మిచెల్ మిస్సైల్.. ఐపీఎల్ లో అన్ సోల్డ్.. టీమ్ఇండియాపై పిడుగు

మిచెల్ నాణ్య‌మైన బ్యాట్స్ మ‌న్ మాత్ర‌మే కాదు.. బంతిని అంతే బ‌లంగా కొట్ట‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న‌వాడు.;

Update: 2026-01-19 04:18 GMT

84... 131 నాటౌట్, 137... మొత్తం మూడు మ్యాచ్ లు 352 ప‌రుగులు..! ఇదేదో సొంత దేశంలో అల‌వాటైన పిచ్ ల‌పై చేసిన ప‌రుగులు కాదు.. స్పిన్న‌ర్ల‌కు స‌హ‌క‌రించే, నాణ్య‌మైన స్పిన్న‌ర్లున్న భార‌త్ లో ఓ బ్యాట్స్ మ‌న్ చేసిన ప‌రుగులు. ప్ర‌తి మ్యాచ్ లోనూ బ‌రిలో దిగ‌డం.. చివ‌రి వ‌ర‌కు ఆడ‌డం.. జ‌ట్టుకు మెరుగైన స్కోరు అందించ‌డం..! ఇదీ న్యూజిలాండ్ జ‌ట్టు మిడిలార్డ‌ర్ బ్యాట్స్ మ‌న్ డారిల్ మిచెల్ తాజా వ‌న్డే సిరీస్ లో ఆడిన తీరు. తొలిసారి త‌మ జ‌ట్టు భార‌త్ లో వ‌న్డే సిరీస్ గెల‌వ‌డంలో మిచెల్ దే కీల‌క పాత్ర‌. ఇక్క‌డ విచిత్రం ఏమంటే.. ఇదే మిచెల్ ను నెల కింద‌ట జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలంలో ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అలాంటివాడు ఇప్ప‌డు భార‌త్ కు వ‌చ్చి దుమ్మురేపాడు. త‌న‌ను తీసుకోక‌పోవ‌డం ఎంత‌టి త‌ప్పిద‌మో ఐపీఎల్ ఫ్రాంచైజీల‌కు చాటిచెప్పాడు.

రూ.2 కోట్ల‌కు కూడా ప‌నికిరాడా?

మిచెల్ నాణ్య‌మైన బ్యాట్స్ మ‌న్ మాత్ర‌మే కాదు.. బంతిని అంతే బ‌లంగా కొట్ట‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న‌వాడు. ఇది స‌రిగ్గా టి20ల‌కు స‌రిపోతుంది. కానీ, ఓవ‌ర్ లుక్ లోనేమో..? ఏ ఫ్రాంచైజీ కూడా మిచెల్ ను తీసుకోలేదు. గ‌త డిసెంబ‌రు 16న అబుదాబిలో జ‌రిగిన మినీ వేలంలో డారిలి మిచెల్ కేవ‌లం రూ.2 కోట్ల బేస్ మ‌నీతో వేలానికి వ‌చ్చాడు. అయితే, మొద‌టినుంచి ఎవ‌రూ అత‌డిపై ఆస‌క్తి చూప‌లేదు. ఆశ్చ‌ర్య‌క‌రంగా మిచెల్ కంటే త‌క్కువ సామ‌ర్థ్యం ఉన్న బ్యాట్స్ మెన్ ను మంచి ధ‌ర‌కు తీసుకున్నారు. ఇలాంటి వారు రిపీట్ లో వేలంలో అమ్ముడుపోయారు. కానీ, మిచెల్ అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.

అంత‌కుముందు రూ.14 కోట్లు..

మిచెల్ ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 2022లో రూ.75 ల‌క్ష‌ల క‌నీస మొత్తానికి ద‌క్కించుకుంది. 2024లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) ఏకంగా రూ.14 కోట్లు వెచ్చించింది. 2025లో మిచెల్ ఐపీఎల్ ఆడ‌లేదు. ఈ ఏడాది సీజ‌న్ కు మినీ వేలంలో న‌మోదు చేసుకున్నా ఏ ఫ్రాంచైజీ కూడా మొగ్గుచూప‌లేదు. బ‌హుశా.. భార‌త్ పై వ‌న్డే సిరీస్ లో అత‌డి ప్ర‌ద‌ర్శ‌న చూశాక తాము త‌ప్పు చేసిన‌ట్లు గ్ర‌హిస్తాయేమో? ఎందుకంటే గ‌త ఆరు వ‌న్డేల్లో మిచెల్ మూడు సెంచ‌రీలు, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఇత‌డు ఉప‌యుక్త‌మైన బౌల‌ర్.. మంచి ఫీల్డ‌ర్ కూడా.

Tags:    

Similar News