'సాహో' బ్యూటీ పెళ్లి తేదీ ఫిక్సయిందా?
డార్లింగ్ ప్రభాస్ సరసన `సాహో` చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.;
డార్లింగ్ ప్రభాస్ సరసన `సాహో` చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. `సాహో` సినిమా చిత్రీకరణ సమయంలో ప్రభాస్ -శ్రద్ధా కపూర్ ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని తర్వాత స్పష్టమైంది. ప్రస్తుతం శ్రద్ధా తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేయబోతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
గత కొన్నేళ్లుగా శ్రద్ధా కపూర్ రచయిత రాహుల్ మోదీతో సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి పలుమార్లు జంటగా షికారు చేస్తూ మీడియా కంట పడ్డారు. దీంతో వీరు డేటింగ్ లో ఉన్నారనే విషయం బహిరంగ రహస్యంగా మారింది. ఇప్పుడు ఈ జంట తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వీరిద్దరి వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ లో అంగరంగ వైభవంగా జరగనుందని వార్తలు వస్తున్నాయి.
శ్రద్ధా కపూర్ పెళ్లి ప్రచారంపై తాజాగా ఆమె ఆంటీ తేజస్విని కొల్హాపురి స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో శ్రద్ధా వివాహం గురించి అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. నిజంగానే ఆ విషయం నాకు తెలియదు నాకు దీని గురించి ఎటువంటి సమాచారం లేదని తేజస్విని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఇటువంటి సమాధానం రావడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది. అయితే సెలబ్రిటీల పెళ్లి వార్తలపై కుటుంబ సభ్యులు మొదట ఇలాగే స్పందిస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
కేవలం ఆంటీ మాత్రమే కాదు.. గతంలో శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్ కపూర్ కూడా ఈ పెళ్లి వార్తలపై విభిన్నంగా స్పందించారు. శ్రద్ధా ఉదయ్ పూర్ లో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలను విని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సరదాగా కొట్టిపారేశారు. కుటుంబ సభ్యులు అధికారికంగా ఏమీ చెప్పకపోయినా కానీ.. రాహుల్ మోదీ- శ్రద్ధా కపూర్ ల మధ్య ఉన్న బంధం మాత్రం రోజురోజుకు బలపడుతోందని వారి సన్నిహితులు చెబుతున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఇందుకు నిదర్శనం.
మొత్తానికి `సాహో` సుందరి పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. శ్రద్ధా తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నట్టే వ్యక్తిగత జీవితంలో కూడా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ వివాహం జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై శ్రద్ధా కపూర్ స్వయంగా క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే. సినిమాల పరంగా చూస్తే శ్రద్ధా ప్రస్తుతం మడాక్ ఫిలింస్ లో లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న బయోపిక్ చిత్రం `ఈత`లో నటిస్తోంది.