అఖండ 2 రిలీజ్ టీజర్: 'ఎవడ్రా విభూతి కొండను ఆపేది'
"కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు.. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు.. ఎవడ్రా విభూతి కొండను ఆపేది" అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.;
గత కొన్ని రోజులుగా నందమూరి అభిమానులను టెన్షన్ పెట్టిన రిలీజ్ డేట్ గందరగోళం పూర్తిగా తొలగిపోయింది. అడ్డంకులన్నీ దాటుకుని అఖండ 2 డిసెంబర్ 12న సినిమా థియేటర్లలోకి దిగుతోంది. ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ, చిత్రయూనిట్ తాజాగా 'గ్రాండ్ రిలీజ్ టీజర్'ను వదిలింది. కేవలం ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో, ఇన్నాళ్లుగా ఫ్యాన్స్ లో ఉన్న అసహనాన్ని పటాపంచలు చేసి, పూనకాలు తెప్పించేలా ఉంది.
టీజర్ మొదలవ్వడమే "లోక క్షేమం కోరావు.. ఇక నీ క్షేమం ఆ శివుని అధీనం" అనే పవర్ ఫుల్ డైలాగ్ తో స్టార్ట్ అయ్యింది. మొదటి పార్ట్ లో ఉన్న కూతురికి వచ్చిన ఆటంకంపై అఘోరా ఎదురు దాడి చేయనున్నట్లు అర్థమవుతోంది. ఇక విలన్స్ ని ఊచకోత కోసి మరి దిష్టి తీయడం మరో హైలెట్ షాట్. ఇందులో బాలకృష్ణ లుక్, ఆ డైలాగ్ పవర్ చూస్తుంటే మొదటి పార్ట్ వైబ్రేషన్స్ మళ్ళీ గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లో తమన్ ఇచ్చిన స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. విజువల్స్ లో ఆ గ్రాండియర్, శివుడి ఎలిమెంట్స్ గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ టీజర్ మొత్తానికి హైలైట్ అంటే ఆ ఒక్క డైలాగ్ అనే చెప్పాలి. "కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు.. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు.. ఎవడ్రా విభూతి కొండను ఆపేది" అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. సినిమా విడుదలకు వచ్చిన అడ్డంకులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఆ కళ్లలో ఇంటెన్సిటీ, చేతిలో త్రిశూలం చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.
బోయపాటి శ్రీను మరోసారి తన మార్క్ మాస్ పల్స్ ను పట్టుకున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సనాతన ధర్మం, దైవభక్తి అనే అంశాలను ఎంత బలంగా చూపించబోతున్నారో ఈ చిన్న టీజర్ తోనే హింట్ ఇచ్చారు. ఇందులో చూపించిన విజువల్స్ చూస్తుంటే బడ్జెట్ ఏ రేంజ్ లో పెట్టారో అర్థమవుతోంది. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తున్నాయి.
రిలీజ్ కు సరిగ్గా రెండు రోజుల ముందు ఈ టీజర్ వదలడం సరైన స్ట్రాటజీ. కోర్టు కేసులు, ఫైనాన్స్ గొడవలతో కొంచెం డల్ అయిన బజ్ ను ఒక్కసారిగా పీక్స్ కు తీసుకెళ్లారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో స్పీడ్ పెరగడానికి ఈ డైలాగ్స్ బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయి. మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన కిక్ దొరికేసింది. ఫైనల్ గా 'అఖండ 2' బాక్సాఫీస్ వేటకు రెడీ అయ్యింది. ఈ టీజర్ తో సినిమాపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఆ విభూతి కొండను ఆపడం ఎవరి వల్లా కాదని మేకర్స్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి డిసెంబర్ 12న బాలయ్య విశ్వరూపం స్క్రీన్ మీద ఏ రేంజ్ లో ఉంటుందో, ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో చూడాలి.