అనుష్క హీరోయిన్ కాదు..విలన్ గానా?
అనుష్క ఇంత వరకూ నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలు పోషించలేదు. సున్నితమైన పాత్రలతోనే ప్రేక్షకుల్ని మెప్పించింది.;
తెలుగు చిత్ర పరిశ్రమలో జేజమ్మగా, అరుంధతిగా తనకంటూ ఓ ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. హీరోయిన్ గా ఎంత ఫేమస్ అయిందో? అంతకు మించి లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ అంతే ఫేమస్ అయింది. సాధారణంగా ఆమె నుండి ప్రేక్షకులు ఆశించేది ధీరవనిత పాత్ర? లేదా ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ పాత్ర మాత్రమే. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమ్మడు కెరీర్‌లోనే అత్యంత సాహసో పేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో జయసూర్య హీరోగా రూపొందుతున్న భారీ పీరియాడిక్ ఫిల్మ్ `కథనార్: ది వైల్డ్ సోర్సెరర్` లో అనుష్క నటిస్తోన్న సంగతి తెలిసిందే.
అనుష్క నటిస్తోంది అంటే కచ్చితంగా హీరోయిన్ పాత్ర అనే అనుకున్నారంతా. మీడియాలో సైతం ఇప్పటి వరకూ అలాగే ప్రొజెక్ట్ అయింది. కానీ అసలు సంగతేంటంటే? ఆమె హీరోయిన్‌గా కాదు. ఓ పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించబోతుంది అన్నది తాజా అప్ డేట్. సినిమాలో అనుష్క పోషించబోయే పాత్ర పేరు నీల గా తెలిసింది. దీంతో నీల పాత్రపై ఆసక్తి మొదలైంది. ఆ పాత్ర ఎలా ఉంటుంది? అన్న దానిపై అప్పుడే డిస్కషన్స్ షురూ అయ్యాయి. ఒక మాంత్రికుడి కథాంశంతో సాగే ఈ చిత్రంలో కథానాయకుడికి సవాల్ విసిరే శక్తివంతమైన విలన్ పాత్రలో అనుష్కను కనిపిం చనుందని కథనాలొస్తున్నాయి.
అనుష్క ఇంత వరకూ నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలు పోషించలేదు. సున్నితమైన పాత్రలతోనే ప్రేక్షకుల్ని మెప్పించింది. కానీ అరుంధతితో అనుష్క అసాధరణ నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకులంతా జేజేలు కొట్టారు అన్నది అంతే వాస్తవం. ఆ తర్వాత ఆ తరహా రోల్ మరే చిత్రంలో పడలేదు. తెలివిగా అదే కోణాన్ని మాలీవుడ్ డైరెక్టర్ ఎన్ క్యాష్ చేసే ప్రయత్నం ప్రశంసనీయం. ఆ పాత్రలో ఆమె కళ్లు, గంభీరమైన రూపం , డైలాగ్ డెలివరీ విలన్ పాత్రకు అదనపు బలాన్ని ఇస్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. `కథనార్ `చిత్రం కేవలం మలయాళంలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.
హీరోయిన్ డామినేట్ చేస్తుందని హీరోలు భయపడే ఈ రోజుల్లో అనుష్క మాత్రం తన స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి కథ కోసం విలన్‌గా మారడం ఆమె వృత్తి నిబద్ధతకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఒక హీరోయిన్ గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విలన్‌గా మారి తనలోని మరో కోణాన్ని ఆవిష్క రించుకోవడం ఆమె కెరీర్‌కు కొత్త మలుపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. `బాహుబలి` తర్వాత అనుష్క నుంచి రిలీజ్ అవుతోన్న ఒక భారీ స్థాయి చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.