పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?
| వరుస ఫ్లాపులతో ఓ టాలీవుడ్ దర్శకుడి తాజా సినిమా విడుదల చిక్కుల్లో పడింది. గత సినిమాలతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు పాత బాకీలు తేల్చాలని పట్టుబడుతుండగా, ఓటీటీ డీల్ కూడా కుదరడం లేదు. మరోవైపు ఫైనాన్షియర్ల అప్పులు పెరగడంతో సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే నెత్తికెత్తుకుంటారు, అదే వరుస ఫ్లాపులు పడితే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ ఇన్‌సైడ్ స్టోరీ అదే తరహాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు క్రేజీ ప్రాజెక్టులతో సౌండ్ చేసిన ఓ డైరెక్టర్, ఇప్పుడు తన లేటెస్ట్ సినిమాను కనీసం థియేటర్ల దాకా తెచ్చుకోలేని పరిస్థితిలో ఇరుక్కుపోయారు. సినిమా షూటింగ్ ఎప్పుడో ప్యాకప్ అయినా కూడా, రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే సీన్ ఎక్కడా కనిపించడం లేదు. తెరవెనుక నడుస్తున్న పంచాయితీలు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో బయటపడేలా లేదు.
ఈ రచ్చ అంతటికీ మెయిన్ రీజన్ ఆ డైరెక్టర్ గత సినిమాల తాలూకు నష్టాలే. సొంత బ్యానర్‌లో సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడంతో బయ్యర్లకు భారీగా సెగ తగిలింది. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఒక్కో ఏరియాలో ఒక్కో సినిమాను వేర్వేరు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. దీంతో ఇప్పుడు కొత్త సినిమా రెడీ అవ్వగానే, పాత బాకీలు తేల్చాలంటూ ఏరియాకు ఇద్దరు ముగ్గురు బయ్యర్లు గట్టిగా కాచుక్కూర్చున్నారు. తమ లెక్క తేలితేనే సినిమాను థియేటర్లలో పడనిస్తామంటూ బయ్యర్లు గట్టిగా పట్టుబడుతున్నారు.
పోనీలే అని కొత్త సినిమా రైట్స్‌ను పాత బయ్యర్లకే ఫ్రీగా ఇచ్చి కాంప్రమైజ్ చేద్దామనుకున్నా అక్కడ మరో పీటముడి పడింది. లాస్ట్ సినిమా కొన్నవాడికి ఇవ్వాలా లేక అంతకుముందు సినిమాకు దెబ్బతిన్నవాడికి ఇవ్వాలా అనేది తేలడం లేదు. ఒకడికి ఇచ్చి ఇంకొకడిని పక్కన పెడితే రిలీజ్ రోజు షోలు ఆపేస్తారనే భయం వెంటాడుతోంది. ఇటు చూస్తే ఏరియాకు ఒకరు కాదు, అందరూ హక్కుదారులే. ఎవరికి సర్దుబాటు చేయాలో తెలియక మేకర్స్ తలపట్టుకుంటున్నారు.
ఒకప్పుడు ఇలాంటి కష్టాలు వస్తే నాన్ థియేట్రికల్ రైట్స్ కాపాడేవి. ఓటీటీ సంస్థలు ఇచ్చే ఫ్యాన్సీ రేట్లతో పాత బాకీలన్నీ ఈజీగా సెటిల్ చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెట్ సీన్ మొత్తం రివర్స్ అయింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు ఓటీటీ వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. కంటెంట్ బాగుండి థియేటర్లలో క్రేజ్ వస్తేనే డీల్స్ క్లోజ్ చేస్తున్నారు. దీంతో సినిమాను రిలీజ్ చేయకముందే డిజిటల్ నుంచి పెద్ద మొత్తం రాబట్టడం కష్టంగా మారిపోయింది.
ఇక మిగిలిన అసలైన గండం ఫైనాన్స్. సినిమా నిర్మాణానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు కొండలా పెరిగిపోతున్నాయి. ల్యాబ్ నుంచి క్యూబ్ కాపీ బయటకు రావాలంటే ఫైనాన్షియర్లకు క్లియరెన్స్ ఇవ్వాల్సిందే. అటు డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ఫ్రీగా అడుగుతున్నారు, ఇటు ఓటీటీ నుంచి రూపాయి ముందస్తుగా వచ్చే పరిస్థితి లేదు. కొత్తగా పైసా రాని పరిస్థితుల్లో ఫైనాన్షియర్ల బాకీలు ఎలా తీర్చాలో పాలుపోవట్లేదు. ఈ డెడ్ ఎండ్ నుంచి తప్పించుకోవడం ఆ డైరెక్టర్‌కు పెద్ద టాస్క్‌గా మారింది.
సినిమా తీయడం పెద్ద విషయం కాదు, మార్కెట్‌లో ఉన్న గొడవలన్నీ దాటుకుని రిలీజ్ చేయడం ఎంత కష్టమో ఈ వ్యవహారం చూస్తే అర్థమవుతోంది. సరైన ప్లానింగ్ లేకుండా బడ్జెట్లు పెంచుకుంటూ పోతే చివరికి ఇలాంటి ఇబ్బందుల్లోనే చిక్కుకుంటారు. చేతిలో కంటెంట్ ఉన్నా బయటకు రాలేని ఈ సంక్షోభం నుంచి ఆ డైరెక్టర్ ఎలా బయటపడతారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ పాత బాకీల లెక్కలు తేలి ఆ సినిమా థియేటర్స్ లోకి వెళుతుందో లేదో చూడాలి.