మంజేక్రర్ వెర్బల్ డయేరియా.. గట్టిగా ఇచ్చిపడేసిన కోహ్లి అన్న
తాజాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి గురించి కూడా మంజ్రేకర్ నోరు జారాడు. టి20లు, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చి సులువైన ఫార్మాట్ వన్డేల్లో కొనసాగుతున్నాడని వ్యాఖ్యానించాడు.;
అది 2019 వన్డే ప్రపంచకప్ సమయం.. వేదిక ఇంగ్లండ్.. టీమ్ఇండియా ఆల్ రౌండర్ గా అప్పటికే నిరూపించుకున్నాడు రవీంద్ర జడేజా. కానీ, ఆ మెగా టోర్నీ కామెంటేటర్ గా ఉన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. జడేజా బిట్స్ అండ్ పీసెస్ (అరొకరగా పనికొచ్చేవాడు) ఆటగాడు అని అభివర్ణించాడు. దీనికి అతడు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇండియాకు నీకంటే నేను ఎక్కువ మ్యాచ్ లు ఆడానంటూ ఎద్దేవా చేశాడు. వెర్బల్ డయేరియా ఆపు అంటూ నిప్పులు చెరిగాడు. అంతేకాదు.. న్యూజిలాండ్ తో నాడు జరిగిన సెమీఫైనల్లో అద్భుతమైన పోరాటంతో హాఫ్ సెంచరీ చేశాడు. దాదాపు గెలిపించినంత పని చేశాడు. బ్యాడ్ లక్ కొద్దీ ఔటయ్యాడు. దీంతో మంజ్రేకర్ దే అప్పు అని అందరూ మండిపడ్డారు.
కోహ్లిది తప్పించుకునే వాదం అనేలా...
తాజాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి గురించి కూడా మంజ్రేకర్ నోరు జారాడు. టి20లు, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చి సులువైన ఫార్మాట్ వన్డేల్లో కొనసాగుతున్నాడని వ్యాఖ్యానించాడు. లోపాలను సరిదిద్దుకోకుండా .. టాపార్డర్ బ్యాటర్ కు సులువైన వన్డేలలో ఆడుతున్నాడని విమర్శించాడు. అంతేకాదు.. కోహ్లిని అతడి తరంలో సమ ఉజ్జీలైన ఇంగ్లండ్ స్టార్ రూట్, న్యూజిలాండ్ మేటి బ్యాటర్ విలియమ్సన్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో పోల్చాడు. వీరంతా టెస్టుల్లో కొనసాగుతున్నారని, విరాట్ మాత్రం గుడ్ బై చెప్పడం బాధాకరం అని అభివర్ణించాడు. కోహ్లి మొత్తంగా రిటైరైనా బాగుండేదని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లి అన్న వికాస్ కోహ్లి తాజాగా నిప్పులు చెరిగాడు.
చెప్పడం సులువే...
ఎవరికైనా ఎదుటివారికి చెప్పడం సులువేనని, చేయడమే కష్టం అని వికాస్ కోహ్లి సోషల్ మీడియా థ్రెడ్స్ లో పోస్ట్ చేశాడు. అంటే, మంజ్రేకర్.. నీకంటే తన తమ్ముడు చాలా బెటర్ అనే అర్థంలో మాట్లాడాడు. ఇటీవలి మంజ్రేకర్ పోస్ట్ అనంతరం కోహ్లి పలు భారీ ఇన్నింగ్స్ లు ఆడాడు. తాజాగా ఆదివారం న్యూజిలాండ్ మూడో వన్డేలో అద్భుత సెంచరీ కూడా కొట్టాడు. ఇలాంటి ప్రతిసారీ.. వికాస్ కోహ్లి సోషల్ మీడియా ద్వారా సంజయ్ మంజ్రేకర్ ను తగులుకుంటున్నాడు. క్రికెట్ లో సులువైన ఫార్మాట్ గురించి మిస్టర్ ఎక్స్ పర్ట్ ఆఫ్ క్రికెట్ కు ఏమైనా సూచనలు చేస్తారా? అని తాను ఆశ్చర్యపోతున్నాను అని పేర్కొన్నాడు. అలా చేయాలంటే మీరు అక్కడ ఉండాలి.. అంటూ వ్యంగ్యం జోడించాడు. అందుకే, చెప్పడం సులువు.. చేయడమే కష్టం అని అన్నాడు.
మంచి బ్యాటరే కానీ...
సంజయ్ మంజ్రేకర్ ముంబై క్రికెటర్. 37 టెస్టులు, 74 వన్డేలు ఆడాడు. ఈయన తండ్రి విజయ్ మంజ్రేకర్ కూడా దేశానికి ఆడాడు. 55 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. దాదాపు 40 సగటుతో బ్యాటింగ్ చేశాడు. ఇక సంజయ్.. రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్ గా మారాడు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.