త్రివిక్రమ్ తో ఏం జరిగింది? ఉస్తాద్ అందుకే లేటా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వల్ల ఉస్తాద్ లేట్ అయిందన్న రూమర్లపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, గతంలో వచ్చిన వివాదాలపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వల్ల ఉస్తాద్ లేట్ అయిందన్న రూమర్లపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రీ ఎంట్రీలో ఆయన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలన్నీ రీమేక్ కావడంతో, అప్పట్లో చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ (ఉస్తాద్ భగత్ సింగ్) ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో, పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి.
ముఖ్యంగా హరీష్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య విభేదాలు ఉన్నాయని, ఆ కారణంగా పవన్ రీమేక్ సినిమాల వైపు మళ్లారని వార్తలు వినిపించాయి. అయితే ఆ ఆరోపణలను హరీష్ శంకర్ పూర్తిగా ఖండించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఇలాంటి ప్రచారాలు నేను కొట్టివేసినా చాలామంది నమ్మరు. ఇండస్ట్రీలో ఎన్నో వార్తలు వస్తుంటాయి. ఒకవేళ త్రివిక్రమ్ గారితో నాకు నిజంగా విభేదాలు ఉంటే, నేను ఇంటర్వ్యూలలో ఆయన గురించి ఎందుకు మాట్లాడుతాను?" అని ప్రశ్నించారు.
ఇంకా త్రివిక్రమ్ తో తన రిలేషన్ ను వివరించిన హరీష్ శంకర్, గబ్బర్ సింగ్ విడుదల సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేశారు. "సంధ్య థియేటర్ లో గబ్బర్ సింగ్ మార్నింగ్ షో చూసిన తర్వాత త్రివిక్రమ్ గారు నన్ను ప్రశంసించారు. 'హరీష్ బాగా రాశాడు, బాగా తీశాడు. అభిమానులు పవన్ ను ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించాడు' అని చెప్పారు. ఆ మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను" అని తెలిపారు.
త్రివిక్రమ్ ను తాను అగ్రజ అని పిలుస్తున్నట్లు చెప్పిన హరీష్ శంకర్, "నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వకముందే ఆయన ఐదు నంది అవార్డులు అందుకున్నారు. ఆయనతో ఎలాంటి విభేదాలు ఉండే ప్రశ్నే లేదు. ఆయన డైలాగ్స్, రైటింగ్, టేకింగ్ అన్నీ నాకు ఇష్టం" అని అన్నారు. ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసిన తర్వాత కూడా త్రివిక్రమ్ తనకు మెసేజ్ చేసి అభినందించారని వెల్లడించారు.
"మేమిద్దరం మాట్లాడితే ఎక్కువ సమయం నవ్వుకుంటూ గడుస్తుంది. నేను ఒకటి అంటే ఆయన మరో కౌంటర్ ఇస్తారు. మా మాటలను విని పవన్ గారు కూడా ఆసక్తిగా వింటూ నవ్వుతుంటారు" అని చెప్పారు. ఏదేమైనా హరీష్ శంకర్, త్రివిక్రమ్ మధ్య విభేదాలు అంటూ వచ్చిన రూమర్లకు ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందు హరీష్ క్లారిటీ ఇవ్వడం ద్వారా అభిమానుల్లో ఉన్న సందేహాలను కూడా ఆయన తొలగించినట్లే.