వెంకీ లైనప్.. ఫ్యామిలీ ఆడియన్స్ కు డబుల్ కిక్!
రాబోయే సినిమాల జాబితా చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామాను జోడించి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.;
టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కు కేరాఫ్ అడ్రస్. దశాబ్దాలుగా కుటుంబ కథా చిత్రాలతో ఆయన సంపాదించుకున్న ఇమేజ్ అలాంటిది. అయితే ఈ మధ్య వెంకీ ఎంచుకుంటున్న కథలు గమనిస్తే ఒక ఆసక్తికరమైన కొత్త ప్యాటర్న్ కనిపిస్తోంది. కేవలం సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామాలే కాకుండా, అందులో 'క్రైమ్' అనే ఎలిమెంట్ ను చాలా తెలివిగా మిక్స్ చేస్తున్నారు. రాబోయే సినిమాల జాబితా చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామాను జోడించి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమానే ఇందుకు ఉదాహరణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. పైకి పండుగ వాతావరణం, ఫ్యామిలీ డ్రామా అనిపించినా, అందులో క్రైమ్ కామెడీని ప్రధానంగా హైలైట్ చేశారు. టైటిల్ లోనే గన్ పెట్టి మరీ అప్పుడే ఒక హింట్ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్ వెంకీకి ఈ కొత్త జానర్ పై నమ్మకాన్ని పెంచినట్లుంది. అందుకే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తో మొదలుపెట్టిన 'ఆదర్శ కుటుంబం' విషయానికి వస్తే, ఇక్కడ కూడా అదే ఫార్ములా కనిపిస్తోంది. టైటిల్ వినడానికి చాలా సాఫ్ట్ గా, పద్ధతిగా అనిపిస్తోంది. కానీ టైటిల్ డిజైన్ లో 'AK 47' అనే ట్యాగ్ లైన్ పెట్టడం, అలాగే లోగోలో రక్తపు చుక్క ఉండటం చూస్తుంటే, ఇది మామూలు ఫ్యామిలీ స్టోరీ కాదని క్లారిటీ వచ్చేసింది. పైకి ఆదర్శవంతమైన కుటుంబంలా కనిపిస్తూనే, లోపల ఏదో పెద్ద క్రైమ్ డీల్ లేదా గొడవల్లో ఆ కుటుంబం చిక్కుకున్నట్లుగా కథ ఉండే ఛాన్స్ ఉంది.
ఈ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ 'దృశ్యం 3'. ఫ్యామిలీ, క్రైమ్ అనే రెండు విభిన్నమైన జానర్లను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసిన సినిమా ఇది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక సామాన్యుడు చేసే క్రైమ్, దాని చుట్టూ తిరిగే కథ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడో భాగంతో ఆ ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. వెంకీ లైనప్ లో ఇది కూడా మోస్ట్ అవైటెడ్ మూవీనే. కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్లే రాంబాబు పాత్రలో వెంకీ నటన మళ్ళీ చూడబోతున్నాం.
వెంకటేష్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చాలా స్మార్ట్ గా ఉన్నాయి. కేవలం సాఫ్ట్ సినిమాలు చేస్తే మాస్ ఆడియన్స్ దూరమయ్యే ప్రమాదం ఉంది, అలాగని ఓవర్ యాక్షన్ సినిమాలు చేస్తే ఫ్యామిలీస్ కు నచ్చకపోవచ్చు. అందుకే ఈ 'ఫ్యామిలీ విత్ క్రైమ్' అనే పాయింట్ ను పట్టుకున్నారు. దీనివల్ల యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పించవచ్చు. పైగా ఆయన వయసుకు, బాడీ లాంగ్వేజ్ కు ఈ తరహా కథలు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.