బీసీసీఐకి కొత్త చీఫ్ వస్తారా....?

Update: 2015-07-17 11:04 GMT
    బీసీసీఐ చీఫ్‌ జగ్మోహన్‌ దాల్మియా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ పాలనా వ్యవహారాలు పర్యవేక్షించడం ఆయనకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని... ఆయన స్థానంలో కొత్త చీఫ్ వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

    దాల్మియా అనారోగ్యం కారణంగా బీసీసీఐ బాధ్యతలు చూడలేకపోతున్నారన్న కారణంతో ఆయన్ను పదవి నుంచి తప్పుకోవాలని బోర్డు సభ్యులు త్వరలోనే కోరుతారని తెలుస్తోంది. సెప్టెంబరులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం తర్వాత బీసీసీఐకి కొత్త చీఫ్‌ రానున్నారన్న వదంతులు జోరుగా సాగుతున్నాయి.

    అయితే... దాల్మియా ఆరోగ్య సమస్య ఏమిటి... అది తాత్కాలికమా.... లేదంటే తీవ్రమా అన్నది ఎక్కడా బయటకు పొక్కడం లేదు. ఆయన్ను రాజీనామా చేయించి కొత్త చీఫ్ ను ఎన్నుకునే దిశగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇటీవలే ఐపీఎల్ వ్యవహారంలో రెండు ఫ్రాంచైజీలను రద్దు చేయడానికి జస్టిస్ లోధా కమిటీ సిఫారసు చేసింది... దానిని అమలు చేయాలంటే ఐపీఎల్ జట్లతో చేసుకున్న ఒప్పందాలు ఎంతవరకు పర్మిట్ చేస్తాయో పరిశీలించాలి. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. ఈ తరుణంలో బీసీసీఐ చీఫ్ అనారోగ్యం... ఆయన పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ వంటి వదంతులు వస్తుండడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతోంది.
Tags:    

Similar News