రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..
| కిరణ్ అబ్బవరం హీరోగా తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ‘రియాలిటీ’ నుంచి ‘రుత్తు’ రొమాంటిక్ మెలోడీ విడుదలైంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించగా, పూర్ణాచారి సాహిత్యం అందించారు. దేవిక భట్‌తో కిరణ్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ రియాలిటీ. మధ్యతరగతి జీవితం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే డీసెంట్ బజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన భజ గోవిందం పాట జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను చూపించగా, లేటెస్ట్ గా రుత్తు అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సరిగమ తెలుగు ద్వారా వచ్చిన ఈ రెండో పాట ప్రేమకథలోని ఫీల్ ను హైలెట్ చేస్తోంది.
పాత్రల పేరుతో పూర్ణాచారి రాసిన పాటలోని లైన్స్ అసలైన హైలెట్. చిన్ని చిన్ని కళ్లల్లోన ఆనందమే చూస్తున్నా, పదే పదే ఆలోచన అంటూ మొదలయ్యే పల్లవి వినగానే హాయిగా అనిపిస్తోంది. ప్రేమలో పడిన తర్వాత అద్దంలో చూసుకుంటూ మురిసిపోవడం, నిదురకు సెలవే అంటూ సాగే పదాలు నేటి యువతకు త్వరగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
నార్మల్ గా మాస్ బీట్స్ తో ఊపేసే సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ఈసారి చాలా ప్లెజెంట్ మెలోడీ ట్యూన్ అందించారు. సింగర్ కపిల్ కపిలన్ తన గాత్రంతో పాటకు మంచి ఫీల్ తీసుకొచ్చారు. రుత్తు అంటూ సాగే హుక్ లైన్ ఆకట్టుకునేలా కుదిరింది. లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ కథలోని సహజత్వాన్ని హైలెట్ చేస్తున్నాయి. గ్రామంలో ఆనందం వెజిటేరియన్ టిఫిన్ హోటల్ నడిపే సాధారణ కుర్రాడిగా లుంగీ కట్టులో కిరణ్ కనిపించగా, కాలేజీ అమ్మాయిగా దేవిక భట్ ఒద్దికగా ఒదిగిపోయారు.
ఫోన్ సంభాషణలు, బీచ్ ఒడ్డున పానీపూరీ తింటూ సాగే సరదా సన్నివేశాలు, రైలు పట్టాల పక్కన వేసిన స్టెప్పులు బాగున్నాయి. షరీఫ్ కొరియోగ్రఫీలో వీరిద్దరి కెమిస్ట్రీ నేచురల్ గా కుదిరింది.
జాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ యర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సీనియర్ నటులు శరత్ కుమార్, సాయికుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మతో పాటు సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ విజువల్స్ కు మంచి కలర్ ఫుల్ లుక్ తీసుకురాగా, సంతోష్ నాయుడు ఎడిటింగ్, సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైన్ కథకు తగినట్లుగా ఉన్నాయి. రొటీన్ కమర్షియల్ హంగులకు దూరంగా, ఒక స్వచ్ఛమైన ప్రేమకథను దర్శకుడిగా కిరణ్ అబ్బవరం తెరపైకి తెస్తున్నట్లు ఈ పాట చూస్తే అర్థమవుతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రియాలిటీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.