టి20 ప్రపంచకప్ సెమీస్..టీమ్ఇండియా సరిచేసుకోవాల్సిన తప్పులివి!
టి20 ప్రపంచకప్ లో సెమీస్ అంకానికి రంగం సిద్ధమైంది.. బుధవారం గత టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికాను ప్రమాదకర ప్రత్యర్థి అయిన న్యూజిలాండ్ ఢీకొననుంది.;
టి20 ప్రపంచకప్ లో సెమీస్ అంకానికి రంగం సిద్ధమైంది.. బుధవారం గత టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికాను ప్రమాదకర ప్రత్యర్థి అయిన న్యూజిలాండ్ ఢీకొననుంది. మరోవైపు గురువారం టీమ్ ఇండియా దూకుడుగా ఆడే ఇంగ్లండ్ తో తలపడనుంది. దక్షిణాఫ్రికాతో పోలిస్తే... ఇంగ్లండ్ ను ఎదుర్కొనడమే టీమ్ ఇండియాకు సులువైన పని. కానీ, టి20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అప్రమత్తంగా ఉంటూ ఆడుకుంటూ పోవడమే. ఎదురే లేదు అనుకున్న టీమ్ ఇండియాకు సూపర్ 8లో దాదాపు ఎలిమినేషన్ పరిస్థితి ఎదురైంది. అక్కడ ఒక ఓటమి ఎదరైనా, తిరిగి చూసుకునేందుకు వీలుంది. సెమీఫైనల్లో మాత్రం తప్పు జరిగితే ఇంటికే. ఇక మన జట్టు పరంగా పలు లోపాలు కనిపిస్తున్నాయి.
బౌలింగ్ భారమంతా అతడిపైనేనా?
టీమ్ఇండియా ప్రధాన లోపం బౌలింగ్. మరీ ముఖ్యంగా పేస్ బౌలింగ్. ప్రధాన పేస్ బౌలర్ బుమ్రా మీదనే భారం అంతా పడుతోంది. అతడు ఏమాత్రం ప్రభావం చూపకున్నా పరిస్థితి ఇబ్బందికరం కావడం ఖాయం. మరో ప్రధాన పేసర్ అర్షదీప్ సింగ్ పై తేలిపోతున్నాడు. భారీగా పరుగులు ఇస్తున్నాడు. వికెట్లు తీస్తున్నా.. అప్పటికే ఆలస్యం అయిపోతోంది. ప్రత్యర్థి బ్యాటర్లు అర్షదీప్ ను సులువుగా ఎదుర్కొంటున్నారు. హైదరాబాదీ పేసర్, ఈ కప్ మొదటి మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన సిరాజ్ ను పక్కనపెట్టి మరీ అర్షదీప్ ను ఆడిస్తుంటే అతడు మాత్రం పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఇక స్పిన్ లో మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తిని కూడా బ్యాట్స్ మెన్లు చదివేసినట్లు తెలుస్తోంది. అతడి మిస్టరీని ఛేదించారా? అనిపిస్తోంది. వరుణ్ ప్రభావం చూపలేకపోతుండడమే కాదు.. భారీగా పరుగులు ఇస్తున్నాడు. అతడి కంటే అక్షర్ పటేల్ చక్కగా స్పిన్ చేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు. వరుణ్ వైఫల్యం కారణంగా పార్ట్ టైమ్ స్పిన్నర్లు అభిషేక్, తిలక్ వర్మ, పేసర్ శివమ్ దూబెతో బౌలింగ్ చేయించాల్సి వస్తోంది.
ఫీల్డింగ్ లోపాలు పుట్టెడు.. బ్యాటింగ్ లో ఒక్కరే
టీమ్ఇండియా ఫీల్డింగ్ సొంత దేశంలోనే దారుణంగా ఉందని ఆదివారం నాటి వెస్టిండీస్ మ్యాచ్ నిరూపించింది. మూడు ముఖ్యమైన క్యాచ్ లతో పాటు ఒక రనౌట్ మిస్ చేశారు. వరుణ్, అర్షదీప్ వంటివారు ఫీల్డింగ్ లో చురుగ్గా ఉండరు. కానీ, కుర్రాడు అభిషేక్ కూడా క్యాచ్ లు వదిలేయడం ఆందోళనకరం. ఈ తప్పులను సరిచేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. మరోవైపు బ్యాటింగ్ లో మొదట ఇషాన్ కిషన్, మధ్యలో హార్దిక్ పాండ్యా, ఇప్పుడు సంజూ శాంసన్ మాత్రమే విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. అంతేకానీ, సమష్టి ప్రదర్శన ఉండడం లేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హైదరాబాదీ తిలక్ వర్మ మోస్తరుగా ఆడుతున్నారు. సెమీస్ లో ఇంగ్లండ్ పై మాత్రం అందరూ బ్యాట్ ఝళిపించాల్సిందే.
ఇంగ్లండ్ అంతా ఒక ఎత్తు.. అతడు ఒక ఎత్తు..
ఇంగ్లండ్ టి20ల్లో ప్రమాదకారి అని చెప్పలేం కానీ.. దూకుడుగా ఆడుతూ బెదరగొడుతుంది. అయితే, పైకి ఎంత బలంగా కనిపిస్తోందో.. లోపల ఆ జట్టులోనూ చాలా సమస్యలు ఉన్నాయి. బట్లర్, బెతెల్ ఫామ్ లో లేరు. కానీ, ఇంగ్లండ్ ఏడు మ్యాచ్ లలో నాలుగుసార్లు ఒకే ఒక్క ఆటగాడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అతడే బ్యాటింగ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్. తనది సాధారణ స్పిన్ అయినప్పటికీ, తెలివిగా బంతులేస్తూ వికెట్లు తీస్తున్నాడు. చివరి మ్యాచ్ లో దూకుడైన బ్యాటింగ్ తో న్యూజిలాండ్ పైనా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు జాక్స్ . అందుకని అతడిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.