బిగ్ బాష్ లీగ్.. పాకిస్థాన్ జాతీయ క్రికెటర్ల పరువు పోయిందిగా?
పాక్ జాతీయ క్రికెటర్లు పేసర్ షాహీన్ షా ఆఫ్రిది (బీహెచ్), వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ (ఎంఆర్), మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ (సిడ్నీ సిక్సర్స్) బీబీ లీగ్ లో పాల్గొంటున్నారు.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాత ప్రపంచ క్రికెట్ లో అదే స్థాయిలో స్టాండర్డ్స్, ప్రేక్షకుల ఆదరణ ఉన్న లీగ్ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్). పెద్దవైన ఆస్ట్రేలియా స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్ లు చూడడం అంటే అదో మజా. జనాభా తక్కువగా ఉన్నా.. స్టేడియాలు నిండడం ఇక్కడి ప్రత్యేకత. క్రిస్మస్ ప్లస్ కొత్త సంవత్సరం సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం బీబీఎల్ సీజన్ నడుస్తోంది. ఇందులో పలువురు పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బ్రిస్బేన్ హీట్స్ (బీహెచ్), మెల్బోర్న్ రెనెగేడ్స్ (ఎంఆర్), సిడ్నీ సిక్సర్స్ (ఎస్ ఎస్) ఇలా వేర్వేరు జట్ల తరఫున ఆడుతున్నారు. అయితే, పాకిస్థాన్ క్రికెట్లో ప్రమాణాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిభకు లోటు లేకున్నా.. వారి దేశంలో క్రికెట్ లో పైరవీలు అధికం. స్టార్ క్రికెటర్లను కూడా అవమానించేలా నిర్ణయాలు తీసుకుంటుంది పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ). తరచూ కెప్టెన్లను మార్చడం.. ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడం వంటి పనులు చేస్తుంది. ఇదంతా వదిలేస్తే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) తర్వాత ఆ దేశ ఆటగాళ్లు ఎక్కువగా ఆడేది బీబీఎల్ లోనే. పాక్ జాతీయ క్రికెటర్లు పేసర్ షాహీన్ షా ఆఫ్రిది (బీహెచ్), వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ (ఎంఆర్), మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ (సిడ్నీ సిక్సర్స్) బీబీ లీగ్ లో పాల్గొంటున్నారు.
ఇదేం ఆట..?
బీబీఎల్ లో పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఎడమ చేతివాటం పేసర్ షాహీన్ షా ఆఫ్రిదిని తొలుత హై ఫుల్ టాస్ లు వేస్తున్నాడంటూ ఓవర్ పూర్తి చేయనీయలేదు. పాక్ క్రికెట్ లోనే కాదు.. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పేసర్లలో ఉత్తమ బౌలర్ ఆఫ్రిది. అయితే, అతడి ఎత్తు కారణంగా బౌలింగ్ కొన్నిసార్లు గాడి తప్పుతుంది. ప్రతిభ పరంగా ఏమాత్రం తక్కువ కానివాడు. ప్రపంచ కప్ ల వంటి టోర్నీల్లోనే పాక్ జట్టుకు కెప్టెన్సీ చేసినవాడు. మూడు ఫార్మాట్లలోనూ పాక్ జట్టులో సభ్యుడైన ఆఫ్రిదిని... బౌలింగ్ నుంచి తప్పించడం అంటే అది అవమానకరమే.
స్లోగా ఆడుతున్నాడని రిటైర్డ్ ఔట్..
టి20లు అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేయగలిగితే లీగ్ లలో అంత డిమాండ్. కానీ, పాక్ మాజీ కెప్టెన్ అయిన రిజ్వాన్ కు చేదు అనుభవం ఎదురైంది. నాణ్యమైన బ్యాటర్ అయిన రిజ్వాన్.. టి20ల్లోనూ సత్తా చాటాడు. అయితే, రెండు రోజుల కిందటి మ్యాచ్ లో వేగంగా ఆడనందుకు ఇన్నింగ్స్ మధ్యలోనే అతడిని రిటైర్డ్ ఔట్ గా ప్రకటించారు. దీంతో రిజ్వాన్ బ్యాటింగ్ ఆపేసి బయటకు వచ్చేశాడు.
బాబర్ కూ తప్పని పరాభవం..
తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో కలిసి ఆడాడు బాబర్. ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయాలని ప్రయత్నించగా స్మిత్ రాలేదు. ఆ తర్వాతి ఓవర్లో అతడు వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. మరుసటి ఓవర్లో బాబర్ మాత్రం ఔటయ్యాడు. దీంతో అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పెవిలియన్ కు చేరుతుండగా బౌండరీ రోప్ ను బ్యాట్ తో కొట్టాడు. ఇలా బిగ్ బాష్ లీగ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.