జట్టు ఏదైనా అతడు బుమ్రాస్త్రం.. ఫైనల్లోనూ చెలరేగితే చాలు
బుమ్రా స్థాయి అందరికీ తెలిసినా.. డెత్ (చివరి) ఓవర్లలో బౌలింగ్ అంటే మొన్నటివరకు అర్షదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పేవారు.;
స్వింగ్ తో దెబ్బకొట్టే ఎడమచేతివాటం పేసర్ అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 51 పరుగులు.., మిస్టరీ బంతులతో ప్రత్యర్థిని బోల్తా కొట్టిస్తాడని భావించిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 64 పరుగులు..! ఈ ఇద్దరూ కలిపి ఇచ్చింది 115 పరుగులు. టి20 క్రికెట్ లో ఒక జట్టు ఓడిపోవడానికి ఇంతకంటే ఏం కావాలి..? గురువారం నాటి టి20 ప్రపంచ కప్ ఇంగ్లండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో ఇదే జరిగింది..! కానీ, టీమ్ ఇండియా అత్యంత ఉత్కంఠభరిత మ్యాచ్ ను గెలిచింది. దీనికి కారణం.. ఒకే ఒక్కడు జస్ప్రీత్ బుమ్రా. ఈ మేటి పేసర్ లేకుంటే సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయేది అనడంలో సందేహం లేదు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంజూ శాంసనే కాదు.. మ్యాచ్ ను లైవ్ చూసిన అభిమానులు అందరూ కూడా ఇదే మాట అంటున్నారు..! అంతగా తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు బుమ్రా. అసలు తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రాకు దక్కాల్సింది అని సంజూ అన్నాడంటేనే అతడి విశిష్టత ఏమిటో తెలుస్తోంది.
ప్రత్యర్థి పాలిట డెత్ బౌలర్...
బుమ్రా స్థాయి అందరికీ తెలిసినా.. డెత్ (చివరి) ఓవర్లలో బౌలింగ్ అంటే మొన్నటివరకు అర్షదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పేవారు. ఈ ప్రపంచ కప్ లో మాత్రం బుమ్రా తన ప్రతిభను మరింతగా చాటుతున్నాడు. సెమీస్ థ్రిల్లర్ లో అసలైన విన్నర్ అతడే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. 4 ఓవర్లు 33 పరుగులు... పేపర్ పై గణాంకాల ప్రకారం కాస్త పరుగులు ఎక్కువగానే ఇచ్చినట్లు కనిపించినా, మ్యాచ్ లోని మిగతా 36 ఓవర్లలో ఓవర్ కు 13 రన్స్ వచ్చిన సంగతి గుర్తుంచుకోవాలి.
ఆ బంతులు బుల్లెట్లు..
ముందుకొచ్చి ఆడబోయినందుకు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ను ఔట్ చేసిన ఆఫ్ కట్టర్ అయితే మేటి బంతి అనే చెప్పాలి. మిగతా బ్యాటర్లకు వేసిన టాయ్ క్రష్ (యార్కర్లు)లు, అప్పుడప్పుడూ బౌన్సర్లు.. ఇదీ బుమ్రా బౌలింగ్ సాగిన తీరు. అందుకే అవి బంతులు కావు బుల్లెట్లు. 499 పరుగులు పోటెత్తిన ముంబై వాంఖడే మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య తేడా బుమ్రానే తప్ప ఏ ఇతర బ్యాట్స్ మెన్ కూడా కాదని చెప్పవచ్చు. ఇంగ్లండ్ ఓడిపోయింది కేవలం ఏడు పరుగుల తేడాతోనే అన్నది గుర్తుంచుకుంటే.. బుమ్రా ప్రభావం ఏమిటో కూడా తెలుస్తుంది.
ఫైనల్లోనూ అతడే..
2024 టి20 ప్రపంచకప్ ఫైనల్లోనూ బుమ్రా తన అద్భుత స్పెల్ తో టీమ్ ఇండియాను పోటీలో నిలిపాడు. మళ్లీ ఈ ప్రపంచ కప్ ఫైనల్లోనూ అతడు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే జరిగితే... డిఫెండింగ్ చాంపియన్ టి20 ప్రపంచ కప్ గెలవదు అన్న మాట ఈసారి నిజం కాకుండా ఉంటుంది.