ప్రాంతీయ ముద్రలపై నరేష్ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్.. సోషల్ మీడియాలో వైరల్!
ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన ప్రాంతీయ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నరేష్ చాలా స్పష్టంగా, ఘాటుగా స్పందించారు.
ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన ప్రాంతీయ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నరేష్ చాలా స్పష్టంగా, ఘాటుగా స్పందించారు. 'తెలంగాణ అంటే తాగుడు, ఆంధ్రా అంటే భోజనం' అనే వివక్షతో కూడిన ముద్రలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతి ప్రాంత సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుందని ఆయన గుర్తుచేశారు. మనం మాట్లాడేది తెలుగు భాషేనని, తీసేది కూడా తెలుగు సినిమాలేనని చెబుతూ సోషల్ మీడియాలో జరిగే అనవసర ప్రచారాలను పట్టించుకోవద్దని కోరారు.ఆ వివరాలు ఇలా వున్నాయి ..
సోషల్ మీడియా ప్రచారాలను పట్టించుకోవద్దు:
ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో ప్రాంతాల మధ్య తేడాలు చూపుతూ కొందరు చేసే పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన నరేష్, ఎవరో ఒకరిద్దరు యూట్యూబ్ లోనో లేదా ఎక్స్ (ట్విట్టర్) లోనో పెట్టే వ్యాఖ్యలను అస్సలు సీరియస్ గా తీసుకోకూడదని చెప్పారు. ఇక సమాజంలో మనుషుల మధ్య దూరం పెంచేలా ఉండే ఎలాంటి అనవసర ప్రచారాలనైనా లైట్ తీసుకోవడమే మంచిదని సూచించారు.
ప్రతి సంస్కృతికి ఒక విలువ ఉంటుంది:
తెలుగువారందరం ఒక్కటేనని నరేష్ స్పష్టం చేశారు. "మనం మాట్లాడే మాండలికాలు ఎక్కడైనా వేరువేరుగా ఉండవచ్చు, కానీ మనం మాట్లాడేది తెలుగు భాష. మనం అందరం కలిసి తీసేది తెలుగు సినిమా" అని ఆయన అన్నారు. ఇక తెలంగాణ, ఆంధ్ర అనే తేడా లేకుండా అందరి కల్చర్ ఒకటే లాగా గౌరవించాలి అని చెప్పారు ..
తెలంగాణ కల్చర్‌లో ఆయన అనుభవం:
ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించి తనకు ఎదురైన ఒక ప్రత్యేకమైన పాత అనుభవాన్ని నరేష్ గుర్తు చేసుకున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చ కొత్తలో, ఒక ఊరిలో తెలిసిన వారి ఇంట్లో మరణం సంభవిస్తే ఆయన పరామర్శించడానికి వెళ్లారట. అక్కడ మూడో రోజు కార్యం జరుగుతుండగా, ఇంట్లో ఏడుపులు వినిపిస్తున్న సమయంలోనే కొంతమంది మద్యం సేవించడం చూసి మొదట ఆయన చాలా ఆశ్చర్యపోయారట.
డ్రింక్ వెనుక ఉన్న అసలు భావం:
ఆ సమయంలో అక్కడ ఉన్నవారు గౌరవంతో నరేష్‌ను కూడా పానీయం తీసుకోమని కోరారట. తీవ్ర దుఃఖంలో ఉన్న వాతావరణంలో ఇది ఏంటని ఆయన అనుకున్నారట. అయితే ఆ ఇంటి కొడుకుని అడిగి అసలు విషయం తెలుసుకున్నాక నరేష్ మైండ్ బ్లాక్ అయిందట. ఇక బతికి ఉన్నప్పుడు మనుషుల మధ్య కోపాలు, శత్రుత్వాలు, బాధలు ఉంటాయని.. ఆ మూడో రోజు అందరూ కూర్చుని తాగడం అనేది ఒక 'రివ్యూ మీటింగ్' లాంటిదని ఆ వ్యక్తి వివరించారట.
మనస్ఫూర్తిగా వీడ్కోలు చెప్పే పద్ధతి:
ఆ మూడో రోజు కూర్చుని పాత విషయాలన్నీ మర్చిపోయి, చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటారని తెలుసుకుని నరేష్ ఆశ్చర్యపోయారు. ఇక పగలు ఉన్నవారు కూడా ఆ రోజు బాధపడి గతాన్ని మర్చిపోతారని, మంచి స్నేహితులు అతడిని మిస్ అవుతున్నామని ఏడుస్తారని తెలిసింది. తెలంగాణ ఆచారంలో ఉన్న ఈ గొప్ప ఆలోచనను ఆయన మనసారా మెచ్చుకున్నారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన కల్చర్, సంప్రదాయం ఉంటాయని నరేష్ వివరించారు. సరైన అవగాహన లేకుండా ఏ సంస్కృతినీ తక్కువ చేసి చూడకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే పోస్టులను పక్కన పెట్టి, తెలుగువారందరూ కలిసికట్టుగా ఉండాలనే సందేశాన్ని నరేష్ ఈ సందర్భంగా ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.