టీమ్ ఇండియాతో చేరిన రింకూ.. జ‌ట్టులో అత‌డి అవ‌స‌రం ఎంత‌?

రింకూ సింగ్ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండ‌క‌పోయినా.. మైదానంలో అత‌డి ప్ర‌జెన్స్ మాత్రం కాద‌న‌లేం. ఎందుకంటే, ఫీల్డింగ్ లో చురుగ్గా ఉంటూ గ్రౌండ్ అంతా క‌వ‌ర్ చేస్తాడు రింకూ.;

Update: 2026-02-28 10:38 GMT

పాకెట్ డైన‌మైట్... మైదానంలో ఈ చివ‌రి నుంచి ఆ చివ‌ర‌కు చిరుత‌లా ప‌రిగెత్తే స‌త్తా... ఫీల్డింగ్ లో అద‌న‌పు బ‌లం.. ఇక బ్యాటింగ్ లో అయితే చివ‌ర్లో మెరుపుల‌తో ముగింపు ఇవ్వ‌గ‌ల స‌త్తా..! ఇదంతా రింకూ సింగ్ గురించి. తండ్రిని కోల్పోయిన బాధ‌లో ఉన్న అత‌డు.. ఒక్క రోజు విరామంతో తిరిగి టీమ్ఇండియాతో చేరాడు. ఆదివారం వెస్టిండీస్ తో జ‌రిగే క్వార్ట‌ర్స్ కాని క్వార్ట‌ర్ ఫైన‌ల్ కు అందుబాటులో ఉండ‌నున్నాడు. ఈ సూప‌ర్ 8 మ్యాచ్ లో టీమ్ ఇండియా గెలిస్తే నేరుగా టి20 ప్ర‌పంచ క‌ప్ సెమీస్ చేరుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ‌రొక ఆట‌గాడిని రింకూ స్థానంలో జ‌ట్టులోకి తీసుకోలేరు. అత‌డు కూడా జ‌ట్టుతో ఉండేందుకే మొగ్గుచూపాడు. ఈ నేప‌థ్యంలో టీమ్ఇండియాకు కాస్త ఉప‌శ‌మ‌నం ద‌క్కింది.

వారంలో ఎంత మార్పు?

గ‌త వారం రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ అస్వ‌స్థ‌త‌తో ఆస్ప‌త్రి పాల‌య్యాడు. దీంతో రింకూ అర్జంటుగా టీమ్ ఇండియాను వీడాడు. తండ్రిని ప‌రామ‌ర్శించి వెంట‌నే వెన‌క్కు వ‌చ్చేశాడు. గురువారం నాటి జింబాబ్వేతో మ్యాచ్ కు మాత్రం తుది జ‌ట్టులో లేడు. అత‌డి స్థానంలో వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ సంజూ శాంస‌న్ ను ఆడించారు. వెస్టిండీస్ తో మ్యాచ్ కు కూడా ఇప్పుడు ఇదే విధానం పాటించే వీలుంది. అయితే, వారం రోజులలోనే రింకూ జీవితంలో కీల‌క మార్పులు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

అత‌డుంటే ఫీల్డింగ్ కు భరోసా

రింకూ సింగ్ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండ‌క‌పోయినా.. మైదానంలో అత‌డి ప్ర‌జెన్స్ మాత్రం కాద‌న‌లేం. ఎందుకంటే, ఫీల్డింగ్ లో చురుగ్గా ఉంటూ గ్రౌండ్ అంతా క‌వ‌ర్ చేస్తాడు రింకూ. అందుకే, అత‌డిని 12వ నంబ‌రు ఆట‌గాడి అయినా ఉంచుతున్నారు. వెస్టిండీస్ తో మ్యాచ్ లో తుది జ‌ట్టులో ఆడించ‌క‌పోయినా.. స‌బ్ స్టిట్యూట్ గా ఫీల్డింగ్ కు వ‌చ్చే చాన్సుంది. జింబాబ్వేతో మ్యాచ్ లోనూ ఇదే ప‌ద్ధ‌తి పాటించారు.

ఈడెన్ లో ప‌రుగు అత‌డికి కొట్టిన పిండి

రింకూ టీమ్ఇండియాతో చేర‌డం వెనుక మ‌రో కార‌ణం ఉంది. అత‌డు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. ఆ జ‌ట్టు సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్. ఆదివారం భార‌త్-వెస్టిండీస్ మ్యాచ్ జ‌రిగేది కూడా ఇక్క‌డే. ఐపీఎల్ లో కోల్ క‌తా త‌ర‌ఫున రింకూ ఈడెన్ గార్డెన్స్ లో మెరుపులు మెరిపించాడు. అందుకే, అత‌డి అవ‌స‌రం జ‌ట్టుకే ఎక్క‌వ‌గా ఉంది. పైగా, స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, పేస‌ర్ అర్ష‌దీప్ వంటి వారు ఫీల్డింగ్ లో వీక్. వీరి స్థానంలో స‌బ్ స్టిట్యూట్ గా రింకూ ఫీల్డింగ్ కు దింపొచ్చు. బ్యాట‌ర్ గా ఈ ప్ర‌పంచ క‌ప్ లో రింకూ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. వెస్టిండీస్ తో మ్యాచ్ లో తుది జ‌ట్టుతో ఉంటే మాత్రం అత‌డికి ఈ బాధాక‌ర ప‌రిస్థితుల్లో చాలా మేలు చేస్తుంది.

Tags:    

Similar News