హాయ్ బాబూ! సామ్ ఇలా ఎవ‌రిని పిలుస్తుందో తెలుసా?

కేవలం నటిగానే కాకుండా ఇటీవలి కాలంలో `మా ఇంటి బంగారం` చిత్రంతో నిర్మాతగా కూడా కొత్త అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే;

Update: 2026-03-19 09:34 GMT

సమంత అగ్ర కథానాయికగా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కేవలం నటిగానే కాకుండా ఇటీవలి కాలంలో `మా ఇంటి బంగారం` చిత్రంతో నిర్మాతగా కూడా కొత్త అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రచార కార్యక్రమాల్లో సమంత బిజీగా గడుపుతున్నారు. ఈ ఉగాది సందర్భంగా తన సినిమాకు కావాల్సిన ప్రచారాన్ని యాంకర్ సుమతో కలిసి నిర్వహించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్శకురాలు నందిని రెడ్డి, యాంకర్ సుమ సమక్షంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సమంత తన భర్త రాజ్ తో ఫోన్ లో లైవ్ లో మాట్లాడిన మాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ``హాయ్ బాబూ`` అంటూ సమంత తన భర్తను ఎంతో ప్రేమగా పిలిచారు. ఈ పిలుపు విన్న అభిమానులు మురిసిపోతున్నారు. అంతేకాదు తాను స్వయంగా ఉగాది పచ్చడి తయారు చేశానని సమంత తన భర్తకు ఫోన్ లో వివరించారు.

రాజ్ కూడా సమంతకు.. చిత్ర బృందానికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన స్వచ్ఛమైన తెలుగులో తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు అందించడం విశేషం. రాజ్ తెలుగు భాషపై చూపిస్తున్న పట్టును చూసి యాంకర్ సుమ , నందిని రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. సమంత వ్యక్తిగత జీవితంలోని ఈ మధుర క్షణాలు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తున్నాయి.

ఇక `మా ఇంటి బంగారం` చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `ఓ బేబీ` చిత్రం ఘనవిజయం సాధించడంతో ఈ కాంబినేష‌న్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథాంశం ఒక మధ్యతరగతి కుటుంబంలోని భావోద్వేగాలు, విలువలను ప్రతిబింబించేలా ఉంటుందని తెలుస్తోంది. మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రంగా మలిచారని సమాచారం. నిర్మాతగా సమంతకు ఇది ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు.

మే నెలలో విడుదల కానున్న ఈ సినిమా సమంత కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నటనతో పాటు నిర్మాణ రంగంలో కూడా ఆమె తనదైన ముద్ర వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఉగాది పండుగ పూట భర్తతో ప్రేమగా మాట్లాడిన ఈ వీడియో సినిమా ప్రచారానికి బాగా ప్లస్ అయింది. ఈ ఉగాది సమంతకు, త‌న‌ చిత్ర బృందానికి గొప్ప విజయాలను అందించాలని ఆశిద్దాం. ఆస‌క్తిక‌రంగా ప‌రిశ్ర‌మ‌లో స‌మంత‌కు ఉన్న స‌త్సంబంధాలు, మంచి క‌మ్యూనికేష‌న్ ఇప్పుడు త‌న‌ను తాను రీఎన‌ర్జీతో రెజ‌న‌వేష‌న్‌తో గొప్ప‌గా మ‌లుచుకోవ‌డానికి సహ‌క‌రిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.



Tags:    

Similar News