టి20 ప్రపంచ కప్ ను బంగ్లాతో పాటు పాక్ కూడా బహిష్కరిస్తుందా?
టి20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలో జరుగుతుంది. పెహల్గాం దాడి నేపథ్యంలో పాక్ ఆటగాళ్లకు భారత వీసాలు లేవు.;
సహజంగానే భారత వ్యతిరేకతను నిలువెల్లా నింపుకొన్న బంగ్లాదేశ్... తమ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం, తమ దేశ ప్రధాన పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ తప్పించడంతో రగిలిపోతోంది. వాస్తవానికి ముస్తాఫిజుర్ వివాదం వేరు. అతడిని డిసెంబరు 16న జరిగిన ఐపీఎల్ వేలంలో రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ తీసుకుంది. ఈ దేశం నుంచి వచ్చే సీజన్ కు ఎంపికైన ఆటగాడు ఇతడొక్కడే. కాగా, ముస్తాఫిజుర్ ఎంపిక నాటికి బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులపై ఎలాంటి దాడులు జరగడం లేదు. కానీ, గత 20 రోజులుగా పరిస్థితులు తీవ్రంగా మారాయి. హిందువులనే లక్ష్యంగా చేసుకుంటూ బంగ్లాలో ఉన్మాదులు హత్యలు, దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ఆ దేశ ఆటగాడిని ఐపీఎల్ లో ఆడిస్తారా?అంటూ భారత్ లో తీవ్ర విమర్శలు రాసాగాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సూచన మేరకు ముస్తాఫిజుర్ ను లీగ్ నుంచి విడుదల చేశారు. దీనిని మనసులో పెట్టుకుని.. భద్రతను సాకుగా చూపుతూ భారత్ లో జరిగే టి20 ప్రపంచకప్ లో ఆడలేం అంటూ బంగ్లా తిక్క వాదనను తెరపైకి తెచ్చింది. ఈ జట్టు ఆడాల్సిన మూడు మ్యాచ్ లు వారికి ఎంతో దగ్గరగా, చాలా అనుబంధం ఉండే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోనే. మరొకటి మాత్రం ముంబైలో. అయినప్పటికీ కొర్రీలు పెడుతోంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). తమ మ్యాచ్ లను మరో ఆతిథ్య దేశం శ్రీలంకకు మార్చాలని కోరుతోంది. బంగ్లాకు సర్దిచెప్పేందుకు కొద్ది రోజుల కిందట ఐసీసీ ప్రతినిధులు ఆ దేశంలో పర్యటించారు. భారత్ లో ఆడాలా? వద్దా? అనేది రెండు రోజుల్లో తేలనుంది. తాజాగా వస్తున్న కథనాలు ఏమంటే బంగ్లాకు తోడుగా పాకిస్థాన్ కూడా కొర్రీలు పెడుతోందట?
పాక్ మ్యాచ్ లు లంకలో కదా?
టి20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలో జరుగుతుంది. పెహల్గాం దాడి నేపథ్యంలో పాక్ ఆటగాళ్లకు భారత వీసాలు లేవు. అసలు ఆ దేశంలో ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకునే ఉద్దేశంలో లేదు మన దేశం. కానీ, ఐసీసీ టోర్నీ కాబట్టి తప్పదు. అయితే, టి20 ప్రపంచ కప్ లో తమ మ్యాచ్ లను పాకిస్థాన్ ఆడేది శ్రీలంకలో. ఒకవేళ భారత్-పాక్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ కూడా లంకలోనే జరుగుతుంది. అంటే, పాక్ జట్టు భారత్ లో అడుగుపెట్టేదే ఉండదు.
బంగ్లాకు పాక్ వంత పాట
టి20 ప్రపంచ కప్ విషయంలో బంగ్లా దౌత్యపరంగా మద్దతు కోసం పాకిస్థాన్ తో చేతులు కలుపుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లా గనుక పాల్గొనకుంటే తామూ పాల్గొనబోమని పాక్ వంతపాడుతున్నట్లు అంటున్నారు. అసలు పాక్ మ్యాచ్ లు భారత్ లోనే లేవు. అలాంటప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఇక్కడ దాని ఉద్దేశం కేవలం భారత్ ను ఇరకాటంలో పెట్టడం.
వారి పప్పులేం ఉడకవు..
భారత్ తో పోలిస్తే బంగ్లా, పాక్ క్రికెట్ బోర్డులది చాలా చిన్న బతుకు. మన ముందు వారివి పిల్ల ఆటలే. ఒకవేళ టి20 ప్రపంచ కప్ ను బాయ్ కాట్ చేస్తే నష్టపోయేది వారే. అసలే ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నది భారతీయుడైన జై షా. ఇప్పటికే తానేంటో ఆయన చూపారు. ఇప్పుడు బంగ్లా, పాక్ తోకలు జాడిస్తే.. వాటిని కత్తిరించడం ఖాయం. ఈ రెండు జట్లు లేకున్నా టి20 ప్రపంచ కప్ నకు వచ్చే నష్టం ఏమీ ఉండదు.