2026లోనూ అదే సీన్ రిపీట్ కాబోతుందా?
తెలుగు మార్కెట్ ఖాళీగా ఉండటంతో బాలీవుడ్ , శాండల్‌వుడ్ చిత్రాలు ఇక్కడ పాగా వేసేందుకు సిద్ధమయ్యాయి.;
తెలుగు సినీ పరిశ్రమకు 2025 ఏమాత్రం కలిసిరాలేదు. అగ్ర హీరోల సినిమాలు లేక బాక్సాఫీస్ కళ తప్పింది. అయితే దురదృష్టవశాత్తూ 2026లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వంటి గ్లోబల్ స్టార్ల సినిమాలు ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. పెద్ద సినిమాలు లేకపోతే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనే చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం అగ్ర హీరోలందరూ భారీ బడ్జెట్ , పాన్-ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మహేష్ , రాజమౌళితో చేస్తున్న వారణాసి షూటింగ్ దశలోనే ఉండగా, ఎన్టీఆర్ డ్రాగన్, ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ 22వ చిత్రం కూడా ఆన్ సెట్స్ లో నే ఉంది. ఈ చిత్రాలన్నీ 2027లోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో 2026 సంవత్సరం టాలీవుడ్ పాలిట మరో డ్రై ఇయర్ గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. సరిగ్గా ఇదే సమయాన్ని ఇతర భాషా చిత్రాలు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి.
తెలుగు మార్కెట్ ఖాళీగా ఉండటంతో బాలీవుడ్ , శాండల్‌వుడ్ చిత్రాలు ఇక్కడ పాగా వేసేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా హిందీ చిత్రాలు దురందర్`2, `రామాయణం మొదటి భాగం భారీ అంచనాలతో విడుదలవుతున్నాయి. ఈ సినిమాలు తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ నుంచి పోటీ లేకపోవడం ఈ సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ కూడా 2026 రేసులో నిలిచింది. ఈ మూడు చిత్రాలు కలిపి బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నాయి.
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తారు కాబట్టి, మన హీరోలు లేని లోటును ఈ పరభాషా చిత్రాలు భర్తీ చేసే అవకాశం ఉంది. దీనివల్ల తెలుగు సినిమాలకు రావాల్సిన రెవెన్యూ ఇతర భాషల ఖాతాల్లోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ మళ్ళీ పుంజుకోవాలంటే టైర్-2 హీరోల పైన , చిన్న సినిమాల పైన భారమంతా పడనుంది. 2026లో బాక్సాఫీస్ వెలవెలబోకుండా ఉండాలంటే మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలతో మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మన మార్కెట్‌ను బాలీవుడ్ మరియు ఇతర సౌత్ సినిమాలు ఆక్రమించడం ఖాయం. టాలీవుడ్ స్టార్స్ తమ స్పీడ్ పెంచి కనీసం ఏడాదికి ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.