మళ్లీ ఆటంకాలు రాకుండా.. సినిమా కోసం బాలయ్య ఇలా..
నందమూరి బాలకృష్ణకు దైవభక్తి, సెంటిమెంట్లు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ముహూర్తాలు, పూజల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు.;
అడ్డంకులన్నీ దాటుకుని 'అఖండ 2' ఎట్టకేలకు డిసెంబర్ 12న థియేటర్లలోకి దిగుతోంది. గత కొన్ని రోజులుగా నడిచిన హైడ్రామాకు తెరపడటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాక్సాఫీస్ దగ్గర యుద్ధం చేయడానికి ముందు బాలకృష్ణ తనదైన శైలిలో ఆధ్యాత్మిక అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా విజయం కోసం, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణకు దైవభక్తి, సెంటిమెంట్లు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ముహూర్తాలు, పూజల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా దైవానుగ్రహం ఉండాలని బలంగా నమ్ముతారు. ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సీక్వెల్ కోసం కూడా అదే పద్ధతిని పాటిస్తున్నారు.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలకృష్ణ తన జూబ్లీహిల్స్ నివాసంలో ఒక భారీ హోమాన్ని నిర్వహిస్తున్నారట. సినిమా విడుదలకు ముందు ఇలాంటి శాంతి పూజలు చేయడం మంచిదని పండితులు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ముఖ్యంగా గత వారం రోజులుగా సినిమా విడుదలకు సంబంధించి జరిగిన ఆర్థిక, న్యాయపరమైన గొడవలు ఒకరకమైన నెగిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేశాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవాలనే ఉద్దేశంతోనే ఈ హోమం జరిపిస్తున్నట్లు సమాచారం.
'అఖండ' సినిమా కూడా శివుడి ఇతివృత్తంతో, సనాతన ధర్మం నేపథ్యంలో నడుస్తుంది. కాబట్టి దానికి తగినట్లుగానే రుద్ర హోమం లేదా చండీ హోమం వంటివి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, కమర్షియల్ గా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని సంకల్పం తీసుకున్నారట. ఇప్పటికే టికెట్ రేట్ల పెంపు, షోల అనుమతులు రావడంతో సగం భారం తగ్గింది. ఇప్పుడు దైవబలం కూడా తోడైతే తిరుగుండదని భావిస్తున్నారు.
నిజానికి మొదటి పార్ట్ 'అఖండ' సమయంలోనూ బాలకృష్ణ ఇలాంటి పూజలే చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చూశాం. ఆ సెంటిమెంట్ ను ఇప్పుడు సీక్వెల్ కు కూడా కంటిన్యూ చేస్తున్నారు. కేవలం ప్రమోషన్స్, ఇంటర్వ్యూలే కాకుండా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలకు కూడా బాలయ్య అంతే ప్రాధాన్యత ఇస్తారు.
ఇక ఈ సినిమా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో 14 రీల్స్ నిర్మించినట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్. ఇక బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే తప్పకుండా మంచి టాక్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సినిమా ప్రీమియర్స్ కు ఎలాంటి టాక్ దక్కుతుందో చూడాలి.