తరుణ్ కోసం ముందే కర్చీప్ వేసిన ఈషా!
తెలుగమ్మాయి ఈషారెబ్బా గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ హీరోయిన్ గా ప్రారంభమైంది.;
తెలుగమ్మాయి ఈషారెబ్బా గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ హీరోయిన్ గా ప్రారంభమైంది. కానీ ఆ దిశగా బిజీ కాలేకపోయింది. దీంతో స్టార్ హీరోల చిత్రాల్లో సహాయక పాత్రల్లోనూ ప్రవేశించింది.
ప్రస్తుతం అమ్మడి జర్నీ రెండు రకాలుగా కొనసాగుతుంది. హీరోయిన్ ఛాన్స్ అయినా? హీరోయిన్ ప్రెండ్ రోల్ అయినా ఒకే అంటూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది. అలా ఇండస్ట్రీలో ఖాళీ లేకుండా పని చేస్తోంది. నటిగా తాను పెట్టాల్సిన ఎఫెర్ట్ అంతా పెడుతుంది.
హీరోయిన్ గానే కాదు..దర్శకత్వంలోనూ:
అయితే హీరోయిన్ గా వెండి తెరపై కనిపించి రెండేళ్లు దాటిపోయింది. చివరగా సుధీర్ బాబు హీరోగా నటించిన 'మామమశ్చింద్ర'లో నటించింది. ఆ తర్వత మళ్లీ ఇంత కాలానికి 'ఓం శాంతి శాంతి శాంతి హీ' అనే చిత్రంలో తరుణ్ బాస్కర్ కు జోడీగా నటిస్తోంది. ఇది పరభాషా రీమేక్ చిత్రం. ఇదే అదునుగా అమ్మడు తరుణ్ దర్శకత్వంలో నటించాలంటూ ముందుగానే కర్చీప్ వేసేసింది. తన పక్కనే హీరోయిన్ గానే కాదు...దర్శకత్వంలో అవకాశం ఇచ్చి కూడా ప్రోత్సహించాలంటూ ఓపెన్ అయింది. మరి అవకాశం అడిగిన నటి కోసం తరుణ్ ఛాన్స్ ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి.
రెండేళ్లగా నటుడిగానే:
అదే వేదికపై తరుణ్ ఛాన్స్ ఇస్తాననిగానీ, ఇవ్వననిగానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కూడా దర్శకత్వం పక్కన బెట్టి నటుడిగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా చివరిగా 'కీడా కోలా' తెరకెక్కించాడు. ఇది రెండేళ్ల క్రితం రిలీజ్ అయింది. ఆ తర్వాత నటుడిగా బిజీ అయ్యాడు. ఈ రెండేళ్ల కాలంలోనే ఐదారు సినిమాలు చేసాడు. అలాగని డైరెక్టర్ గా అవకాశాలు లేక నటుడిగా టర్న్ తీసుకోలేదు. `పెళ్లి చూపులు` విజయంతో డైరెక్టర్ గా ఎలాంటి గుర్తింపు దక్కిందో తెలిసిందే. అటుపై `ఈ నగరానికి ఏమైంది`అంటూ మరో విజయం అందుకున్నాడు.
ఈషాకి ఆ విషయం లీకైందా:
కానీ డైరెక్టర్ గా కంటే నటుడిగా ఎక్కువ సంపాదిస్తున్నాడు. డైరెక్టర్ గా ఏడాది మహా అయితే రెండు సినిమాలు చేయగలడు. కానీ నటుడిగా ఒకే ఏడాది ఎన్ని సినిమాలైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఫేం ఉండగానే దున్నుకోవాలి అన్న చందంగా తరుణ్ నట ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అలాగే డైరెక్టర్ గా కొన్ని కథలు కూడా సిద్దం చేసి పెట్టుకున్నాడు. యువ హీరోలు పని చేయడానికి సిద్దంగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆ సినిమాల గురించి ఆలోచించే అవకాశం ఉంది. అందుకేనేమో ఈషా రెబ్బా తెలివిగా ముందే ఛాన్స్ అడిగేసింది.