ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాద్ బయోపిక్..హోంబలే సంచలనం!
| కేజీఎఫ్, సలార్, కాంతార, మహావతార్ నరసింహా చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాద్ జీవితం ఆధారంగా ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ యానిమేషన్ చిత్రాన్ని రూపొందిస్తోంది. 2027 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
కేజీఎఫ్, సలార్ లాంటి కమర్షియల్ చిత్రాలనే కాదు `కాంతర` లాంటి దైవిక శక్తిపైనా సినిమా తీసి పాన్ ఇండియాలో నిరూపించింది హోంబలే ఫిలింస్. ఆ తర్వాత భక్త ప్రహ్లాదుని కోసం ఉగ్రరూపం దాల్చే నరసింహస్వామి కథతో మహావతార్- నరసింహా అనే యానిమేషన్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన ఘనత హోంబలే ఫిలింస్ బ్యానర్ కి దక్కుతుంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఇతిహాస కథల్ని హోంబలే సంస్థ వెండితెరకెక్కిస్తోంది. అద్భుతమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుని ప్రపంచానికి తెలియని ఎన్నో గొప్ప గొప్ప టాపిక్స్ ని ప్రేక్షక లోకానికి పరిచయం చేస్తూ హోంబలే తన విశిష్ఠతను చాటుకుంటోంది.
ఇప్పుడు మరో మహాద్భుతమైన దైవాంశ సంభూతుడి జీవితకథను హోంబలే సంస్థ సినిమాగా తెరకెక్కిస్తుండడం చర్చగా మారింది. ఇస్కాన్ (ISKCON) వ్యవస్థాపక ఆచార్యులు, శ్రీల ప్రభుపాద్ (A.C. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద) దివ్యమైన జీవిత కథ ..ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా `శరణాగతి - ద లైఫ్ ఆఫ్ ఎ సర్రెండర్డ్ సోల్` అనే ప్రతిష్టాత్మక యానిమేటెడ్ చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించింది. ట్రాన్స్‌ఎండెంటల్ ఫిల్మ్స్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తూ భగవద్గీత సారాన్ని, శ్రీకృష్ణుడి తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఒక మహాత్ముడికి ఈ చిత్రం ద్వారా ఘనమైన నివాళి అర్పిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
భక్తి, ఆధ్యాత్మిక సేవ.. మానవాళికి ఒక దివ్యమైన మార్గాన్ని చూపించడంలో శ్రీల ప్రభుపాద్ చూపించిన మార్గం అత్యుత్తమమైనది. జంతు ప్రవర్తన నుంచి మారి మనిషి నిజమైన స్వచ్ఛమైన భక్తి తత్వానికి ఎలా ట్రాన్స్ ఫామ్ అవ్వాలో ఆయన భోధనల్లో కనిపిస్తుంది. శరణాగతి చిత్రం విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలలో ధ్వనించే ఆధ్యాత్మిక భావన.
శ్రీల ప్రభుపాద్ తన 69వ ఏట.. అంటే 1965లో తన గురువు ఆదేశానుసారం కేవలం కొన్ని రూపాయలు తనతో ఉంచుకుని.. భగవద్గీత గ్రంథాల పెట్టెతో ఇండియా నుండి అమెరికాకు ఒక సరకు రవాణా నౌకలో ఒంటరిగా పయనమయ్యారు. వయోభారం, ఆరోగ్యం సహకరించకపోయినా... కేవలం శ్రీకృష్ణుడిపై ఉన్న అచంచలమైన నమ్మకంతో పాశ్చాత్య ప్రపంచంలో అడుగుపెట్టి కృష్ణ చైతన్య ఉద్యమానికి నాంది పలికారు. అడ్డంకులను అధిగమించి.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి భగవద్గీత విశిష్టతను.. దేవాది దేవుని నమస్మరణ.. సంకీర్తన మహత్యాన్ని అందించిన ఆయన త్యాగం, పట్టుదల ఈ చిత్రానికి ప్రధాన కథాంశంగా నిలవనున్నాయి.
ఈ విజువల్ వండర్‌ను వెండితెరపై ఆవిష్కరించడానికి సరికొత్త ఏఐ మోషన్ క్యాప్చుర్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఆధునిక కంప్యూటర్ విజన్ ద్వారా నిజమైన మానవ కదలికలు, భావోద్వేగాలు, అభినయాన్ని డిజిటల్ పాత్రలపై మ్యాపింగ్ చేసే ఈ టెక్నాలజీ వల్ల యానిమేషన్ పాత్రలు అత్యంత నేచురల్ గా, ప్రాణమున్నట్లుగా కనిపిస్తాయి. డైవ్ డీప్ ఏఐ స్టూడియో దీనికి సహకరిస్తోంది.
ఈ విలక్షణమైన ప్రాజెక్ట్‌కు గౌర శక్తి దాస దర్శకత్వం వహిస్తుండగా... రాజేష్ సింగ్ - లోహిత్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీధర్ శికారిపుర విజువల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇస్కాన్, శ్రీ నరసింహ చైతన్య మఠం .. భక్తివేదాంత బుక్ ట్రస్ట్ ఆశీస్సులతో రూపొందుతున్న ఈ యానిమేషన్ ఫీచర్ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ అత్యంత శ్రద్ధాసక్తులతో నిర్మించి 2027 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.