తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్
| సీనియర్ నటి సంగీత తెలుగు సినిమాలే తనకు ఫేవరెట్ అని వెల్లడించారు. తమిళ ఇండస్ట్రీలో తనకు సరైన గౌరవం దక్కలేదని, పాత్రల కోసం పిలిచినప్పుడు కూడా అగౌరవంగా మాట్లాడతారని చెప్పారు. తెలుగులో మాత్రం మంచి పాత్రలతో పాటు గౌరవం, తగిన పారితోషికం ఇస్తారని తెలిపారు. అందుకే తమిళ సినిమాల కంటే తెలుగు చిత్రాల్లో నటించడానికే ఇష్టపడతానని స్పష్టం చేశారు.
ఇతర భాషలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్లు తమ అనువాద చిత్రాల ప్రమోషన్ల కోసం తెలుగు రాష్ట్రాలకు వచ్చినపుడు స్టేజ్ మీద లేదా ఇంటర్వ్యూల్లో మన ఇండస్ట్రీని, మన ప్రేక్షకులను తెగ కొనియాడేయడం మామూలే. కానీ తమ రాష్ట్రంలో ఉన్నపుడు వాళ్లు వాళ్ల ఇండస్ట్రీని, వాళ్ల భాషను, వాళ్ల ప్రేక్షకులనే పొగుడుకుంటారు. కానీ సీనియర్ నటి సంగీత మాత్రం తాను భిన్నమని చాటింది.
ఆమె చెన్నైలో కూర్చుని ఒక తమిళ యాంకర్‌కు ఆ భాషలో ఇంటర్వ్యూ ఇస్తూ.. తెలుగు సినిమా పరిశ్రమకు ఎలివేషన్ ఇచ్చింది. తెలుగు సినిమాలే తన ఫేవరెట్ అని, ఇక్కడ నటించడమే తనకు ఎక్కువ ఇష్టమని.. తమిళ చిత్రాలు చేయడం పట్ల తనకు ఆసక్తి ఎంతమాత్రం లేదని ఆమె తేల్చి చెప్పడం విశేషం. ఇందుకు ప్రధాన కారణం తెలుగు చిత్రాల్లో ఉండే గౌరం తనకు తమిళ సినిమాల నుంచి రావట్లేదని ఆమె కుండబద్దలు కొట్టింది.
తమిళ అమ్మాయే అయిన సంగీత.. తమిళుడే అయిన క్రిష్‌ను పెళ్లాడి, చెన్నైలో సెటిలైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంగీత ఐదు భాషల్లో నటించడం గురించి ప్రస్తావించిన యాంకర్.. వీటిలో మీ ఫేవరెట్ ఏది అని అడిగింది. ఫస్ట్ ఛాయిస్ తమిళం అని చెబుతారు, అది కాకుండా వేరే భాష చెప్పండి అని యాంకర్ అంది. ఐతే సంగీత.. తమిళం నా ఫేవరెట్ కాదు అని స్పష్టం చేసింది. తనకు తెలుగు సినిమాలంటేనే ఎక్కువ ఇష్టమని, అవే తన ఫస్ట్ ఛాయిస్ అని తెలిపింది. తెలుగు సినిమాల్లో తనకు దొరికిన గౌరవం ఇంకెక్కడా రాలేదని చెప్పిన సంగీత.. ఇక్కడ మంచి పాత్రలతో పాటు పారితోషకం కూడా బాగా ఇస్తారని వెల్లడించింది. తమిళ ఇండస్ట్రీలో మాత్రం తనను ఎవ్వరూ, ఎప్పుడూ గౌరవించింది లేదని ఆమె తెలిపింది.
ఏదైనా పాత్ర ఉందని కాల్ చేసి అడిగినా సరే.. తనతో అగౌరవంగా మాట్లాడతారని, తానేదో కరెంటు బిల్లు కూడా కట్టుకోలేనంత కష్టాల్లో ఉన్నట్లు, తనకేదో లైఫ్ ఇస్తున్నట్లు మాట్లాడతారని సంగీత చెప్పింది. వాళ్లు కాల్ చేసి తనను క్యారెక్టర్ కోసం అడిగి వాళ్లే ఒక పారితోషకం చెప్పి వచ్చి నటించిపొమ్మని అంటారని.. తన వర్త్ ఎంతో తనకు తెలుసు కాబట్టి, రెమ్యూనరేషన్ అడగాల్సింది తాను కదా అని ఆమె అభిప్రాయపడింది. తెలుగులో మాత్రం ఇలా ఉండదని, గౌరవంతో పాటు మంచి పాత్రలు, డబ్బులు ఇస్తారని.. అందుకే తనకు తెలుగు సినిమాలే ఫేవరెట్ అని సంగీత స్పష్టం చేసింది. కథానాయికగా తెలుగులో ‘ఖడ్గం’ సహా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన సంగీత.. పెళ్లి తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని సరిలేరు నీకెవ్వరు, మసూద, పరదా లాంటి చిత్రాల్లో నటించింది.