బంగ్లాలో హిందువుల హత్య.. ఆ దేశ క్రికెటర్లతో నో షేక్ హ్యాండ్!
ఇది ఆ సమయంలో తీవ్ర వివాదాస్పదం అయింది. తర్వాత పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ గానూ ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) చైర్మన్ మొహిసిన్ నఖ్వీ నుంచి టీమ్ఇండియా ఆసియా కప్ టైటిల్ ను అందుకోలేదు.;
క్రికెట్ కు ఉన్న పేరు జెంటిల్ మన్ గేమ్. కానీ, మనం ఒక్కరమే జెంటిల్ గా ఉంటే సరిపోదు కదా..? అవతలి దేశం కూడా అంతే తీరున ఉండాలిగా..! కానీ, గత ఏడాది ఏప్రిల్ లో జరిగిన పెహల్గాం ఉగ్రదాడి ఘటన పాకిస్థాన్ పట్ల భారతీయుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. ఇది క్రికెట్లోనూ ప్రతిధ్వనించింది. పాక్ తో ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకూడదు అని తొలుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భావించింది. కానీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనలకు లోబడి పలు దేశాలు ఆడే టోర్నీల్లో పాల్గొంటోంది. ఇలానే గత ఏడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్ లో పాకిస్థాన్ తో భారత్ ఆడాల్సి వచ్చింది. లీగ్, నాకౌట్, ఫైనల్.. ఇలా మూడుసార్లు తలపడినా ఒక్కసారీ పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు చేతులు కలపలేదు. ఇది ఆ సమయంలో తీవ్ర వివాదాస్పదం అయింది. తర్వాత పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ గానూ ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) చైర్మన్ మొహిసిన్ నఖ్వీ నుంచి టీమ్ఇండియా ఆసియా కప్ టైటిల్ ను అందుకోలేదు.
మహిళల క్రికెట్ లోనూ...
పాకిస్థాన్ గత ఏడాది అక్టోబరు-నవంబరులో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ లో భారత్ తో తలపడింది. అప్పుడు కూడా భారత అమ్మాయిలు పాక్ మహిళా క్రికెటర్లతో కరచాలనం చేయలేదు. అయితే, పాక్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్లకు వీసాలు ఇవ్వలేదు. ఈ మ్యాచ్ ను శ్రీలంకలో నిర్వహించారు. పాక్ జట్టు టోర్నీలో ముందే వెళ్లిపోవడంతో సెమీస్, ఫైనల్స్ లో కరచాలనం పరిస్థితి తలెత్తలేదు.
యువకుల క్రికెట్ లోనూ..
సీనియర్ల ఆసియాకప్ అనంతరం ఇటీవల అండర్ 19 ఆసియా కప్ జరిగింది. అందులోనూ భారత యువకులు పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయలేదు. ఈ టోర్నీలో పాక్ పై లీగ్ దశలో మ్యాచ్ ను అలవోకగా గెలిచిన భారత ఆటగాళ్లు.. ఫైనల్లో మాత్రం నిరాశపరిచారు.
బంగ్లాకూ అనుభవం కావాల్సిందే..
పాకిస్థాన్ లాగానే మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కూడా భారత్ అంటే విద్వేషం కనబరుస్తూ ఉంటుంది. తాజాగా ఆ దేశంలో మైనారిటీలైన హిందువులే లక్ష్యంగా దాడులు, హత్యలు జరుగుతున్నాయి. పదిమంది హిందువులను ఉన్మాదులు పొట్టనపెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తప్పించింది. బీసీసీఐ సూచన మేరకే ఈ పని చేసినా బంగ్లా క్రికెట్ బోర్డుకు మాత్రం తీవ్రంగా అనిపించింది. భారత్ లో జరిగే టి20 ప్రపంచ కప్ వేదికలను మార్చాలని పట్టుబడుతోంది. ఇలాంటి సమయంలో జింబాబ్వే-నమీబియాలో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ మ్యాచ్ లో బంగ్లా వైస్ కెప్టెన్ అబ్రార్ తో భారత యువ జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే కరచాలనం చేయలేదు. బంగ్లాలో హిందువులపై దాడులు, ఆ దేశ ప్రభుత్వ వైఖరి రీత్యానే భారత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఆయుష్ మాత్రే చర్య సరైనదేనా? అతడు బీసీసీఐకి సమాచారం ఇచ్చాడా? ఇది బీసీసీఐ నిర్ణయమా? లేక మాత్రే సొంతంగా తీసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
-వచ్చే నెల నుంచి జరిగే టి20 ప్రపంచ కప్ లో భారత సీనియర్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇలానే బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ కు షేక్ హ్యాండ్ నిరాకరిస్తాడా? అన్నది చూడాలి.