థాయిలో ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమా రెండు పూర్తిగా భిన్నమైన కొలమానాలపై ఆధారపడి పనిచేస్తాయనే సత్యాన్ని బట్టబయలు చేస్తోంది.

ప్రపంచ సినిమా చరిత్రను పరిశీలిస్తే.. ఆస్కార్ కమిటీలు ఎప్పుడూ కేవలం భారీ బడ్జెట్ లేదా హాలీవుడ్ స్థాయి విజువల్స్ కంటే.. ఆయా దేశాల మట్టి వాసన ఉట్టిపడే స్వదేశీ సంస్కృతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయని స్పష్టమవుతుంది. ఒక సినిమా పూర్తిగా పాశ్చాత్య యాక్షన్ టెంప్లేట్లు లేదా గ్లోబల్ ట్రెండ్స్‌ను గుడ్డిగా అనుసరిస్తే.. అది అంతర్జాతీయ జ్యూరీని ఆకట్టుకోగల ప్రత్యేకమైన సాంస్కృతిక దృగ్విష‌యాన్ని కోల్పోతుంది.

ఈ నేపథ్యంలోనే ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ `వారాణాసి`పైనా బోలెడంత చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. 2027లో విడుద‌లైతే 2028 ఆస్కార్ బ‌రిలో నిలిచే అవ‌కాశం ఉంటుంది. అయితే ఇది సాధ్య‌మేనా? అంటే.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల ద్వారా రాజ‌మౌళి .. విజువల్ వండర్స్‌తో కూడిన హై-ఆక్టేన్ కథాంశాలను సైతం అచ్చమైన భారతీయ మూలాలు, సెంటిమెంట్ల చుట్టూ అల్లడంలో సిద్ధహస్తుడు అని ప్రూవైంది. సరిగ్గా ఇలాంటి పద్ధతే స్థానిక సంస్కృతిని, సార్వత్రిక అప్పీల్‌ను మిళితం చేసి ఆస్కార్ రేసులో నిలబడటానికి బలమైన పునాది వేస్తుంది.

అయితే ఒక సినిమాను `ఆస్కార్ మెటీరియల్`గా మలచడం అనేది సార్వత్రిక మానవీయ విలువలకు, ప్రాంతీయ గుర్తింపునకు మధ్య నడిచే సన్నని తాడు మీద ప్రయాణం లాంటిది. కేవలం ప్రొడక్షన్ స్కేల్ కంటే.. ముడి మానవ భావోద్వేగాలు.. జీవన పోరాటం లేదా సమాజం లోపలి లోతుల్ని ఆవిష్కరించే కథలే విజేతలుగా నిలుస్తాయని వరల్డ్ సినిమా హిస్టరీ చెబుతోంది. జ్యూరీ సభ్యులు ఎప్పుడూ కూడా హాలీవుడ్ ఫార్ములాల అనుకరణలను కాక... అథెంటిక్ అయిన కళాత్మక నిజాయితీనే కోరుకుంటారు.

అంతిమంగా సినిమా రంగంలో కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌లు, అవార్డుల స్థాయి సినిమాలు వేర్వేరు పాత్రలను పోషిస్తాయి. బాక్సాఫీస్ రికార్డులు ఇండస్ట్రీకి ఆర్థిక బలాన్ని ఇస్తే.. ఆస్కార్ లాంటి వేదికలు మాత్రం లోతైన సాంస్కృతిక విలువలకు పెద్దపీట వేస్తాయి. భారతీయ చిత్రాలు ప్రపంచ వేదికపై మరింత దూసుకెళ్తున్న తరుణంలో.. భారీ కమర్షియల్ విజయాలను.. అద్భుతమైన సాంస్కృతిక కథాకథనాన్ని సమతుల్యం చేయడమే నేటి సృష్టికర్తలకు అసలు సిసలు సవాల్. అయితే ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ బ‌రిలో మార్మోగిన‌ రాజ‌మౌళి పేరు మ‌రోసారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మోగాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. 2027-28 సీజ‌న్ లో వార‌ణాసిని ఆస్కార్ బ‌రిలో నిల‌పాలంటే జ‌క్క‌న్న ఎలాంటి ఫార్ములాను ఉప‌యోగిస్తారు? అన్న‌ది వేచి చూడాలి.

Tags:    

Similar News